బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం
అనుమానం వచ్చి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏసీబీ
అదుపులో ఇద్దరు అధికారులు!.. 64 డాక్యుమెంట్లు సీజ్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.
తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!
ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్‌చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం.
జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..
ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment