న్యూఢిల్లీ : భారతదేశ లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా భారత సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(66) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ గోవింద్ సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తదితరులు హాజరయ్యారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని లోక్‌పాల్ అంబుడ్స్‌మెన్ వ్యవస్థలో వివిధ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బి భోస్లే, ప్రదీప్ కుమార్ మహంతి, అభిలాష కుమారిలతో పాటుగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ కుమార త్రిపాఠి లోక్‌పాల్ సభ్యులుగా ఉంటారు. వీరందరూ 70 ఏళ్ల వయస్సు వచ్చే నాటికి రిటైర్ అవుతారు.(ఎట్టకేలకు లోక్‌పాల్)
ఎవరీ పీసీ ఘోష్...?
చరిత్రాత్మక లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా నియిమితులైన పీసీ ఘోష్ 1952 మే 28న కోల్‌కతాలో జన్మించారు. ఆయన తండ్రి దివంగత జస్టిస్ శంభూ చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియెర్ కాలేజీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పీసీ ఘోష్.. కలకత్తా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1976లో బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. ఆ పిమ్మట 1997లో కలకత్తా హైకోర్టులో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. తరువాత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను హైకోర్టు నిర్దోషిగా తేల్చగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై ఆమెకు జస్టిస్ ఘోష్ ధర్మాసనమే 2015 జూలైలో నోటీసులు జారీచేసింది. ఇక 2017 మే 27న జస్టిస్ ఘోష్ సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది జూన్ 29 నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు.
లోక్‌పాల్ విధి- విధానాలు...
ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి. సాయుధ బలగాలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. విచారణ కొనసాగుతుండగానే అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ జప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు దాఖలుపరిచారు. అంబుడ్స్‌మన్ అప్పగించిన కేసులను విచారిస్తున్న సమయంలో సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణాధికారం లోక్‌పాల్‌కు కల్పించారు. లోక్‌పాల్ అప్పగించిన కేసును దర్యాప్తు చేసిన అధికారిని దాని అనుమతి లేకుండా బదిలీ చేయరాదు.
కేంద్రంలో లోక్‌పాల్‌గా, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తగా వ్యవహరిస్తున్న ఈ అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ ఏర్పాటు నిమిత్తం 2013లోనే చట్టం తెచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి లోక్‌పాల్ చైర్మన్ పదవికి అర్హులు. లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యుల్ని నియమించొచ్చని సంబంధిత చట్టంలో నిర్దేశించారు. సభ్యుల్లో నలుగురికి న్యాయరంగ నేపథ్యముండాలి. కనీసం 50 శాతం మంది సభ్యులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాల నుంచి ఉండాలి. చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది వర్తిస్తుంది). చైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీం జడ్జీలతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఒకసారి లోకాయుక్తగా నియమితులైన తరువాత ఆయన్ని తొలగించలేరు. బదిలీ చేయలేరు. సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా లోకాయుక్తను పదవీచ్యుతుడిని చేయొచ్చు.
ఇక ఫిబ్రవరి చివరి నాటికి లోక్‌పాల్ నియామకం జరపాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్యానెల్ కమిటీ.. పీసీ ఘోష్‌ను లోక్‌పాల్‌గా ఎంపిక చేశారు. ఇక లోక్‌పాల్ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన.. ఐదేళ్ల తర్వాత, ఎన్నికల ముందు లోక్‌పాల్ నియామకం జరగడం గమనార్హం.
President Kovind administered the Oath of Office to Justice Pinaki Chandra Ghose as Chairperson, Lokpal, at a ceremony held at Rashtrapati Bhavan pic.twitter.com/flXLRbjWjg
— President of India (@rashtrapatibhvn) March 23, 2019
Comments
Please login to add a commentAdd a comment