గుంటూరు జిల్లాలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
నరసరావుపేట: గుంటూరు జిల్లాలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో ఓ ఫోర్త్ క్లాస్ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఇంక్రిమెంట్ బిల్లు మంజూరుకు లంచం అడగటంతో సదరు చిరుద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏరియా వైద్యశాలలో జూనియర్ శానిటరీ వర్కర్‌గా విధులు నిర్వహించే తలమాల దుర్గారావుకు పది రోజుల క్రితం రూ.62,500లు ఇంక్రిమెంట్ ఎరియర్స్ కింద మంజూరయ్యాయి. వాటికి సంబంధించి బిల్లు పాస్‌చేసి చెక్కు ఇచ్చేందుకు వైద్యశాల సీనియర్ అసిస్టెంట్ కె.నరేంద్రబాబు రూ.15వేల లంచాన్ని డిమాండ్ చేశారు.
దీంతో దుర్గారావు రూ.5వేలకు బేరం కుదుర్చుకుని...ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నరేంద్రబాబు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.