నాన్‌వెజ్ వెరైటీ ఐటెమ్స్‌కు నెల్లూరు పెట్టింది పేరు. నగరంలో హోటల్స్‌లో చికెన్ ముక్క తిందామన్నా.. మటన్ పీస్ రుచి చూద్దామన్నా హడలి పోతున్నారు. కాకా హోటల్ నుంచి స్టార్ హోటళ్ల వరకు నోరూరేటట్లు ఎన్నో వెరైటీ రుచులు చూపించారు. ఎవరైనా ఇతర రాష్ట్ర, జిల్లాల నుంచి నెల్లూరుకు వస్తే కచ్చితంగా సింహపురి భోజనం రుచి చూసి వెళ్లాలని ఆశపడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు చూసి, తెలిసీ అమ్మో నాన్ వెజ్ అంటూ భయపడే పరిస్థితి ఏర్పడింది. మూడు వారాలుగా నెల్లూరు నగరపాలక సంస్థ, ఫుడ్ కంట్రోల్ శాఖల అధికారులు సంయుక్తంగా చేస్తున్న దాడుల్లో ప్రధాన హోటళ్లలో భారీగా నిల్వ ఉంచిన మాంసం బయట పడుతోంది. తాజాగా ఓ చికెన్ స్టాల్‌లోనే రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసం బయట పడడంతో అధికారులే అవాక్కయ్యారు.
సాక్షి, నెల్లూరు సిటీ : నిన్నా.. మొన్నటి వరకు హోటళ్లలో మాంసం నిల్వలను గుర్తించిన అధికారులు, తాజాగా ఓ చికెన్ స్టాల్‌లోనూ నిల్వ మాంసం గుర్తించి నివ్వెరపోయారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్‌కు వెళ్లే రహదారిలో ఓ చికెన్ స్టాల్ నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ శనివారం ఉదయం దాడులు చేపట్టారు. చికెన్ స్టాల్ లోనికి వెళ్లి చూడగా రెండు ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిల్లో దాదాపు 30 కిలోల చికెన్ లెగ్ పీస్‌లు, లివర్, కట్ చేసిన చికెన్ రోజుల తరబడి నిల్వ ఉంచడాన్ని గుర్తించారు. భారీ మొత్తంలో నిల్వ మాంసాహారం ఉంచడంపై కమిషనర్ దుకాణ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ స్టాల్స్‌లో ఫ్రిజ్‌లు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కుక్కలకు వేసేందుకు అంటూ సమాధానం చెప్పడంతో చెడిపోయిన ఆహారాన్ని కుక్కలకు వేస్తారా అంటూ యజమానిపై మూర్తి మండి పడ్డారు.
రూ.50 వేలు జరిమానా
చికెన్ స్టాల్‌లోని రెండు ఫ్రిజ్‌లను సీజ్ చేసి కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. నిల్వ మాంసాన్ని చెత్త వాహనాలు ద్వారా బోడిగోడి తోట డంపింగ్ యార్డ్‌కు తరలించి ఖననం చేయించారు. చికెన్ స్టాల్ యజమానికి రూ.50 వేలు జరిమానా విధించారు. అనంతరం నిప్పో సెంటర్ వద్ద రెండు రెస్టారెంట్‌ల్లో దాడులు చేయగా నిల్వ ఉంచిన శాఖాహారం, మాంసాహారం గుర్తించారు. అయ్యప్పగుడి సెంటర్ వద్ద ఓ బార్ అండ్ రెస్టాంట్‌లో దాడులు నిర్వహించగా నిల్వ మాంసం గుర్తించారు. నిల్వ ఆహార పదార్థాలను ఉంచిన హోటల్స్‌కు మొత్తం రూ.1.50 లక్షలు జరిమానా విధించారు.
మూడు వారాల్లో రూ.15 లక్షల జరిమానా
నగర పాలక సంస్థ పరిధిలో ఈ నెల మొదటి వారం నుంచి కార్పొరేషన్, ఫుడ్ కంట్రోల్ శాఖ అధికారులు సంయక్తంగా దాడులు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు దాడులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లలో భారీగా నిల్వ ఉన్న మాంసాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. పండ్ల రసాల జ్యూస్‌ల్లో సైతం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో భారీగా జరిమానాలు విధించారు. మూడు వారాల్లో దాదాపు రూ.15 లక్షలు జరిమానాలు విధించారు.
Comments
Please login to add a commentAdd a comment