
న్యూఢిల్లీ: పవిత్ర నవరాత్రులలో శాకాహారం(Vegetarian) తీసుకుందామనే ఉద్దేశంతో ఢిల్లీకి చెందిన ఒక మహిళ ఒక రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. కాసేపటికి డెలివరీ బాయ్ తీసుకువచ్చిన ప్యాకెట్ అందుకున్న ఆమె దానిని తెరిచి, అందులో ఉన్న ఆహారాన్ని చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సదరు రెస్టారెంట్ యజమానిపై చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే గ్రేటర్ నోయిడా(Greater Noida) వెస్ట్‌లోని ఒక రెస్టారెంట్ యజమాని నవరాత్రుల సమయంలో వెజిటేరియన్ బిర్యానీ ఆర్డర్ చేసిన మహిళకు నాన్-వెజిటేరియన్ బిర్యానీ పంపిన ఆరోపణలతో అరెస్టయ్యారు. ఆరిహంత్ ఆర్డెన్ సెక్టార్ వన్‌లో ఉంటున్న చాయ శర్మ అనే మహిళ సోషల్ మీడియాలో ఒక రెస్టారెంట్ నిర్వాకం కారణంగా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. చాయ శర్మ నవరాత్రుల సమయంలో లఖ్‌నవీ కబాబీ పరాఠా అనే స్థానిక రెస్టారెంట్ నుండి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే ఆమెకు చికెన్ బిర్యానీ వచ్చిందని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆమె వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. దానిలో ఆమె ‘నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అది కూడా నవరాత్రుల సమయంలో.. కానీ నాకు చికెన్ బిర్యానీ పంపారు’ అని తెలిపారు.
ఈ వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సెంట్రల్ నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శక్తి ఆవస్థీ మాట్లాడుతూ..‘ఆమె వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయగా, ఆమెకు చికెన్ బిర్యానీ రావడంతో, ఈ ఉదంతాన్ని ఆమె వీడియో రూపంలో తెలిపారన్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రెస్టారెంట్ యజమాని రాహుల్ రాజవంశీని అరెస్ట్ చేశారు. సెక్షన్ 271 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఇదే సమయంలో నోయిడా ఆహార భద్రత, ఔషధ నిర్వహణ అధికారులు ఆ రెస్టారెంట్‌ను సందర్శించి, ఆహార పదార్థాలను పరిశీలించి, శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపారు.
ఇది కూడా చదవండి: మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు