ఇదేమి పారదర్శక పాలన?
సర్కార్‌పై స్పీకర్ గరం
బెంగళూరు : ‘ పారదర్శక పాలనంటే ఇదేనా. ముందు అవినీతిపరులపై చర్యలు తీసుకోండి’ అంటూ మంత్రులపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప మండిపడ్డారు. ఇలా విపక్ష నాయకులపైనే కాక స్వపక్షమైన కాంగ్రెస్ మంత్రులపై కూడా స్పీకర్ కాగోడు తిమ్మప్ప గరం అయ్యారు. స్పీకర్ స్థానానికి తరతమ భేదం లేదని మరోసారి రుజువు చేశారు. వివరాలు... బుధవారం శాసనసభ సమావేశాల కార్యక్రమాల్లో భాగంగా శృంగేరి జిల్లా పంచాయిత్‌లో జరిగిన నిధుల దుర్వినియోగానికి సంబంధించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని నియోజక వర్గ ఎమ్మెల్యే జీవరాజ్ స్పీకర్ ద్వారా న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర దృష్టికి తీసుకువచ్చారు. పూర్వాపరాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సమాధానం ఇస్తుంటే మధ్యలో కలుగ జేసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప ‘పారదర్శక పాలన అంటూ చెప్పుకుచ్చే మీరు ఆరోపణలు ఉన్న అధికారిని అదేస్థానంలో ఎలా కొనసాగిస్తారు. మొదట ఆయన్ను తొలగిస్తామని ఇప్పుడే చెప్పండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు మంత్రి ఆధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు అప్పటికప్పుడు ప్రకటన చేశారు.
అంతేకాకుండా విపక్షాలు అడిగాన ఓ ప్రశ్నకు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే సుదీర్ఘ జవాబు ఇస్తుండటం విని ‘సూటిగా చెప్పండి. సమయం వృథా చేయకండి’ అని సూచించారు. ఇదిలా ఉండగా విపక్ష శాసనసభ్యులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ‘అందుకు అనుగుణమైన ప్రశ్న నేను అడుగుతాను... నేను కూడా’ అంటూ లేచినిలబడి సభలో గందరగోళ పరిస్థితులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సృష్టించడం మొదలు పెట్టారు.
దీంతో ఆగ్రహించిన స్పీకర్ తిమ్మప్ప ‘మొదట మీరు మీ స్థానాల్లో కుర్చొండి. నా అనుమతి లేకుండా ప్రశ్నలు ఎలా అడుగుతారు. ఇలా చేయడం సరికాదు. విలువైన సభాసమయాన్ని వృథా చేయకండి’ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో పరిస్థితిని చక్కదిద్దారు.