న్యూఢిల్లీ: సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కోసం కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎగిరి గంతేయాల్సింది పోయి ప్రతిపక్షాలన్నీ అనవసర విమర్శలు చేస్తున్నాయని.. ఒకేసారి అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే బోలెడంత డబ్బును, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు కదా అని సమాచార, ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఎప్పటినుంచో ఒకే దేశం ఒకే ఎన్నికలు గురించి చెబుతూనే ఉంది. మా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దీన్ని ఆమోదించారు. ఇదే క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒకకమిటీని కూడా వేశాము. ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణన తీసుకోవాలన్న ఉదేశ్యంతో కమిటీలో వారికి కూడా స్థానం కల్పించాం. కానీ అధిర్ రంజాన్ చౌదరి ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై చర్చ ఉంటుంది. దీనికి కమిటీ సభ్యులు కూడా హాజరవుతారని అన్నారు.
ప్రజలకు ఉపయోగపడే విషయంలో మాట్లాడటానికి వారు ఎప్పుడూ ముందుకు రారు. విలువైన పార్లమెంట్ సమీవేశాల సమయాన్ని వృధా చేయడమే వారికున్న ఏకైక లక్ష్యం. మీరే చూశారు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వారు సమయాన్ని ఎలా వృధా చేశారో. అంతెందుకు గతంలో ఒకే దేశం.. ఒకే పన్ను విధానాన్ని తెరపైకి తీసుకొస్తూ జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కూడా వారు ఇదే విధంగా గొడవ చేశారు. కానీ ఈరోజు ఒకే పన్ను విధానం వలన రూ.90,000 వచ్చే చోట రూ.1,60,000 ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని అన్నారు.
అదే విధంగా ఒకే దేశంలో ఒకే ఎన్నికల నిర్వహిస్తే మరింత డబ్బు ఆదా చేయవచ్చని.. బోలెడంత సమయం కలిసొస్తుందని అన్నారు. ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి వినియోగించవచ్చని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయకుండా సమాలోచన చేయాలని కోరుతున్నానన్నారు.
ఇది కూడా చదవండి: చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment