ముంబై: ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి మూకుమ్మడిగా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా జతకట్టడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ గొర్రెలు, మేకలు సింహం లాంటి ప్రధాని నరేంద్ర మోదీని ఏమీ చేయలేవని అన్నారు.
వాళ్ళు గొర్రెలు, మేకలు
సోమవారం ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడిన ఏక్‌నాథ్ షిండే ప్రతిపక్షాలు గురించి ఒకే మాటలో తేల్చేశారు. ప్రతిపక్షాల గుంపును నేను రాబందులని పిలవను కానీ వారు గొర్రెలు, మేకలతో సమానం అన్నారు. అలాంటి మేకలు, గొర్రెలు ఎన్ని వచ్చినా అడవిలో సింహంలాంటి ప్రధానిని ఏమీ చేయలేవని అన్నారు.
కనుచూపుమేరలో కూడా లేరు..
రాబోయే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమైన విషయాన్ని ప్రస్తావించగా వారంతా ఏకమై ప్రధానిని ఓడిద్దామనుకుంటున్నారు.. అది వారి మనసులో ఆలోచన తప్ప వారెక్కడా ఆయన దరిదాపుల్లో కూడా లేరు. ఎన్నికల్లో వారు కనీసం పోటీనిస్తారని నేననుకోవడం లేదన్నారు. దేశంలోనే అత్యధికంగా ఉత్తర ప్రదేశ్ 80 మంది పార్లమెంటు సభ్యులను లోక్‌సభకు పంపించనుండగా మహారాష్ట్ర 48 మంది సభ్యులను లోక్‌సభకు పంపిస్తూ రెండో స్థానంలో ఉంది. ఈ లెక్కలను బట్టి చూస్తే ప్రతిపక్షాలు మాకు దగ్గర్లోనే లేరని అన్నారు.
మళ్ళీ మేమే..
ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే అజిత్ పవార్ మాతో కలిసిన తరువాత మా బీజేపీ-శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి బలం 215కు చేరింది. మా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రభుత్వానికి ఢోకానే లేదని అన్నారు. బాల్ థాక్రే వారసులుగా మేము ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఉన్నాము. తమ కోసం పనిచేసే వారు కావాలో లేక ఇంట్లో కూర్చుని ఉండే నేత(ఉద్ధవ్ థాక్రే) కావాలని కోరుకుంటారో అదంతా ప్రజల చేతుల్లో ఉందని అన్నారు.
ఇది కూడా చదవండి: Parliament Special Sessions:సమావేశాలకు ముందు ప్రధాని ప్రసంగం
Comments
Please login to add a commentAdd a comment