సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతమొద్దిస్తానంటూ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విస్తతంగా ప్రచారం చేశారు. అవినీతిపరులు ఎవరైనా సరే, ఆఖరికి తన పార్టీ వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ‘చేతనైతే చేయి లేదంటే చచ్చిపో’ అంటూ జాతిపిత మహాత్మాగాంధీ నినాదమిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 2022 వరకల్లా అవినీతి రహిత దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని భరోసా కూడా ఇచ్చారు. 2జీ స్పెక్ట్రమ్ లాంటి భారీ అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కున్న కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని, స్కామ్‌లకు బాధ్యులైన వారంతా శిక్షలు అనుభవించాల్సిందేనని మోదీ చెప్పారు.(సాక్షి ప్రత్యేకం)
అవినీతికి వ్యతిరేకంగా నాడు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించడం వల్ల ఆయన నాయకత్వాన భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. మరి, ఈ మూడున్నర ఏళ్ల కాలంలో అవినీతి నిర్మూలనకు ఎలాంటి చర్యలు మోదీ ప్రభుత్వం తీసుకుంది? అవినీతిపరుల్లో ఎంత మందికి శిక్షలు పడ్డాయి? సరైన సాక్షాధారాలు లేవంటూ 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ కేసును ఈనెల 21వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు ఎందుకు కొట్టివేయాల్సి వచ్చింది? అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డుకన్నా మోదీ ప్రభుత్వం రికార్డేమీ మెరుగ్గా లేదు.
అవినీతికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఈ మూడున్నర ఏళ్ల కాలంలో ఎన్నిచర్యలు తీసుకుందో తెలుసుకోవడానికి ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద పీఎంవో కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధానంగా మూడు ప్రశ్నలు వేశారు.(సాక్షి ప్రత్యేకం) దేశంలో దాదాపు ఐదువేల మంది ఐఏఎస్ అధికారులు ఉండగా, వారిలో వంద మందిపైనా అవినీతి ఆరోపణలు రాగా, వారిలో ఎంత మందిపై ఫిర్యాదులు నమోదు చేసుకున్నారని, ఎంత మందిపై విచారణ కొనసాగుతోంది, ఎంత మందికి శిక్షలు పడ్డాయన్నది మొదటి ప్రశ్న. ఐఏఎస్‌ల అవినీతి గురించి ప్రధాని కార్యాలయాన్ని అడగడానికి కారణం వారిని విచారించాలన్నా, శిక్ష విధించాలన్నా నిర్ణయం తీసుకోవాల్సిందీ ప్రధానియే కనుక.
12 మంది అవినీతి ఐఏఎస్ అధికారులపై చర్యకు ఉపక్రమించామని, విచారణ పూర్తయ్యేందుకు 12 ఏళ్లు పడుతుందని కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. 2012 నుంచి 2014 మధ్య, రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోగా బీజేపీ మూడున్నర ఏళ్ల కాలంలో 12 మందిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఐఏఎస్ అధికారులపై రెండు రకాలుగా విచారణ జరుగుతుంది. అవినీతి నిరోధక చట్టం కింద కోర్టులో విచారణ ఒకవైపు జరిగితే, డిపార్ట్‌మెంట్‌పరంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో మరోవైపు విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం సదరు అధికారి దోషిగా తేలితే ఆయనపై విజిలెన్స్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ నోడల్ మినిస్ట్రీకి నివేదికను పంపిస్తుంది.(సాక్షి ప్రత్యేకం) ఆ నోడల్ మినిస్ట్రీ కూడా తగిన చర్యలకు సిఫార్సు చేస్తుంది. అవినీతికి పాల్పడిన ఐఏఎస్ అధికారిని తక్షణమే పదవి నుంచి తొలగించాలా లేదా పదవి విరమణ చేయించాలా, పదవీ విరమణ తర్వాత వారికొచ్చే పింఛన్ సొమ్ములో కోత విధించాలా? తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ప్రధాన మంత్రిదే. రెండేళ్ల కాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చట్టం సూచిస్తున్నా ఈ ప్రక్రియ పూర్తచేయడానికి సంబంధిత ప్రభుత్వాలు ఏడెనిమిదేళ్లు తీసుకుంటున్నాయి. ఈలోగా ప్రభుత్వాలే మారిపోతున్నాయి.
ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు తదితరుల అందరిపై వచ్చే అవినీతి ఆరోపణల కేసులను విచారించేందుకు వీలుగా లోక్‌పాల్‌ను ఇంతవరకు ఎందుకు ఎంపిక చేయలేదన్న సామాజిక కార్యకర్త ప్రశ్నకు మోదీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లోనే తీసుకొచ్చింది. దాన్ని తక్షణమే అమలు చేయాలంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్లమెంట్ లోపల, వెలుపల పెద్ద ఎత్తున గొడవ చేయడంతో 2014, జనవరిలో యూపీఏ ప్రభుత్వం చట్టాన్ని నోటిఫై చేసింది. అదే ఏడాది మే నెలలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొదట్లో లోక్‌పాల్ ఊసుకూడా ఎత్తలేదు.(సాక్షి ప్రత్యేకం) ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఇతర రాజకీయ పక్షాలు లోక్‌పాల్ నియామకం గురించి ప్రశ్నించగా లోక్‌పాల్‌ను ఎంపికచేసే ప్యానల్‌లో ప్రతిపక్షం నాయకుడు తప్పనిసరిగా ఉండాలని, పార్లమెంట్‌లో ఎవరికి ఆ హోదా రాకపోవడంతో నియామక ప్రక్రియను చేపట్టలేకపోతున్నామని మోదీ ప్రభుత్వం సమర్థించుకుంది.
చట్టం ప్రకారం లోక్‌సభలోని 545 సీట్లలో కనీసం పది శాతం సీట్లు లభిస్తేనే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. లోక్‌సభలో పాలకపక్షం తర్వాత ఏ పార్టీకి అధిక సీట్లు లభిస్తే అదే ప్రతిపక్షం అవుతుందని, అందుకు అనువుగా చట్టాన్ని ఎందుకు మార్చడం లేదని సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా విమర్శించడంతో 2014, డిసెంబర్ నెలలో చట్టం సవరణకు ప్రతిపాదన చేసింది. దాన్ని ఆ తర్వాత పార్లమెంట్ స్థాయీ సంఘానికి నివేదించింది. 2015, డిసెంబర్ నెలలో కొన్ని మార్పులతో ఆ నివేదికను కేంద్రానికి స్థాయీ సంఘం నివేదించింది. (సాక్షి ప్రత్యేకం)అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రం పరిశీలనలోనే ఆ నివేదిక ఉందని సామాజిక కార్యకర్త ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ ప్రభుత్వానికైనా అవినీతిని నిర్మూలించడం పట్ల చిత్తశుద్ధి ఉంటే లోక్‌పాల్ నియామకం ఎప్పుడో జరిగేదని రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment