ఏసీబీకి చిక్కిన సబ్‌రిజిస్ట్రార్
- రూ.10వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం
- మరో ఇద్దరిపైనా కేసు
- డీఎస్పీ ఆర్‌కెప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు
నక్కపల్లి: ఏసీబీ వలకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. గిఫ్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ నక్కపల్లి సబ్‌రిజిస్ట్రార్ ఐ.ఉమామహేశ్వరరావు శుక్రవారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు దొరికిపోయారు. రాంబిల్లికి చెందిన లక్ష్మీనరసింహ తన సోదరి విజయలక్ష్మికి ఉపమాకలో ఉన్న రెండు ఎకరాలను ఆమె కుమారైతసునీత పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు గురువారం సబ్‌రిజిస్ట్రార్‌ను సంప్రదించాడు. మార్కెట్ విలువ ప్రకారం స్టాంపుడ్యూటీ చెల్లించడంతోపాటు అదనంగా రూ.పదివేలు లంచం సబ్‌రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. అంతమొత్తం ఇచ్చుకోలేనని లక్ష్మీనరసింహ వాపోయాడు. ఇస్తేతప్ప రిజిస్ట్రేషన్ చేయనని సబ్‌రిజిస్ట్రార్ తెగేసి చెప్పాడు. దీంతో శుక్రవారం రూ.10వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. డబ్బు ఇచ్చిన రోజునే రిజిస్ట్రేషన్ చేద్దామని రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు బాధితునికి నగదు ఇచ్చి పంపారు. లక్ష్మీనరసింహ సబ్‌రిజిస్ట్రార్‌కు రూ. పదివేలు ఇవ్వబోగా టేబుల్ సెల్ఫ్‌లో పెట్టాలని సూచించారు. ఆమేరకు సెల్ఫ్‌లో పెట్టిన అనంతరం అక్కడే ఉన్న మరోవ్యక్తి యర్రాసత్తిబాబుని పిలిచి రూ. పదివేలు నగదు సరిపోయిందో లేదో చూడాలని రిజిస్ట్రార్ చెప్పారు. సరిచూసిన అనంతరం ఆ సొమ్మును కొత్త సందీప్ అనే వ్యక్తికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. లంచం తీసుకున్న సబ్‌రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుతోపాటు, ఈవ్యవహారంతో ప్రమేయం ఉన్న యర్రాసత్తిబాబు, కొత్తసందీప్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసినట్లు డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు.
అధికారుల గుండెల్లో రైళ్లు
ఈ సంఘటనతో పాయకరావుపేట నియోజకవర్గంలోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లుపరుగెడుతున్నాయి. ఈ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ప్రతి చిన్నపనికి రూ.వేలల్లో గుంజుతారన్న వాదన వ్యక్తమవుతోంది. గతంలోనూ పలువురు మండలస్థాయి అధికారులు ఏసీబీకి చిక్కిన సంఘటనలు ఉన్నాయి. రెండేళ్లక్రితం పాయకరావుపేట తహశీల్దార్ లింగయ్య, ఆర్‌ఐ మురళిలు చనిపోయిన వీఆర్వో కుటుంబానికి వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. నాలుగేళ్ల క్రితం నక్కపల్లి ఈవోఆర్‌డీగా పనిచేసిన కృష్ణ వృద్ధాప్య పింఛన్ మంజూరు కోసం రూ.వెయ్యి తీసుకుంటూ దొరికిపోయారు. రెండేళ్ల క్రితం ఎస్.రాయవరం మండలానికి చెందిన పంచాయతీరాజ్ వర్క్‌ఇన్‌స్పెక్టర్, వీఆర్వోలు ఇలానే ఏసీబీకి చిక్కారు.