రే టుగాళ్లు! | acbi attacks caused a sensation | Sakshi
Sakshi News home page

రే టుగాళ్లు!

Published Sat, Nov 21 2015 12:10 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

రే టుగాళ్లు! - Sakshi

రే టుగాళ్లు!

ప్రతి పనికీ ఓ ‘లెక్క’
యథేచ్ఛగా వసూళ్లు
ఏళ్ల తరబడి ఇదే తంతు
ఇదీ డీఈఓ కార్యాలయం తీరు
ఏసీబీ దాడులతో కలకలం

 
సిటీబ్యూరో:  హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయం అవినీతికి చిరునామాగా మారింది. ఏ పనికైనా అక్కడి సిబ్బందికి చేయి తడపాల్సిందే. ముఖ్యంగా స్కూళ్లకు గుర్తింపునివ్వడం... కొనసాగించడం వంటివి కార్యాలయ అధికారులు, సిబ్బందికి కాసులు కురిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం ఏసీబీ దాడులతో డీఈఓ కార్యాలయం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సీనియర్ అసిస్టెంట్ వహీదుద్దీన్ రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రె డ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీన్నిబట్టి అక్కడ వసూళ్లు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటివి వారి దృష్టికి వచ్చినా...చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పెద్ద సార్లకు వీటిలో వాటాలు ఉంటాయి. మీరిచ్చేది మాకు ఒక్కరికే కాదు’ అని సిబ్బందే నేరుగా వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారితో చెబుతుండడం గమనార్హం. ‘తిలా పాపం.. తలా పిడికె డు’ అన్నట్లుగా వసూళ్లలో అందరి భాగస్వామ్యం ఉన్నట్టు తేటతెల్లమవుతోంది. డీఈఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం ఇది రెండోసారి.  

 పైసలు లేనిదే పని కాదు
 ప్రభుత్వ స్కూళ్లు కొనసాగుతున్న అద్దె భవనాలకు బిల్లులు చెల్లించడం నుంచి ఉపాధ్యాయుల సర్వీస్ విషయాల వరకూ ప్రతి పనిలోనూ సిబ్బంది ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఎయిడెడ్ టీచర్ల వేతన బకాయిల చెల్లింపుల్లోనూ పర్సంటేజీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బకాయిల మొత్తంలోంచి పది శాతాన్ని ముక్కు పిండి వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. ఈ వసూళ్లకు ప్రత్యేకంగా దళారులను ఏర్పాటు చేసుకున్నారంటే.. అవినీతి దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. సర్వీస్ బుక్‌లో ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయడానికి డిమాండ్ చేసి మరీ దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలంటే ఆ శాఖ ఉద్యోగులకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. ఈ తనిఖీ బృందాల్లో సభ్యులుగా ఉండటానికి పోటీ పడుతుంటారు. ప్రైవేటు పాఠశాలల్లో చిన్నపాటి లోటునూ భూతద్దంలో పట్టి చూపి.. రేటు ఫిక్స్ చేస్తారు. చేసేదేమీ లేక యాజమాన్యాలు ఎంతో కొంత చెల్లించుకోవాల్సి వస్తోంది. ‘హెడ్ క్వార్టర్ లివింగ్’కి టీచర్లు దరఖాస్తు చేసుకుంటే రోజుల తరబడి వేచిచూడక తప్పని పరిస్థితి. దరఖాస్తులు అందజేసి రోజులు గడిచినా ఫైల్ ఇన్‌వార్డు గడప దాటదు. దీని అనుమతికి  ఉద్యోగులుఎంతో కొంత ఆశించడమే లోగుట్టు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు తాత్కాలిక గుర్తింపును కొనసాగించేందుకు ఇచ్చే అనుమతుల విషయంలోనూ ముడుపులు చెల్లించాల్సిందే. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ తయారీ కూడా కాసులు కురిపిస్తోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఒక్కో విద్యార్థి పేరిట రూ. 50 నుంచి రూ.100 వరకు అదనంగా డీఈఓ కార్యాలయ ఉద్యోగులకు ఇవ్వక తప్పడం లేదని వారు పేర్కొంటున్నారు. ఇలా ప్రతి అవకాశాన్నీ ‘డబ్బు’ చేసుకోవడంలో ఆ శాఖ ఉద్యోగులు పోటీ పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

 ఇష్టారాజ్యం
 డీఈఓ కార్యాలయం ఆది నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. ప్రతి పనికో రేటు నిర్ణయించడంతో పాటు.. విధి నిర్వహణలోనూ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు  కలెక్టర్‌గా పనిచేసిన నిర్మల ఇదే విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జులైలో ఈ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్... ఉద్యోగుల తీరుపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ఉద్యోగి ఎప్పుడు వస్తారో.. పోతారో తెలియక అయోమయ పరిస్థితి నెలకొంటోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ లేకపోవడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆమె గ్రహించారు. దీన్ని కట్టడి చేయడానికి కార్యాలయంలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అమల్లోకి రాలేదు. ఇలా అన్నిటా ఈ కార్యాలయం తరచూ వార్తల్లోకెక్కడం గమనార్హం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement