food controller
-
ప్రతి స్వీట్‌కు ఓ తేదీ!
సాక్షి, గుంటూరు: స్వీట్స్ ఇష్టపడని వారెవరుంటారు. కలాకండ్, గులాబ్ జామూన్, లడ్డూ, జిలేబి ఇలా ఎన్నో రకాల స్వీట్లు చూడగానే నోరూరకమానదు. కానీ, మనం కొనే స్వీట్స్ ప్రతిసారి బాగుంటాయని చెప్పలేం. ఎందుకంటే వాటిపై ఎక్స్పైరీ తేదీ ఉండదు. ఈ క్రమంలోనే ప్రజలు ఒక్కో సారి కాలపరిమితి దాటిన స్వీట్లను కొనుగోలు చేసి రోగాల బారిన పడుతున్నారు. అందుకనే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా ప్రతి స్వీట్‌పై తయారీ, ఎక్స్పైరీ తేదీ ముద్రించాలని నిబంధన విధించింది. ►జిల్లాలో 400 మంది ఫుడ్‌సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని స్వీట్స్ విక్రయాలు సాగిస్తుండగా మరో 1200 మంది వరకు తోపుడు బండ్లపై అనధికారికంగా అమ్మకాలు చేస్తున్నారు. ►అయితే కొత్త నిబంధనల ప్రకారం స్వీట్లు విక్రయించే ప్రతి ఒక్కరూ ఫుడ్ ఇన్స్పెక్టర్ల నుంచి ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది. ఏఏ స్వీట్లు.. ఎన్ని రోజుల్లో తినాలి ►కలాకండ్, బట్టర్ స్కాచ్, చాక్లెట్ కలాకండ్ తదితర స్వీట్లు తయారు చేసిన రోజునే తినేయాలి. ►పాల పదార్థాలు, బెంగాలీ స్వీట్స్ , బాదం మిల్క్, రసగుల్ల, రసమలై వంటి స్వీట్లను రెండు రోజుల్లో వినియోగించాలి. ►లడ్డు, కోవాస్వీట్స్, మిల్క్ కేక్, బూందీలడ్డు, కోకోనట్ బర్ఫీ, కోవా బాదం వంటివి తయారు చేసిన నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ►నేతితో చేసిన స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ హాల్వా, డ్రైఫ్రూట్ లడ్డు, అంజీర కేక్, కాజు లడ్డూ వంటి వాటిని వారంలో తినాలి. ►బసెస్ లడ్డూ, అటా లడ్డూ, చనా లడ్డూ, చనా బర్ఫీ, చిక్కీలు తయారు చేసిన 30 రోజుల వరకు నిల్వ ఉంటాయి. రూ.రెండు లక్షల వరకు జరిమానా స్వీట్లు విక్రయించే వ్యాపారులు కచ్చితంగా వాటిపై తయారీ, గడువు తేదీలను ముద్రించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తాం. నాణ్యత లేకుండా, తేదీలు ముద్రించకుండా స్వీట్లు విక్రయిస్తున్న వారి సమాచారాన్ని 98484 70969 నంబర్‌కు తెలియజేయాలి. – షేక్ గౌస్ మొహిద్దీన్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, గుంటూరు -
అమ్మో.. ఈ చికెన్ చూస్తే భయమేస్తోంది
నాన్‌వెజ్ వెరైటీ ఐటెమ్స్‌కు నెల్లూరు పెట్టింది పేరు. నగరంలో హోటల్స్‌లో చికెన్ ముక్క తిందామన్నా.. మటన్ పీస్ రుచి చూద్దామన్నా హడలి పోతున్నారు. కాకా హోటల్ నుంచి స్టార్ హోటళ్ల వరకు నోరూరేటట్లు ఎన్నో వెరైటీ రుచులు చూపించారు. ఎవరైనా ఇతర రాష్ట్ర, జిల్లాల నుంచి నెల్లూరుకు వస్తే కచ్చితంగా సింహపురి భోజనం రుచి చూసి వెళ్లాలని ఆశపడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసి, తెలిసీ అమ్మో నాన్ వెజ్ అంటూ భయపడే పరిస్థితి ఏర్పడింది. మూడు వారాలుగా నెల్లూరు నగరపాలక సంస్థ, ఫుడ్ కంట్రోల్ శాఖల అధికారులు సంయుక్తంగా చేస్తున్న దాడుల్లో ప్రధాన హోటళ్లలో భారీగా నిల్వ ఉంచిన మాంసం బయట పడుతోంది. తాజాగా ఓ చికెన్ స్టాల్లోనే రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం బయట పడడంతో అధికారులే అవాక్కయ్యారు. సాక్షి, నెల్లూరు సిటీ : నిన్నా.. మొన్నటి వరకు హోటళ్లలో మాంసం నిల్వలను గుర్తించిన అధికారులు, తాజాగా ఓ చికెన్ స్టాల్లోనూ నిల్వ మాంసం గుర్తించి నివ్వెరపోయారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్‌కు వెళ్లే రహదారిలో ఓ చికెన్ స్టాల్ నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ శనివారం ఉదయం దాడులు చేపట్టారు. చికెన్ స్టాల్ లోనికి వెళ్లి చూడగా రెండు ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిల్లో దాదాపు 30 కిలోల చికెన్ లెగ్ పీస్‌లు, లివర్, కట్ చేసిన చికెన్ రోజుల తరబడి నిల్వ ఉంచడాన్ని గుర్తించారు. భారీ మొత్తంలో నిల్వ మాంసాహారం ఉంచడంపై కమిషనర్ దుకాణ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ స్టాల్స్‌లో ఫ్రిజ్‌లు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కుక్కలకు వేసేందుకు అంటూ సమాధానం చెప్పడంతో చెడిపోయిన ఆహారాన్ని కుక్కలకు వేస్తారా అంటూ యజమానిపై మూర్తి మండి పడ్డారు. రూ.50 వేలు జరిమానా చికెన్ స్టాల్‌లోని రెండు ఫ్రిజ్‌లను సీజ్ చేసి కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. నిల్వ మాంసాన్ని చెత్త వాహనాలు ద్వారా బోడిగోడి తోట డంపింగ్ యార్డ్‌కు తరలించి ఖననం చేయించారు. చికెన్ స్టాల్ యజమానికి రూ.50 వేలు జరిమానా విధించారు. అనంతరం నిప్పో సెంటర్ వద్ద రెండు రెస్టారెంట్‌ల్లో దాడులు చేయగా నిల్వ ఉంచిన శాఖాహారం, మాంసాహారం గుర్తించారు. అయ్యప్పగుడి సెంటర్ వద్ద ఓ బార్ అండ్ రెస్టాంట్‌లో దాడులు నిర్వహించగా నిల్వ మాంసం గుర్తించారు. నిల్వ ఆహార పదార్థాలను ఉంచిన హోటల్స్‌కు మొత్తం రూ.1.50 లక్షలు జరిమానా విధించారు. మూడు వారాల్లో రూ.15 లక్షల జరిమానా నగర పాలక సంస్థ పరిధిలో ఈ నెల మొదటి వారం నుంచి కార్పొరేషన్, ఫుడ్ కంట్రోల్ శాఖ అధికారులు సంయక్తంగా దాడులు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు దాడులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లలో భారీగా నిల్వ ఉన్న మాంసాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. పండ్ల రసాల జ్యూస్‌ల్లో సైతం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో భారీగా జరిమానాలు విధించారు. మూడు వారాల్లో దాదాపు రూ.15 లక్షలు జరిమానాలు విధించారు. -
నకిలీ జామ్ ప్యాకెట్లు స్వాధీనం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని హెచ్ఐజీ–36లో శ్రీసత్య కార్తీక్ ఏజెన్సీపై ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు రెండో రోజు గురువారం కూడా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా దేవతి నాగరాజు, పద్మవల్లి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వివిధ రకాల తినుబండారాలను తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎ. సుందరరామిరెడ్డి బుధవారం తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే రకరకాల బ్రాండ్ల తినుబండారాలు అనేకం ఉండటంతో రెండో రోజుకూడా ఈ తనిఖీలను కొనసాగించారు. ప్రముఖ కంపెనీల పేర్లతో జామ్, సాస్‌లు తయారు చేస్తున్నట్లు ఈ తనిఖీలలో వెల్లడయ్యింది. వాటిల్లో నాన్ పర్మిటెడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది. జామ్‌లో చీమలు, ఈగలు.. మ్యాంగో, మిస్టర్ యాపిల్ పేర్లుతో తయారు చేస్తున్న జామ్ ముడి పదార్థం ఉన్న డ్రమ్ములలో చీమలు, దోమలు, ఈగలు ఉన్నాయి. దానినే మిషన్ ద్వారా చిన్నచిన్న ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. సుమారు రూ.10లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. రంగు రంగు ప్యాకెట్లలో ఆకర్షణీయంగా కనబడుతున్న ఈ కల్తీ ఆహార పదార్థాల కారణంగా పిల్లలు రోగాల బారిన పడతారని చెప్పారు. -
రూ.10 వేలు తీసుకుంటూ.. పట్టుబడ్డాడు!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి. శ్రీనివాసరెడ్డి ఓ హోటల్ యజమాని నుంచి రూ. పది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోనున్న వేసైడ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో ఆహార నాణ్యతపై ఆగస్టులో ఫుడ్ కంట్రోలర్ అధికారులు శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఇప్పటికీ ఫలితాలు రాలేదు. ఆ రిపోర్ట్ ఎలా ఉన్నా తాను చూసుకుంటానని, రూ.పది వేలు ఇవ్వాలని హోటల్ యజమాని వెంకటేశ్వరరావుతో శ్రీనివాసరెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఆయన కార్యాలయంలో లంచం తీసుకుంటున్నాడనే ముందస్తు సమాచారంతో ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, ఇన్స్పెక్టర్ తేజేశ్వరరావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ జయరామరాజు తెలిపారు. -
హోటళ్లపై ఫుడ్ కంట్రోలర్ దాడులు
గుంటూరు : ఆహార పదార్థాల తయారీ, అమ్మకంలో కనీస శుభ్రతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై జిల్లా ఫుడ్ కంట్రోలర్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శుభ్రత ప్రమాణాలు పాటించని రెండు హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్న అధికారులు పలు హోటళ్లలో ఆహార పదార్ధాలను నిల్వ ఉంచడంతో పాటు, అయోడిన్ లేని ఉప్పును వాడుతుండటాన్ని గుర్తించారు. 15 రోజుల్లోగా తీరు మార్చుకోవాలని, తిరిగి తనిఖీ చేయడానికి వచ్చేసరికి పరిస్థితిలో మార్పు రాకపోతే హోటళ్లను సీజ్ చేస్తామని జిల్లా ఫుడ్ కంట్రోలర్ పూర్ణ చంద్రారావు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా ఫుడ్ కంట్రోలర్ దాడులు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న పలు హోటళ్ల యజమానులు తమ హోటళ్లను తెరవలేదు.