పైసలిత్తెనే..!
‘హలో... ముఖ్యమంత్రి ఆఫీసా... మాది కనగర్తి గ్రామం, ఓదెల మండలం. నాపేరు రవి. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆఫీస్‌కు వెళితే అక్కడ పనిచేసే అసిస్టెంట్ ఒకరు పని కావాలంటే పది వేలు ఇవ్వాలని అడుగుతున్నడు సార్. విచారణ జరిపి నాకు న్యాయం చేయండి సార్...!’
‘హలో... సీఎం కార్యాలయమా? నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు కృష్ణారెడ్డి. మహిళా పోలీస్‌స్టేషన్‌లో అవినీతి బాగా పెరిగిపోయిందండీ. 498(ఏ) కేసు పేరుతో భార్యభర్తలకు కౌన్సిలింగ్ చేయకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఇటు భార్య నుంచి అటు భర్త నుంచి లక్షల రూపాయలు గుంజుతున్నారు. ఈ స్టేషన్‌పై నిఘా పెడితే వాస్తవాలు మీకే తెలుస్తాయండీ...!’
‘సార్... నేను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రాంరెడ్డిని మాట్లాడుతున్నా. ఈ కార్పొరేషన్‌లో 13 ఏళ్లుగా ఒకే కాంట్రాక్టర్ గుత్తాధిపత్యం చెలాయిస్తుండు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో మిలాఖత్ అయి శానిటేషన్ టెండర్లు దక్కించుకుంటుండు. 861 మంది కార్మికులున్నారని చెబుతూ నాలుగువందల మంది కార్మికులతోనే పని చేయిస్తూ ప్రతినెలా నలభై లక్షలు దోచుకుతింటుండు. అధికారులు, కార్పొరేటర్లు, నాయకులకు నెల నెలా కమిషన్లు ముట్టజెబుతూ అడ్డొచ్చే వారిపై దాడులకు పాల్పడుతూ దాదాగిరి చెలాయిస్తుండు. దయచేసి పూర్తి
విచారణ జరిపి చర్యలు తీసుకోండి...!’
కరీంనగర్ జిల్లాకు అవినీతి జబ్బు పట్టింది. లంచం ఇవ్వనిదే ఏ పనీ జరగడం లేదు. పింఛన్, ఆహారభద్రత కార్డులు సహా ఏ చిన్న పని కావాలన్నా లంచం ముట్టజెప్పాల్సిందే. పంచాయతీ కార్యాలం, మున్సిపాలిటీ, కార్పొరేషన్, కలెక్టరేట్ అనే తేడాలేకుండా అన్ని శాఖల్లో అవినీతి పాతుకుపోయింది. ఇందుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన ఫిర్యాదులే నిదర్శనం.
‘ఎవరైనా లంచం అడిగితే సీఎంఓకు ఫోన్ చేయండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న వరంగల్‌లో ఫోన్ నంబరు ప్రకటించగా, జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సీఎంవో ప్రకటించిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఈనెల 11 నుంచి 14వ తేదీవరకు దాదాపు 11వేల మంది ఫోన్లు చేసి అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎంఓకు వచ్చిన ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే విచారణ జరుపుతోంది. వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు 1500 మంది కరీంనగర్ జిల్లావాసులవే కావడం గమనార్హం. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో సీఎంఓకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం విశేషం.
ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ
కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన నెంబర్ల జాబితాలోని సుమారు 20 మందికి ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్లు చేయగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పింఛన్లు, ఆహారభద్రతా కార్డులు వంటి వ్యక్తిగత సమస్యలు మొదలుకుని ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవి నీతిని ప్రస్తావిస్తూ తగిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంఓకు ఫోన్ చేసినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ తనయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కార్యాలయ సిబ్బంది ఒకరు సీఎం సహాయ నిధి మంజూరు కోసం లంచం అడుగుతున్నాడంటూ ఫిర్యాదు చేయడం విశేషం. తమ పేర్లను గోప్యంగా ఉంచాలని బాధితులు చేసిన విజ్ఞప్తి దృష్ట్యా ‘సాక్షి’ అసలు పేర్లను మార్చి వారు పేర్కొన్న వాస్తవాలను మాత్రం పాఠకుల ముందుంచుతోంది.
సుల్తానాబాద్ మండలానికి చెందిన ప్రమీల అనే ఆవిడ మాట్లాడుతూ ‘సార్... రేషన్‌కార్డులో నా పేరు చేర్చాలని దరఖాస్తు చేసుకుంటే ఎమ్మార్వో ఆఫీస్‌లోని పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నడు. లంచం అడిగితే చెప్పాలని కేసీఆర్ అనడంతోనే సీఎం ఆఫీస్‌కు ఫోన్ చేసిన’ అని పేర్కొన్నారు.
కరీంనగర్ మండలం బావుపేట గ్రామానికి చెందిన షాజహాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ ‘రైస్‌డిపో కోసం రుణం ఇవ్వాలని మైనారిటీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే మంజూరైంది. బ్యాంకు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. డబ్బుల కోసం ఇండియన్ బ్యాంకుకు వెళితే రేపు మాపు అంటూ నెలల తరబడి తిప్పుతున్నారు. ఇదేమిటని అడిగితే బ్యాంకులో ఉన్న అటెండర్ ఒకరు పదివేలు ఇస్తే పనైపోతుందని, మేనేజర్‌తో మాట్లాడతానని చెబుతుండు. దయచేసి మీరైనా జోక్యం చేసుకుని నాకు లోన్ ఇప్పించాలని కోరుతూ సీఎం ఆఫీస్‌కు ఫోన్ చేసిన’ అని తెలిపారు.
తిమ్మాపూర్‌కు చెందిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘నేను వికలాంగుడిని. సదరం సర్టిఫికెట్ కావాలని జిల్లా ఆసుపత్రికి వెళితే అక్కడి సిబ్బంది ఐదు వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నడు. డబ్బులిస్తే ఏ వైకల్యం లేకపోయినా విలాంగుల సర్టిఫికెట్ ఇచ్చి పంపుతుండు. ఇదేం పద్దతని అడిగితే నీ ఇష్టమొచ్చిన చోట చెప్పుకోమ్మని చెప్పిండు. అందుకే కేసీఆర్ సార్ ఆఫీస్‌కు ఫోన్ చేసిన చెప్పిన’ అని వివరించారు.
‘సార్... నా పేరు నరేష్. మాది ఎల్కతుర్తి. మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఆపరేటర్‌గా చేస్తున్నా. ఇక్కడ ఎంఈఓ, ఎంపీపీ కుమ్మక్కై నన్ను పక్కనపెట్టి మరో వ్యక్తి దగ్గర యాభై వేల డబ్బులు తీసుకుని ఆయనను ఆపరేటర్‌గా నియమించుకోవాలని యత్నిస్తున్నారు. త్వరలోనే మా ఉద్యోగాలు రెగ్యుల ర్ అయితట.
నేను ఆర్వీఎం ఆఫీస్‌కు వెళితే... ‘నువ్వే అక్కడ ఆపరేటర్‌వి. నీకే వేతనం ఇస్తాం. వెళ్లి పని చేసుకో’ అని అధికారులు చెబుతుంటే... ఇక్కడ ఎంఈవో మాత్రం ‘నీవు ఏం పనిచేస్తలేవ్. వేతనాలు ఇచ్చేదెట్లా?’ అంటూ దెప్పిపొడుస్తున్నారు. నాకు న్యాయం చేయండి సార్ అని కేసీఆర్‌కు ఫోన్ చేసిన’ అంటూ తన గోడును వివరించాడు.