వైఎస్సార్‌సీపీ కార్యకర్తను చూసినా బాబుకు భయమే: వైఎస్‌ జగన్‌ | Jagan Key Comments At Combined Kurnool District YSRCP Leaders Meet Updates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తను చూసినా బాబుకు భయమే: వైఎస్‌ జగన్‌

Published Thu, Apr 10 2025 12:33 PM | Last Updated on Thu, Apr 10 2025 1:43 PM

Jagan Key Comments At Combined Kurnool District YSRCP Leaders Meet Updates

గుంటూరు, సాక్షి: జగన్‌ మంచి చేశాడు కాబట్టి చంద్రబాబు(chandrababu) మరింత చేస్తాడని ప్రజలు నమ్మారని.. కానీ, నిత్యం అబద్ధాలతోనే ఇప్పుడు ఆయన నెట్టుకొస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.  మంచి చేశాం కాబట్టే ఇవాళ వైఎస్సార్‌సీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. 

గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన భేటీలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్లకాలువలోనే పడింది. కేవలం ఇచ్చిన మాటకోసం.. ఎందాకైనా వెళ్లాం. ఆ ప్రస్థానంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైయస్సార్‌సీపీ(YSRCP) ఎదిగింది. ఆరోజు నుంచీ నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటినుంచి ఇప్పటివరకూ నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైఎస్సార్‌సీపీ. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. గట్టిగా ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. నాలో ఈరెండింటిని చూసి నాతోపాటుగా మీరంతా అడుగులో అడుగు వేశారు. 

👉రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవ్వాళ్టికీ కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన ఏ నాయకుడైనా గర్వంగా కాలర్‌ ఎగరవేసుకుని ప్రజల వద్దకు వెళ్లగలడు. ప్రతి కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరించి ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ మన నాయకులకు మాత్రమే ఉంది. మనం రాకముందు రాజకీయాలు ఒకలా ఉండేవి. మనం వచ్చిన తర్వాత రాజకీయాలకున్న అర్ధాన్ని మార్చాం. ఇచ్చిన మాటకు ఎవరైనా కట్టుబడి ఉండాలని చెప్పాం. 

రాజకీయ అవసరాలకోసం గతంలో ఇష్టం వచ్చినట్టు మేనిఫెస్టో ఇచ్చేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసేవారు. మనం వచ్చాక, మేనిఫెస్టోను ఒక పవిత్రమైన గ్రంధం మాదిరిగా భావించాం. ప్రతి అంశాన్నీ నెరవేర్చాలని తపన, తాపత్రయం పడ్డాం. కోవిడ్‌ ఉన్నా సరే అన్ని హామీలను నెరవేర్చాం. సంక్షోభం ఉన్నా, ఏరోజూ సాకులు వెతుక్కోలేదు. 99శాతం పైచిలుకు హామీలను నెరవేర్చాం. గడపగడపకూ ప్రతి ఇంటికీ వెళ్లాం. ఇన్ని చేసినా మనం ఓటమి చెందాం. 

👉చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు. ప్రతి ఇంటికీ తన మనుషులను చంద్రబాబు పంపాడు. కరపత్రాలు, బాండ్లు చంద్రబాబు పేరిట పంచారు. ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. దీనివల్ల పదిశాతం ప్రజలు చంద్రబాబును నమ్మారు. జగన్‌ చేశాడు కాబట్టి, చంద్రబాబుకూడా చేస్తాడని నమ్మారు. జగన్‌కన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మారు. చంద్రబాబు మారాడేమోనని ప్రజలు నమ్మారు. అందుకే 50శాతం నుంచి 40శాతానికి మన ఓటు షేరు తగ్గింది. కానీ, 

చంద్రబాబు వచ్చి 11 నెలలు అయిపోయింది. రెండు బడ్జెట్లు పెట్టాడు(Chandrababu Budgets). చంద్రబాబు నాయుడు హామీలు నెరవేరుస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. మాట ఇచ్చాను కాని, ఇప్పుడు భయం వేస్తుందని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు. రాష్ట్రానికున్న అప్పులపై అబద్ధాలు చెప్తున్నారు. ప్రతిరోజూ అబద్ధాలు చెప్తునే ఉన్నారు. 

👉జగన్‌ ఉన్నప్పుడు నాలుగువేళ్లూ నోట్లోకి వెళ్లాయని ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు ఉన్న ప్లేటును చంద్రబాబు లాగేశాడని అనుకుంటున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పూర్తి తిరోగమనం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీకి రూ.3,500 కోట్లు బకాయి పెట్టారు. దీంతో వైద్యం చేయలేమని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర రావడంలేదు. రైతులకు పెట్టుబడి సహాయం అందడంలేదు. ఫీజు రియింబర్స్‌మెంట్‌, వసతి దీవెన అందడంలేదు. పరిపాలనలో పారదర్శకత పూర్తిగా పక్కకు పోయింది. 

రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలన(Red book Rule) కొనసాగుతోంది. అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి గ్రామంలోనూ మద్యం షాపులు, బెల్టుషాపులు యధేచ్చగా వెలిశాయి. పేకాట క్లబ్బలు, ఇసుక, మట్టి, మైనింగ్‌ మాఫియాలు నడుస్తున్నాయి. వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి. చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటికీ పార్టీ శ్రేణులు, నాయకులు కలిసికట్టుగా నిలవాలి. గ్రామస్థాయి నుంచి వ్యవస్థీకృతంగా పార్టీ ఉండాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలవాలి.

చంద్రబాబుగారూ.. ప్రజలకు మంచి చేయొచ్చు కదా?. ఇచ్చిన హామీలను నెరవేర్చొచ్చు కదా?. ఇంతలా దిగజారిపోవాల్సిన అవసరం ఉందా?. ఏపీ పూర్వపు బిహార్‌ రాష్ట్రంలా తయారయ్యింది. అసలు చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు?. ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తున్నారు?. ఎందుకంటే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే చంద్రబాబు భయం. వైయస్సార్‌ సీపీ కార్యకర్త అంటే కూడా చంద్రబాబుకు భయం. చంద్రబాబు హామీల అమల్లో, పాలనలో ఘోరంగా విఫలమయ్యారు. టీడీపీ కేడర్‌, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకు దగ్గరకు వెళ్తే కచ్చితంగా నిలదీస్తారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం యుద్ధం చేస్తున్నాం. కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడాలి. మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈసారి జగన్‌ 2.O పాలన కచ్చితంగా మీరు చూస్తారు. ప్రతి కార్యకర్తకు జగన్‌ భరోసాగా ఉంటాడు. విలువలు, విశ్వసనీయతకు దర్పణంలా పార్టీని నిలుపుదాం అని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ అన్నారు. 

ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, శిల్పా రవి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement