సాక్షి, అమరావతి: రాజకీయ నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీగా గెలిచిన 90 రోజుల్లోనే పదవికి రాజీనామా చేశారని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శాసససభలో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అతి తక్కువ రోజుల్లో రాజీనామా చేసిన మండలి సభ్యుడిని తానేఅని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తాము వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నామని.. అయితే టీడీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేస్తేనే తమ పార్టీలో చేర్చుకుంటామని వైఎస్ జగన్ చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. ఆయన సూచన మేరకు, విలువలకు గౌరవించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నైతిక విలువలు అనే పదానికి అర్థం లేకుండా చేసిందని.. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని అనేక అవినీతి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనవద్దని తాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనేక సార్లు చెప్పానని.. కానీ తన మాట వినకుండా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి 23 ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చక్రపాణి మండిపడ్డారు. ఆనాడు తన మాటవిని ఉంటే ఈరోజు చంద్రబాబు పరువు కాపుడుకునేవారని అన్నారు. రాజకీయ నాయకులు పార్టీలు మారకుండా పటిష్టమైన చట్టాలను తీసుకురావాలని సభలో ఆయన కోరారు. శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామం 60 ఏళ్లుగా కనీసం గ్రామ పంచాయతికి నోచుకోలేదని.. ఇటీవల సీఎం దృష్టికి తాను తీసుకువస్తే.. కేవలం పదిహేను రోజుల్లోనే గ్రామ పంచాయతీ చేశారని అభినందించారు. ఇలాంటి సీఎం దేశ చరిత్రలో ఎవరూ ఉండరని ఆయన కొనియాడారు.
చంద్రబాబు అసెంబ్లీలోఅడుగుపెట్టడానికి అనర్హుడు..
ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నీరుగార్చి ఘనుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రజలను అనేక మోసాలకు గురిచేసిన చంద్రబాబు శాసన సభలో అడుగుపెట్టడానికి అనర్హుడని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను తొలుత ప్రోత్సహించింది ఆయన కాదా అని సభలో ప్రశ్నించారు. అంతేకాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో అనేక మంది అధికారులపై దాడులు జరిగాయని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment