న్యూఢిల్లీ: భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ మొత్తం ఎన్ని సెలవులు తీసుకున్నారంటూ పూణేకు చెందిన ఓ పౌర హక్కుల కార్యకర్త ఆర్టీఐకి దరఖాస్తు చేయగా ప్రధాని ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం సమాధానమిచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పొందుపరుస్తూ మా ప్రధాని మా గర్వకారణం అని రాశారు.
పూణేకు చెందిన పౌర హక్కుల కార్యకర్త ప్రఫుల్ పి సర్దా ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయానికి రెండు అంశాలపై ఆరా తీశారు. మొదటిది ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారని? రెండవది ప్రధాని ఇంతవరకు విధులకు హాజరైన మొత్తం రోజులు, వివిధ కార్యక్రమాలకు హాజరైన దినాలు ఎన్ని? ఈ వివరాలు తెలపమని కోరారు.
ప్రధాని కార్యాలయంలో ఆర్టీఐ అర్జీల వ్యవహారాలను సమీక్షించే కార్యాలయ సెక్రెటరీ పర్వేశ్ కుమార్ ఈ రెండు ప్రశ్నలకు బదులిస్తూ.. మొదటిగా ప్రధాని ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని రెండవదిగా ఆయన ప్రతిరోజూ విధులకు హాజరవుతూనే ఉన్నారని ఈ తొమ్మిదేళ్లలో సుమారు 3000 కార్యక్రమాలకు హాజరయ్యారని.. అంటే కనీసం రోజుకొక కార్యక్రమంలోనైనా ఆయన పాల్గొంటూ వస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం తెలిపిన ఈ వివరాలను అస్సాం ముఖ్యమంత్రి తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. మరో కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ ప్రధానితో కలిసి పనిచేయడాన్ని క్రికెట్ పరిభాషలో చెబుతూ.. కెప్టెన్ మోదీతో పని ఉదయాన్నే 6 గంటలకు మొదలై.. చాలా ఆలస్యంగా ముగుస్తుందని అన్నారు. ఆయన మనకు అవకాశమిస్తే మనము వికెట్ తీస్తామని ఆయన అంచనా వేస్తుంటారని అన్నారు.
నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన దేశం చేసుకున్న అదృష్టమని.. ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నారని గానీ ఆయన మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నానని గానీ నేను ఈ మాట చెప్పడంలేదన అన్నారు జయశంకర్. గతంలో కూడా 2016లో ప్రధాని సెలవుల గురించి మరొకరు ఇలాగే ఆర్టీఐ ద్వారా ఆరా తీశారు. అప్పుడు కూడా ప్రధాని కార్యాలయం ఇదే సమాధానాన్నిచ్చింది.
#MyPmMyPride pic.twitter.com/EPpkMCnLke
— Himanta Biswa Sarma (@himantabiswa) September 4, 2023
ఇది కూడా చదవండి: మీడియా తప్పుడు కథనాలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment