పారదర్శక పాలనలో మరో ముందడుగు | AP Government Change Rules In Property Registration | Sakshi
Sakshi News home page

పారదర్శక పాలనలో మరో ముందడుగు

Published Mon, Oct 14 2019 4:41 AM | Last Updated on Mon, Oct 14 2019 8:41 AM

 AP Government Change Rules In Property Registration - Sakshi

సాక్షి, అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలన లక్ష్యంగా రిజిస్ట్రేషన్‌ శాఖ వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దళారుల ప్రమేయం లేకుండా సామాన్యులు సైతం సులువుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతో అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అక్రమాలకు చెక్‌ పెట్టడమే ధ్యేయంగా రిజిస్ట్రేషన్‌ శాఖ.. న్యాయ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ రంగాల నిపుణులతో సంప్రదించి ఏయే అంశాలు తప్పనిసరిగా ఉండాలో చర్చించి సులభమైన రీతిలో నమూనా దస్తావేజులను రూపొందించింది. దీంతో ఎవరి డాక్యుమెంట్లను వారే సులభంగా రూపొందించుకునేలా కసరత్తు ప్రారంభించింది. భూములు, స్థలాలు, భవనాలు స్థిరాస్తుల అమ్మకం, బహుమతి, భాగం (పార్టిషన్‌), తనఖా, విడుదల (రిలీజ్‌)కు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు 16 రకాల నమూనా డాక్యుమెంట్లను తెలుగు, ఇంగ్లిష్‌లో రూపొందించి రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ దిశగా కొత్త విధానాన్ని రూపొందించి కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.  

ఇప్పటిదాకా దళారులే ఆధారం
ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు డాక్యుమెంట్లు (దస్తావేజులను) రాయడం కోసం ఎంత చదువుకున్న వారైనా దస్తావేజు లేఖరులు/దళారులను ఆశ్రయిస్తున్నారు. సొంతంగా దస్తావేజులు రాసుకునే వారు ఒక శాతం కూడా లేరు. దస్తావేజులు రాయడం అనేది సంక్లిష్టంగా ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల వివిధ రకాల రిజిస్ట్రేషన్లు చేసుకోదలచిన వారు లేఖరులను కలిసి దస్తావేజులను రాయించుకుంటున్నారు. ఒక్కో దస్తావేజు తయారీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ తీసుకుంటున్నారు. చాలాచోట్ల దస్తావేజు లేఖరులు/దళారులు తామే రిజిస్ట్రేషన్లు చేయిస్తామంటూ రిజిస్ట్రేషన్‌ అధికారులకు ముడుపులు ఇచ్చేందుకంటూ వేలల్లో డబ్బు వసూలు చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ ఇలా..
అవసరం ఉన్న వారెవరైనా రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్లను (విక్రయం, బహుమతి, భాగం..) డౌన్‌లోడ్‌ చేసుకుని ఆన్‌లైన్‌లోనే అమ్మకందారులు, కొనుగోలుదారులు, ఆస్తులు, సర్వే/ ఇంటి నంబరు, సాక్షులు, చిరునామాలు లాంటి ఖాళీలను పూరిస్తే సమగ్రమైన డాక్యుమెంట్‌ తయారవుతుంది. దానిని ప్రింటవుట్‌ తీసుకుని సబ్‌మిట్‌/అప్‌లోడ్‌ చేస్తే నమోదు చేసిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళుతుంది.

ఆస్తి వివరాలు (సర్వే నంబరు, విస్తీర్ణం/ ప్లాట్‌ నంబరు విస్తీర్ణం) లాంటివి నమోదు చేయగానే ఆటోమేటిగ్గా రిజిస్ట్రేషన్‌ కోసం ఎంత రుసుం (రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంపు డ్యూటీ, బదిలీ సుంకం) చెల్లించాలో కూడా ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. ఆ మేరకు ఆన్‌లైన్‌లోనే చెల్లించే విధానం ఇప్పటికే ఉంది. ఏరోజు, ఏసమయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోదలిచారో కూడా ఆన్‌లైన్‌లోనే నమోదు చేసి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. నిర్ధిష్ట సమయానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి అరగంటలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

డబ్బు , సమయం ఆదా
నూతన విధానం వల్ల డాక్యుమెంట్ల (దస్తావేజుల) తయారీ కోసం దళారులను ఆశ్రయించి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. దీనివల్ల అటు డబ్బు, ఇటు సమయం ఆదా అవుతాయి. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ వినూత్న విధానం వల్ల పూర్తిగా అవినీతికి చెక్‌ పడుతుందని, పారదర్శకత పెరుగుతుందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఎంపిక చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి తగు మార్పు చేర్పులతో నవంబర్‌ ఒకటో తేదీ నుంచి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించింది.

నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు రిజిస్ట్రేషన్‌ శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ శాఖ అధికారులు రెండు బృందాలుగా ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఒక్కో రోజు రెండు జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ సదస్సులకు విద్యావంతులు, పుర ప్రముఖులు, న్యాయవాదులు, వైద్యులు, రియల్టర్లు, బిల్డర్లు లాంటి వివిధ వర్గాల వారిని ఆహ్వానిస్తున్నారు.

కొత్త విధానం గురించి వివరించడంతోపాటు అవసరమైన మార్పు చేర్పులకు సంబంధించి వీరి నుంచి సూచనలు, సలహాలు కూడా స్వీకరిస్తారు. ఇందులో విలువైన, ఆచరణాత్మక సూచనలు ఉంటే వీటిని కూడా చేర్చి  నవంబర్‌ నుంచి రాష్ట్రమంతటా అమలు చేయనున్నారు. ఈ నెల 14న కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న వైఎస్సార్, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పు గోదావరి, 18న నెల్లూరు, పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం,  కృష్ణా, 21వ తేదీన గుంటూరు జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు.

దళారులకు బ్రేక్‌
ప్రస్తుతం ప్రజలు స్థిరాస్తుల విక్రయం, బహుమతి, తనఖా ఇతరత్రా ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా దస్తావేజులు రాయించుకోవడం కోసం లేఖరులు/దళారులను ఆశ్రయిస్తున్నారు. కొత్త విధానం వల్ల ఎవరూ ఎవరి వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు. దస్తావేజులను కంప్యూటర్‌లోనే రూపొందించి సంబంధిత సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికి ఆన్‌లైన్‌లోనే పంపవచ్చు. ఆన్‌లైన్‌లోనే స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని నిర్ధిష్ట సమయానికి వెళ్లి గంటలోగానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకుని దస్తావేజు నకళ్లు కూడా తీసుకుని వెళ్లవచ్చు. చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే చేసుకునే వెసులుబాటు ఉన్నందున ఎవరికీ నయాపైసా లంచం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అవినీతి రహిత సుపరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆశయాల మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నాం.
– పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ

అందరి సమస్యా ఇదే..
విశాఖ నగరానికి చెందిన ఒక వ్యాపారి సబ్బవరంలో నాలుగెకరాల భూమి కొనుగోలు చేశారు. దీనిని తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి దస్తావేజు రాయించుకోవడం కోసం దస్తావేజు లేఖరుడైన దళారీని సంప్రదించారు. దస్తావేజు రాయడం, రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోని సిబ్బందికి ముడుపులు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించడం కోసం ఆ దళారి రూ.60 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. దస్తావేజు రాసినందుకే రూ.6 వేలు తీసుకున్నాడు. ప్రస్తుతం రాష్ట్రమంతా దాదాపు ఇదే పరిస్థితి. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ సర్కారు ‘మీ దస్తావేజును మీరే తయారు చేసుకోండి..’ అనే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement