సమాచారానికి గ్రహచారం! | ABK Prasad Article On RTI Amendment Bill | Sakshi
Sakshi News home page

సమాచారానికి గ్రహచారం!

Published Tue, Jul 30 2019 1:07 AM | Last Updated on Tue, Jul 30 2019 1:09 AM

ABK Prasad Article On RTI Amendment Bill - Sakshi

‘‘దేశంలోని పార్లమెంటేరియన్లు తమ పార్లమెంటరీ వ్యాపకాల్ని అబద్ధాలతోనే ప్రారంభిస్తారు’’(All MPs start their Parliamentary careers with lies).
– మాజీ ప్రధాని వాజ్‌పేయి ఉవాచ: ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు రాజీవ్‌ గౌడ్‌ ప్రస్తావన (26–07–2019)

‘‘సకల అధికారాల కేంద్రీకరణ అనేది, అది శాసన వేదిక లేదా పాలక వర్గం లేదా న్యాయవ్యవస్థ తాలూకు అధికారాలన్నీ కొద్దిమంది చేతుల్లో ఉన్నప్పుడు వారు ఒకరా, కొద్దిమందా లేదా ఎక్కువమందా లేక వారు వంశపారంపర్య శక్తులా లేదా ఎన్నుకోబడిన శక్తులా అన్నదానితో నిమిత్తం లేకుండానే ఒక్క ముక్కలో చెప్పాలంటే నిరంకుశత్వానికి నికార్సయిన నిర్వచనం’’
– అమెరికా స్వాతంత్య్ర ప్రదాతలలో ఒకరైన జేమ్స్‌ మాడిసన్‌ : ది ఫెడరలిస్ట్‌ నం: 47 (1758 జనవరి 30)

‘‘కళ్లు మూసుకుంటే జీవితం తేలిగ్గా గడిపేయవచ్చు. కాని కళ్లు చూస్తున్న దానినల్లా అపార్థంగా భావించడమే అసలు దోషం!’’
– జాన్‌ లెన్నిన్‌ : లూథర్‌ కింగ్‌ సమఉజ్జీ

నిజమే, మన కళ్లముందే చాలా ఘటనలు (అనుకూల ప్రతికూల) అలా డొల్లుకుపోతున్నాయి. బీజేపీ, ఆరెస్సెస్, ఎన్డీయే కూటమి తొలి అయిదేళ్ల పాలన (2014–19)లో నరేంద్ర మోదీ, అమిత్‌ షా కాంబినేషన్‌లో ఎలా మోసపూరిత, ఆర్థిక విధానాలతో, దేశ ప్రజా బాహుళ్యం ఆర్థిక స్థితిగతులను (సంపన్నవర్గాలు మినహా) అర్ధంతరంగా నోట్లరద్దు కార్యక్రమం ద్వారా ఎలా అతలాకుతలం చేసిందీ అనుభవించిన దేశ ప్రజలు చూశారు. ఆ క్రమంలోనే బీజేపీ–ఆరెస్సెస్‌ ఒరిజినల్‌ ఎజెండా అయిన ‘హిందూ రిపబ్లిక్‌’ స్థాపన లక్ష్యంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వందల సంఖ్యలో గత అయిదేళ్లలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన దళితులపైనా, మైనారిటీలపైన అత్యాచారాలకు, హింసా కాండకు, మారణకాండకు తెరలేపారు. ఇది ఉత్తర భారతంలోనే కాకుండా దక్షిణ భారత రాష్ట్రాలకూ ఏదో రూపంలో పాకించి, ప్రజా బాహుళ్యంలో ఆందోళనకు కారణమైంది.

ఈ వరసలోనే జరుగుతున్న దారుణ సంఘటనలకు నిరసనగా ఉద్యమించి ప్రజల్ని సమీకరించి పాలక విధానాలకు నిరసనగా ఉద్యమించిన గోవింద పన్సారే, ప్రొఫెసర్‌ కల్బుర్గి లాంటి పెక్కుమంది మేధావులను, లంకేష్‌ లాంటి పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలను హతమార్చడమో, అరెస్టుల ద్వారా నిర్బంధించడమో జరిగింది. ఈ దారుణ పరిణామాలకు నిరసనగా దేశంలోని పెక్కుమంది మేధావులు తాము గతంలో పొంది ఉన్న అనేక కేంద్ర ప్రభుత్వ బిరుదులను, పురస్కారాలను బీజేపీ ప్రభుత్వ ముఖం మీద కొట్టి స్వాతంత్య్రానంతర దశలో తొలి త్యాగశీలతను ప్రదర్శిం చారు. ఇక ఆ దశ ముగిసిన దరిమిలా కూడా ఇంతకు ముందు దేశ వ్యాపితంగా పేరెన్నికగన్న మేధావుల హత్యకు కారకులైన దుండుగుల్ని (వారెవరో హత్యలు చేయించిన వారికి తెలుసు) గత అయిదేళ్లుగా పట్టి శిక్షించిన ఉదాహరణ ఈరోజుదాకా భారత ప్రజలు ఎరుగరు! కాగా, రెండోసారి అనేక కుంభకోణాల మధ్య, సామాజిక వ్యత్యాసాలకు, ఆర్థిక అసమానతలకు మధ్యనే కుమ్ములాటలు పెంచి తగాదాలు పెంచి, వారిలో కొందరిని చీల్చి కాంగ్రెస్‌ అనుసరించిన విభజించి పాలించే సూత్రాన్నే బీజేపీ పాలకవర్గం కూడా జయప్రదంగా అనుసరించి రెండో దఫా పగ్గాలు అందుకుంది.

పైగా, గెలుపే ప్రధాన ధ్యేయంగా, వాపే బలుపుగా భావించి ప్రతిపక్షాలలో పేరుకున్న అనైక్యతను పెంచి వాటి నుంచి కొందరు సత్తరకాయలను తమ వైపునకు ధన, అధికార ప్రలోభాలతో గుంజుకుని రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. కొద్ది రోజులనాడు రాజ్యసభలో దేశ సమాచార హక్కు పరిరక్షణా చట్టానికి బీజేపీ పాలకులు తెచ్చిన సమాచార వ్యతిరేక సవరణ బిల్లు సందర్భంగా మాట్లాడిన ఒక సీనియర్‌ సభ్యుడు ఆ సవరణ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనకు పంపడానికి ప్రభుత్వం నిరాకరించినందుకు కారణం పేర్కొంటూ. ‘నాకిప్పుడు అర్థమైంది, రెండో దఫా బీజేపీ సంకీర్ణం ఈసారి 303 స్థానాలను లోక్‌సభలో ఏ పద్ధతుల్లో పొంది ఉంటుందోనని’ వ్యాఖ్యానించాల్సి వచ్చింది. 

కథ అంతటితో ముగియలేదు. దేశ పౌరులు సమాచారం పొందే హక్కును గుర్తించి రాజ్యాంగ బద్ధతను పొందిన చట్టాన్ని బీజేపీ అనుకున్న రీతిలో మార్చాలంటే రాజ్యసభ అనుమతి కూడా అవసరం. కానీ రాజ్యసభలో బీజేపీ–ఆరెస్సెస్‌–ఎన్డీఏ కాంబినేషన్‌కు మెజారిటీ లేదు. లేని మెజారిటీని ఎలా ‘కుకప్‌’ చేసి చూపాలి? ఆ పనిని బీజేపీ దొడ్డి దారిన వెళ్లి దారి దోపిడీకి పాల్పడింది. ఈ దోపిడీకి సహకరించిన వాడు చంద్రబాబు స్నేహితుడు, కేసులనుంచి తప్పించుకునేందుకు టీడీపీని వదిలి కాషాయ కండువా కప్పుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్న సీఎం రమేష్‌. ఆర్‌టీఐ సవరణ చట్టానికి ఎలాగోలా మద్దతు కూడగట్టే పనిని ఇతనికి బీజేపీ పురమాయించింది. తైనాతీ పని చెప్పింది చేయడమే. రాజ్యసభలో బీజేపీకి లేని ‘వాపు’ను తీసుకురావడానికి ఓటింగ్‌ ‘స్లిప్పు’ లను తానే నిర్వహించి కొందరి సభ్యులకు వాటినిచ్చి, తిరిగి ఆ స్లిప్పులను సభ మార్షల్‌ వసూలు చేసి సభాధ్యక్షునికి అందజేయాల్సి ఉండగా –రమేష్‌ ఆ పని చేయడం సభాధ్యక్షునికే ఆశ్చర్యం వేసి, ‘ఏంటి మీరు చేస్తున్న పని, మీకేం పని, వెళ్లి నీ స్థానంలో కూర్చో’ అని పలు మార్లు గద్దించాల్సి వచ్చిందని మరవరాదు.

