అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాసరెడ్డి, స్టేట్‌మెంట్ తీసుకుంటున్న ఏసీబీ అధికారులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి. శ్రీనివాసరెడ్డి ఓ హోటల్ యజమాని నుంచి రూ. పది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోనున్న వేసైడ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఆహార నాణ్యతపై ఆగస్టులో ఫుడ్ కంట్రోలర్ అధికారులు శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఇప్పటికీ ఫలితాలు రాలేదు.
ఆ రిపోర్ట్ ఎలా ఉన్నా తాను చూసుకుంటానని, రూ.పది వేలు ఇవ్వాలని హోటల్ యజమాని వెంకటేశ్వరరావుతో శ్రీనివాసరెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఆయన కార్యాలయంలో లంచం తీసుకుంటున్నాడనే ముందస్తు సమాచారంతో ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, ఇన్‌స్పెక్టర్ తేజేశ్వరరావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ జయరామరాజు తెలిపారు.