వెజ్ బిర్యానీలో ‘బల్లి ’
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలు, ఆహారంపై విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన కాగ్ రిపోర్ట్ అనుగుణంగా రైల్వేల బాగోతం మరోసారి బట్ట బయలైంది. ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన భోజనంలో చనిపోయిన బల్లి కనిపించడం ఆందోళన రేపింది. పూర్వా ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్న భక్తుల బృందానికి మంగళవారం ఈ చేదు అనుభవం ఎదురైంది.
పార్లమెంటులో సమర్పించిన కాగ్ నివేదిక నేపథ్యంలో ప్రయాణికుల ఆందోళన, ఆశ‍్చర్యం ఇంకా చల్లారకముందే రైళ్ళలో ఆహారం మానవ వినియోగానికి తగదన్న కఠోర సత్యం మరోసారి రుజువైంది. ఝార్ఖండ్ నుంచి ఉత్తర ప్రదేశ్‌కు ప్రయాణిస్తున్న యాత్రికులు బృందం లక్నో కు సమీపంలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. దీంట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో బెంబేలెత్తిపోయారు. అంతేకాదు దీన్ని తిన్న ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఆ భోజనాన్ని బయటికి విసిరి పారేశారు తప్ప ఎలాంటి స్పందన లేదు. అటు రైల్వే టికెట్ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. దీంతో విసుగెత్తిన ఒక ప్రయాణికుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కొంతమంది సీనియర్ అధికారులు వెంటనే వారికి కొన్ని మందులు అందించారు.
సీనియర్ రైల్వే అధికారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణీకుల అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఇక్కడికి రావడానికి ముందే, వైద్యుల సహాయంతో మెడిసిన్స్ సూచించినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి, కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పారు. అలాగే దీనికి సబంధించి మంత్రిత్వశాఖకు ఒక నివేదిక కూడా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
కాగా రైళ్ళలో, రైల్వే స్టేషన్లలోని కేటరింగ్ యూనిట్లలో పరిశుభ్రతను పాటించడం లేదని కాగ్ మండిపడింది. ఈ ఆహారం మానవ వినియోగానికి పనికిరానిదని, చాలా అనాగ్య పరిస్థితులలో, కలుషితమైన నీటితో వండుతారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చిన సంగతి తెలిసిందే.