ఈ తకరారు ఓటింగ్‌ ద్వారానే ఆర్టీఐ సవరణ చట్టం సభలో నెగ్గడంతో ‘వాపును బలం’గా చూపించు కోవాల్సి వచ్చింది. ఒకవైపు నుంచి ఆర్టీఐ చట్టాన్ని నీరుకార్చుతూ, మరొ కవైపు నుంచి ‘చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (అన్‌లాఫుల్‌ యాక్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌) సవరణ పేరిట ఏ పౌరుడినైనా ‘టెర్రరిస్టు’ (ఉగ్రవాది)గా ముద్ర వేసే హక్కు కేంద్రానికి దఖలు పడుతుంది. మోదీ రెండోసారి పాలనకు వచ్చిన వెంటనే జరిగిన పని– సుప్రసిద్ధ చలనచిత్ర దర్శక నిర్మాత ఆదూరి గోపాలకృష్ణన్‌పైన, ఇతర స్వతంత్ర భావాలుకల కళాకారులపైన వరుస దాడులను బీజేపీ కనుసన్నల్లో నిర్వహించడం. సామాజిక కార్యకర్తలపైన దళిత బహుజనులపైన, మైనారిటీల పైన తరచుగా పనిగట్టుకుని ఆవుపేరిట, గోమాంసం పేరిట విచ్చలవిడిగా సాగిస్తున్న హింస, దౌర్జన్యాలకు, వేధింపులకు మోదీ అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారు. పాలక పక్షంలో రోజు రోజుకీ అసహనం పెరిగి పోవడానికిగల కారణాలలో ప్రధానమైనవి– రక్షణ శాఖ కొనుగోళ్లలో (ఉదా. రాఫెల్‌) జరిగినట్టు పొక్కిన కుంభకోణాలను, పాలకవర్గంలోని అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల విద్యార్హతలు, ఆర్థిక వ్యవస్థ పతన దశల గురించిన ప్రశ్న పరంపరలను పౌర సమాజాలు, వేగులవాళ్లు (విజిల్‌ బ్లోయర్స్‌) సమాచార హక్కు చట్టం కింద గుచ్చి గుచ్చి ప్రశ్నించడాన్ని పాలకవర్గం సహించలేక పోతోంది.

కనుకనే తొలి ఆర్టీఐ సమ్మతించి అమలులోకి తెచ్చిన ప్రజల ‘సమాచార హక్కు’ చట్టానికి తూట్లు పొడిచి తమ నిరంకుశాధికార ప్రతిపత్తికి రక్షణ కవచంగా వాడుకోవడాన్ని ప్రజలు సహించరు. చివరికి సుప్రీంకోర్టులో అత్యంత ప్రసిద్ధ గౌరవ సీనియర్‌ న్యాయవాదులలో ఒకరుగా పేరొందిన ఇందిరా జైసింగ్, ప్రసిద్ధ సామాజిక కార్యకర్త, న్యాయవాది, ‘లాయర్స్‌ కలెక్టివ్‌’ ఉద్యమ సంస్థ అధ్యక్షుడైన ఆనంద్‌ గ్రోవర్‌ తదితరులపైన ‘విదేశీ విరాళాల రెగ్యులేషన్‌ యాక్టు కింద కేసులు మోపి వేధిస్తోంది పాలక వర్గం. కానీ అదే సమయంలో అనేక బ్యాంకులను మోసం చేసిన బడా బడా ఆర్థిక నేరగాళ్లపై ‘చర్యల’ పేరిట జారీ చేసిన ‘లుకౌట్‌’ నోటీసుల వివరాలు ప్రజలకు వెళ్లడించడానికి మోదీ ‘మనసులోని మాట’ పెగిలి బయటకు రావటం లేదు. తొలి అయిదేళ్ల పాలనలోనే కాదు, రెండవసారి అధికారం చేపట్టిన నేటి దశలో సైతం పెక్కు మత విద్వేష కార్యకలాపాలలో మైనారిటీలను వేధిస్తున్న పలు ఉదాహరణలను, దాడులను ప్రధాని దృష్టికి తెస్తూ వివిధ రంగాలలోని 49 మంది ప్రముఖులు ఈ దారుణ దౌర్జన్యకాండను నిలిపివేయవలసిందిగా విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.

అందుకు పోటీగా ఎవరో 60 మంది సంతకాలతో బీజేపీ ఒక ప్రకటనను విడుదల చేయించింది. టెర్రరిజాన్ని (ఉగ్రవాదాన్ని) ఎదుర్కోవలసిందే– అది వ్యక్తిగతమైనదైనా, అధికార సంస్థాగత ఉగ్రవాదమైనా ఒకటే. అందుకే జాతీయవాది, మత సామరస్యవాది, సంస్కరణ వాది అయిన విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ‘భారతీయ తీరాలు’ పేరిట (ఆన్‌ ది షోర్స్‌ ఆఫ్‌ భారత్‌) పాలక శక్తులకు బుద్ధివచ్చే కవిత రాశారు: 
‘‘భారతీయ తీరాలు/ సకల జాతుల మనుషులను/ఒక్కచోట చేర్చుతాయి/ మేలుకో, ఓ మనసా మేలుకో!/చేతులు బారలు చాపి నిలుచున్నా/ మానవతా దైవానికి నమస్సులు తెలుపుకుంటున్నా/రండి, రండి మానవతా దైవాన్ని మాత్రమే కొలవండి/ఎవరి పిలుపునందుకునోగానీ /మానవులు తీరాలుదాటి తెరలుగా అలలుగా వస్తున్నారు/వీరు భారతమనే మహా సంద్రంలో ఏకమైపోతారు– వారు/ఆర్యులు, అనార్యులు, ద్రావిడులు, హూణులు, పఠాన్లు/మొగలాయీలు– ఒకరా, వీరంతా/ ఒక్క శరీరమై కలసిపోయారు!’’
విశ్వకవి పాఠం పాలకులకు గుణపాఠమైతే అంతకన్నా విశ్వజనీన సత్యం ఎక్కడుంటుంది?!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement