Jamili Elections: 'జమిలి'పై కమిటీ  | Former President RamNath Kovind Lead Committee OnJamili Elections | Sakshi
Sakshi News home page

Jamili Elections: 'జమిలి'పై కమిటీ

Published Sat, Sep 2 2023 1:44 AM | Last Updated on Sat, Sep 2 2023 7:08 AM

Former President RamNath Kovind Lead Committee OnJamili Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై ఓవైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి కార్యాచరణ సిద్ధం చేస్తుండగా, మరోవైపు ముందస్తు ఎన్నికల ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం పదును పెడుతోంది. 

ఈ నెల 18 నుంచి 5 రోజులపాటు పార్ల­మెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించి ముందస్తు ఎన్నికల అంశాన్ని కేంద్రం ఇప్పటికే తెరపైకి తీసుకొచ్చింది. దానికి మరింత బలం చేకూర్చేలా ‘వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చే­య­డా­నికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికల అంశాన్ని తేల్చడానికి 16 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించింది. 

కమిటీ విధివిధానాలు, గడువుపై కేంద్రం త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయనుందని సమా­చారం. ఈ పరిణామాలన్నీ చూస్తే ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైనట్లే కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ సంఘం, లా కమిషన్‌ అధ్యయనం చేసి, తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. జమిలి ఎన్నికల పట్ల అవి సానుకూలంగా స్పందించాయి.  
 
భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకోనున్న కమిటీ  
‘వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’పై తొలిసారిగా 2019 జూన్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ, టీఆర్‌ఎస్‌(ఇప్పటి బీఆర్‌ఎస్‌), శిరోమణి అకాలీదళ్‌ వంటి పార్టీలు ఆ ఆలోచనకు మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత 2020 నవంబర్‌లో 80వ ఆల్‌ ఇండియా ప్రిసైడింగ్‌ ఆఫీసర్స్‌ సదస్సులో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

దాదాపు 3 సంవత్సరాల అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిపై కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. నిపుణులు, రాజకీయ పార్టీల నేతలతోపాటు సామాన్య ప్రజల అభిప్రాయాలను సైతం స్వీకరిస్తుంది. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తన నివేదికను కేంద్ర పభుత్వానికి సమర్పిస్తుంది.

ఈ ఏడాది నవంబర్, డిసెంబర్‌ నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలతోపాటే మొత్తం 12 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.

కోవింద్‌తో జేపీ నడ్డా భేటీ  
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశమయ్యారు. కోవింద్‌ నేతృత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఈ భేటీ జరిగింది. కమిటీ కూర్పుపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉండాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. 

ప్రత్యేక సమావేశాల అజెండా త్వరలోనే: ప్రహ్లాద్‌ జోషీ  
ఈ నెల 18వ తేదీ నుంచి జరుగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల అజెండా రూపకల్పన తుది దశలో ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ చెప్పారు. అజెండాలో పొందుపరిచే అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. అతి త్వరలోనే అజెండాను బహిర్గతం చేస్తామన్నారు. ప్రత్యేక సమావేశాలకు కావాల్సినంత సమయం ఉందన్నారు. 

ఇదిలా ఉండగా, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల చివరి రోజైన ఈ నెల 22న పార్లమెంట్‌ సభ్యుల గ్రూప్‌ ఫొటోల చిత్రీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఇలాంటి ఫొటోలను పార్లమెంట్‌ టర్మ్‌ మొదలైన తొలి రోజు లేదా చివరి రోజు చిత్రీకరిస్తుంటారు. 

తరచూ ఎన్నికలతో నష్టమే.. 
దేశంలో ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నిర్వహించాల్సిన అవసరం ఉందని రామ్‌నాథ్‌ కోవింద్‌ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. ‘‘తరచూ దేశంలో ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతుండడంతో మానవ వనరులపై భారం పడుతోంది. ఎన్నికల వ్యయం పెరిగిపోతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది’’ అని 2018లో పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంలో కోవింద్‌ చెప్పారు.

2014 మేలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే దేశం–ఒకే ఎన్నికపై చర్చ ప్రారంభమైంది. దేశంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతా­యని లా కమిషన్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతోపాటు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండవని వెల్లడించింది. 

దేశంలో 1967 దాకా లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మోదీ ప్రభుత్వ పదవీ కాలం మరికొన్ని నెలల్లో ముగియనుంది. జమిలి ఎన్నికల వ్యవహారాన్ని ఇంకా సాగదీయకుండా ఏదో ఒకటి తేల్చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. 

‘సమాఖ్య’కు విఘాతం: విపక్షాలు   
‘జమిలి’పై రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయొద్దని డిమాండ్‌ చేసింది. రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ అనేది ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 

ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement