గ్రామ పంచాయతీగా సున్నిపెంట  | Sunnipenta to Become a Gram Panchayat | Sakshi
Sakshi News home page

గ్రామ పంచాయతీగా సున్నిపెంట 

Published Wed, Jul 24 2019 12:34 PM | Last Updated on Wed, Jul 24 2019 12:36 PM

Sunnipenta to Become a Gram Panchayat - Sakshi

సున్నిపెంటలో బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకుంటున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు

కర్నూలు(అర్బన్‌): రెవెన్యూ గ్రామంగా ఉన్న సున్నిపెంట ఇక గ్రామ పంచాయతీగా మారనుంది. మంగళవారం రాజధాని అమరావతిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన హై లెవెల్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు గోపాలక్రిష్ణ ద్వివేది, ఆదిత్యనాథ్‌ దాస్, పీఆర్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, జిల్లా కలెక్టర్‌ జి వీరపాండియన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్‌ ప్రభాకర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ జె. హరిబాబుతో పాటు అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. ముందుగా నీటి పారుదల, అటవీ, పంచాయతీకి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా  సున్నిపెంటను గ్రామ పంచాయతీగా గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారని  జిల్లా పంచాయితీ అధికారి కేఎల్‌ ప్రభాకర్‌రావు చెప్పారు. అలాగే ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం ఉన్న జనవాసాలు  1468 ఎకరాలకు మించకుండా రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన అధికారులు సంయుక్తంగా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారన్నారు.  గ్రామ పంచాయతీ ఏర్పాటుకు సంబంధించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ప్రతిపాదనల రూపంలో పంపాలని జిల్లా కలెక్టర్‌ను కోరారన్నారు.  త్వరలోనే సున్నిపెంటను గ్రామ పంచాయతీగా గుర్తిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్లు డీపీఓ తెలిపారు.

నాడు వైఎస్‌ఆర్‌ ప్రకటించారు 
2006 వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీఓ నంబర్‌ 2 జారీ చేస్తూ సున్నిపెంటను గ్రామ పంచాయతీగా ప్రకటించారు. ఈ విషయాన్ని  శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి కమిటీ ముందు పెట్టారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో సున్నిపెంట గ్రామం ఉందని పంచాయతీగా మారిస్తే అటవీ శాఖ భూములు అన్యాక్రాంతమవుతాయని అభ్యంతరం తెలపగా అందుకు శిల్పా అటవీభూముల సరిహద్దుల వద్ద ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకునేందుకు రూ. 25 లక్షల నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఇందుకు అటవీ అధికారులు సమ్మతించడంతో గ్రామ పంచాయతీ ప్రకటనకు  లైన్‌ క్లియర్‌ అయింది.  ఈ విషయం తెలియగానే సున్నిపెంటలోని పార్టీ కార్యాలయలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ నాయకులు శిల్పాభువనేశ్వరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వట్టి వెంకటరెడ్డి , ముస్లిం మైనార్టీ సెల్‌ రాష్ట్ర  కార్యదర్శి ఎంఏ రజాక్, మండల నాయకులు భరత్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు బాణ సంచాపేల్చి సంబరాలు చేసుకున్నారు. 

ఇచ్చిన హామీ నెరవేర్చా 
సున్నిపెంటను గ్రామపంచాయతీ చేయిస్తానని ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నాను. ఇందు కోసం ముఖ్యమంత్రిని పలుమార్లు కలిశాను. ఎల్టకేలకు గ్రామ పంచాయతీ కావడంతో  గ్రామవలంటీర్ల నియామకాలతో పాటు గ్రామ సచివాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక నుంచి సున్నిపెంట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా.  భవిష్యత్‌లో నగర పంచాయతీగా మార్చేందుకు నా వంతు కృషి చేస్తా.  – ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement