veg biryani
-
రూ.10కే వెజ్ బిర్యానీ.. మన హైదరాబాద్‌లోనే ఎక్కడో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం మార్కెట్లో చిన్నచిన్న టిఫిన్ సెంటర్లలో సైతం కనీస ప్లేట్ ధర రూ.30. మీల్స్ అయితే రూ.70 నుంచి 100కు పైనే. ఇలాంటి తరుణంలో మధ్యప్రదేశ్‌కు చెందిన మహేష్ గాజులరామారం డివిజన్ దేవేందర్‌నగర్‌లో కేవలం రూ.10కే వెజ్ బిర్యానీ అందిస్తున్నాడు. గతంలో అంబర్‌పేట్‌లో నడిపే వాడినని తెలిపాడు. అక్కడ తన కుటుంబ సభ్యులకు అప్పగించి దేవేందర్‌నగర్‌లో బిర్యాని సెంటర్ నడుపుతున్నానని పేర్కొన్నాడు. వచ్చే కొద్దిపాటి లాభాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు మహేష్ తెలిపాడు. ప్రతిరోజు 70 నుంచి 100 ప్లేట్ల వరకు అమ్ముతున్నాడు. అటుగా వెళ్లే వాహనాదారులు రూ.10కే వెజ్ బిర్యానీ బోర్డు చూసి ఒక పట్టు పట్టి వెళ్లిపోతున్నారు. -
వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే..
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భోజన ప్రియులు కాస్తా వెనకడుగు వేస్తున్నారు. ఒకటి ఆర్డర్ ఇస్తే ఇంకోటి రావడం, భోజనంలో పురుగులు, కుళ్లిన ఆహారం వస్తుందోనని జంకుతున్నారు. తాజాగా రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ శాకాహారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డరిస్తే.. అందులో మాంసం ముక్కలు దర్శనమిచ్చాయి. ఎంతో ఇష్టంగా తిందామనుకున్న వెజ్ బిర్యానీలో నాన్‌వెజ్ కనిపించడంతో షాకైన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో చోటుచేసుకుంది. అక్షయ్ దూబే అనే వ్యక్తి విజయ్ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లి వెజ్ బిర్యాని ఆర్డర్ చేశాడు. అసలే ఆకలి మీదున్న అక్షయ్.. టేబుల్ మీదకొచ్చిన ఘుమఘుమలాడే వెజ్ బిర్యానీని ఓ పట్టున లాగేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా బిర్యానీలో మాసం బొక్కలు కనిపించడంతో అతడు కంగుతున్నాడు. వెంటనే ఈ విషయాన్ని రెస్టారెండ్ మేనేజర్, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. పొరపాటు జరిగిందంటూ వారు క్షమాపణలు తెలియజేశారు. అంతేగాక ఆక్షయ్.. విజయ్ నగర్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. శాఖాహారులకు మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రెస్టారెంట్ యజమాని స్వప్నిల్ గుజరాతీపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసల్ సంపత్ ఉపాధ్యాయ తెలిపారు. చదవండి: జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం -
చాలీచాలని జీతం, ఇదేనా జీవితం.. ఉద్యోగం వద్దని బిర్యానీ బిజినెస్ పెట్టిన టెకీలు!
చండీఘఢ్: రోజూ ఉదయాన్నే లేవడం, ఉద్యోగానికి వెళ్లడం, 9 నుంచి 5 వరకు పని చేయడం. నెల చివర్లో చాలీచాలని జీతం. ఈ రొటీన్ జీవితం విసుగుచెందిన ఇద్దరు టెకీలు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని పుడ్ బిజినెస్ పెట్టారు. కొత్త రకం వెజ్ బిర్యానీ అమ్ముతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. గతంలో తాము ఉద్యోగం చేస్తున్నప్పుడు కంటే ప్రస్తుతమే సంతృప్తికరంగా ఉన్నారని చెప్తున్నారు. హర్యానాలోని సోనిపట్‌లో వెజిటబుల్ బిర్యానీ స్టాల్ నడుపుతున్న వారిద్దరూ ఏం చెబుతున్నారంటే.. తాము ఉద్యోగం చేస్తున్న సమయంలో అది పెద్దగా నచ్చేది కాదని అప్పుడు కూడా వ్యాపారం వైపే తమ చూపు ఉండేదని వారు తెలిపారు. అందుకే వారిద్దరు కలిసి ఇంజనీర్ వెజ్ బిర్యానీ పేరుతో ఫుడ్ బిజినెస్‌లోకి దిగినట్లు టెకీలు రోహిత్, సచిన్ చెబుతున్నారు. సోనిపట్ సహా ఇతర ప్రాంతాల్లోనూ వీరి స్టాల్ మనకు కనిపిస్తుంది. వాళ్లకి జాబ్‌లో వచ్చే జీతం కంటే వ్యాపారంలో అధికంగా సంపాదిస్తున్నామని అంటున్నారు. నూనె లేకుండా వారు వడ్డించే వెజ్ బిర్యానీ ప్లేట్ రూ 70, హాఫ్ ప్లేట్ రూ 50గా ధర నిర్ణయించారు. ధర తక్కువ, పైగా వారి వెజ్ బిర్యానీ రెసిపీ అందరికీ నచ్చడం, లాభాలు కూడా బాగా వస్తున్నాయి. ఇంకేముంది వారు ఆ వ్యాపారాన్ని విస్తరించాలని కూడా ఆలోచిస్తున్నారు. -
చిక్కడపల్లి: వెజ్ బిర్యానీలో బొద్దింక..
Cockroach Found In Biryani: వెజ్ బిర్యానీలో బొద్దింక కనిపించడంతో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులకు వ్యక్తి ఫిర్యాదు చేసిన ఘటన చిక్కడపల్లిలో జరిగింది. చిక్కడపల్లిలో నివసించే గణపతిశాస్త్రి నందినిసుధా హోటల్లో గురువారం వెజ్ బిర్యానీ పార్శిల్ తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి చూడగా అందులో బొద్దింక కనిపించింది. చదవండి: ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు .. హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన జీహెచ్ఎంసీ హెల్ప్ విభాగం అధికారులు ఆ హోటల్‌కు రూ.5వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే హోటల్‌ను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. చదవండి: ఇదేం ఐడియా సామీ.. పంట చేలో కార్తీకదీపం ఫేమ్ వంటలక్క! -
బిర్యానీ కావాలా బాబూ?
ఆదివారం కావడంతో రొటీన్‌కు భిన్నంగా షూటింగ్ లొకేషన్‌కు కాకుండా వంట గదిలోకి అడుగుపెట్టారు జాన్వీ కపూర్. సుదీర్ఘంగా ఆలోచించి వెజిటబుల్ బిర్యానీ చేయడానికి సిద్ధమయ్యారు. వెంటనే రెసిపీని ఫాలో అవుతూ రెడీ చేసేశారు. సందేహాలు వచ్చినప్పుడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ సహాయం తీసుకున్నారు. జాన్వీ చేసిన ఈ వెజిటబుల్ బిర్యానీని మీరాతో పాటు, ఇషాన్ కట్టర్, షాహిద్‌కపూర్ కూడా రుచి చూశారట. వీరందరూ కలిసి ఆదివారం బ్రంచ్ చేశారు. జాన్వీ చేసిన వెజిటబుల్ బిర్యానీని సోషల్ మీడియాలో షేర్ చేశారు మీరా రాజ్‌పుత్. ‘‘రెడ్ రైస్ వెజిటబుల్ బిర్యానీ చేసిన జాన్వీ కపూర్‌ను మెచ్చుకోవాల్సిందే’’ అని పేర్కొన్నారు మీరా. ఇక జాన్వీ కెరీర్ విషయానికి వస్తే.. ‘గుంజన్ సక్సెనా: ది కార్గిల్‌గాళ్’, ‘రూహి అఫ్జా’ సినిమాలతో పాటు ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఆంథాలజీలో నటిస్తున్నారు. -
ఐకియా స్టోర్ : వెజ్ బిర్యానీ, సమోసా అమ్మకం బంద్
హైదరాబాద్ : నెల రోజుల క్రితమే హైటెక్‌సిటీ ప్రాంతంలో గ్రాండ్‌గా ప్రారంభమైన ప్రఖ్యాత అంతర్జాతీయ ఐకియా స్టోర్‌కు చెందిన ఫుడ్‌కోర్టులో వెజిటేబుల్ బిర్యానీలో గొంగళిపురుగు వచ్చిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితుడు సామాజిక మాధ్యమం ద్వారా చేసిన ఫిర్యాదుకు స్పందించి జీహెచ్ఎంసీ అధికారులు నిర్వాహకులకు రూ.11,500 జరిమానా కూడా విధించారు. తాజాగా ఐకియా ఇండియా, తన స్టోర్‌లో వెజిటేబుల్ బిర్యానీని, సమోసాను అమ్మడం నిలిపివేసింది. తనకు తానుగా వీటి విక్రయాలను ఐకియా స్టోర్ క్లోజ్ చేసింది. నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించేందుకు బలమైన అంతర్గత ప్రక్రియను పాటిస్తున్న ఐకియా, తన సప్లయ్ చైన్ పూర్తి బాధ్యతను తన తలపైనే వేసుకుంది. ఈ క్రమంలోనే వెజిటేబుల్ బిర్యానీని, సమోసాను అమ్మడం మానేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సరియైన పరిష్కార చర్యలు తీసుకోవడానికి అంతర్గత సమీక్ష చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతేకాక తమ లోపాలను సరిచేసుకుంటామని ఐకియా తెలిపింది. రివ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ రెండింటి అమ్మకాలను చేపడతామని కంపెనీ తెలిపింది. ఆహారంలో నాణ్యతను, భద్రతను ఈ కంపెనీ చాలా సీరియస్‌గా తీసుకుంది. వినియోగదారుల ఆరోగ్యానికి ఇది పెద్ద పీట వేస్తుంది. తొలి నెల కార్యకలాపాల్లో భాగంగా ఐకియా ఇండియాకు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. -
వెజ్ బిర్యానీలో ‘బల్లి ’
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలు, ఆహారంపై విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన కాగ్ రిపోర్ట్ అనుగుణంగా రైల్వేల బాగోతం మరోసారి బట్ట బయలైంది. ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన భోజనంలో చనిపోయిన బల్లి కనిపించడం ఆందోళన రేపింది. పూర్వా ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్న భక్తుల బృందానికి మంగళవారం ఈ చేదు అనుభవం ఎదురైంది. పార్లమెంటులో సమర్పించిన కాగ్ నివేదిక నేపథ్యంలో ప్రయాణికుల ఆందోళన, ఆశ్చర్యం ఇంకా చల్లారకముందే రైళ్ళలో ఆహారం మానవ వినియోగానికి తగదన్న కఠోర సత్యం మరోసారి రుజువైంది. ఝార్ఖండ్ నుంచి ఉత్తర ప్రదేశ్‌కు ప్రయాణిస్తున్న యాత్రికులు బృందం లక్నో కు సమీపంలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. దీంట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో బెంబేలెత్తిపోయారు. అంతేకాదు దీన్ని తిన్న ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఆ భోజనాన్ని బయటికి విసిరి పారేశారు తప్ప ఎలాంటి స్పందన లేదు. అటు రైల్వే టికెట్ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. దీంతో విసుగెత్తిన ఒక ప్రయాణికుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కొంతమంది సీనియర్ అధికారులు వెంటనే వారికి కొన్ని మందులు అందించారు. సీనియర్ రైల్వే అధికారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణీకుల అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఇక్కడికి రావడానికి ముందే, వైద్యుల సహాయంతో మెడిసిన్స్ సూచించినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి, కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పారు. అలాగే దీనికి సబంధించి మంత్రిత్వశాఖకు ఒక నివేదిక కూడా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. కాగా రైళ్ళలో, రైల్వే స్టేషన్లలోని కేటరింగ్ యూనిట్లలో పరిశుభ్రతను పాటించడం లేదని కాగ్ మండిపడింది. ఈ ఆహారం మానవ వినియోగానికి పనికిరానిదని, చాలా అనాగ్య పరిస్థితులలో, కలుషితమైన నీటితో వండుతారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చిన సంగతి తెలిసిందే. -
కుళ్లిన కూరగాయలతో విందు
ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో గురువారం విద్యార్థులకోసం కుళ్లిన వంకాయలతో చేసిన కూర, ఉడకని అన్నం సిద్ధం చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండాను సరిగా ఆవిష్కరించారో లేదో పరిశీలించడానికి విద్యార్థి సంఘాల నాయకులు బాలికల హాస్టల్ కు వచ్చారు. రంగు వెలసిన కాగితాలను అతికించడం, జెండా రెపరెపలాడకుండా కర్రకు అతుక్కుపోయి ఉండడంపై వారు హాస్టల్ సిబ్బందిని ప్రశ్నించారు. జెండాను ఆవిష్కరించిన వెంటనే వార్డెన్ విజయలక్ష్మి వెళ్లిపోయారని సిబ్బంది చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించి విస్మయం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు వెజ్‌బిర్యాని, పాయసం వడ్డించాల్సి ఉంది. అయితే ఉడకని అన్నం, కుళ్లిన కూరగాయలతో చేసిన కూరను గమనించి వెంటనే తహశీల్దార్‌కు సమాచారం అందించారు. ఆయన హాస్టల్‌కు వచ్చి సిబ్బంది వివరణ తీసుకున్నారు. కలెక్టర్‌కు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఆందోళనలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యాసాగర్, సంతోష్, మహేశ్, ప్రవీణ్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.