Railways Minister
-
వీల్‌చైర్ వాడేవారి కోసం రైళ్లలో ర్యాంపులు
న్యూఢిల్లీ: వీల్‌చైర్ వాడే వారు, సీనియర్ సిటిజన్ల సౌకర్యం కోసం రైళ్లలో త్వరలో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన ర్యాంపుల ఫొటోలను శనివారం ఆయన విడుదల చేశారు. ఇలాంటి వాటిని ఇప్పటికే చెన్నై రైల్వే స్టేషన్లో వినియోగించి చూశామని, ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా అందిందన్నారు. త్వరలో వీటిని వందేభారత్ రైళ్లలో, ఆ తర్వాత మిగతా రైళ్లలోనూ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. టికెట్లు బుకింగ్ చేసుకునే సమయంలోనే వీటి అవసరముందనే విషయం ప్రయాణికులు తెలిపేందుకు వీలుగా మార్పులు చేస్తున్నామన్నారు. దాని ఆధారంగా సంబంధిత రైల్వే స్టేషన్లకు అలెర్ట్ వెళ్తుందని, దాన్ని బట్టి అక్కడి సిబ్బంది ర్యాంపును సిద్ధంగా ఉంచుతారని వివరించారు. బోగీ తలుపుల వద్ద వీటిని సునాయాసంగా ఏర్పాటు చేయొచ్చన్నారు. -
దేశంలో తొలి రైల్వే కేబుల్ బ్రిడ్జి సిద్ధం
జమ్మూ: దేశంలోనే మొట్టమొదటి రైల్వే తీగల వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా వెల్లడిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. కేవలం 11 నెలల్లో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యిందని తెలియజేశారు. వంతెన వీడియోను షేర్ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా అంజీ ఖద్‌లో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. దీని మొత్తం పొడవు 473.25 మీటర్లు. 96 ప్రధాన తీగలు ఉన్నాయి. ఉదంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్)లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. కాట్రా వైపు ఉన్న టన్నెల్ టీ2, రియాసీ వైపు ఉన్న టన్నెల్ టీ3ని ఇది అనుసంధానిస్తుంది. వంతెన నిర్మాణంలో ఉపయోగించిన మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు కావడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై ఉన్న రైల్వే వంతెన తర్వాత ఇది దేశంలోనే రెండో అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన. బలమైన గాలులు, తుఫాన్లు, పేలుళ్లను సైతం తట్టుకొనేలా డిజైన్ చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ట్వీట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్సలెంట్(అద్భుతం) అంటూ స్పందించారు. -
రైలులో టాయిలెట్లను పర్యవేక్షించిన మంత్రి: వీడియో వైరల్
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు బోగీలలోని కొత్తగా రూపొందించిన టాయిలెట్ల డిజైన్లను తనఖీ చేశారు. కొత్త హంగులతో ఆధునికరించిన మరుగుదొడ్లను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. అక్కడ ఒక వ్యక్తి చేసిన వర్క్ గురించి మంత్రికి వివరిస్తున్నాడు. ఆ వీడియోలో చాలా వరకు మరుగుదొడ్లను బాగా ఆధునీకరించారు. మంత్రి అశ్విన్ స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ చక్కగా ఉండేలా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ట్రైయిన్లు కూడా చెత్తతో పేరుకుపోయి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవడమే కాకుండా ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. పైగా ప్రజలను కూడా రైళ్లు శుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా దీనికి సహకరించాలని విజ్క్షప్తి చేశారు కూడా. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని రైల్వే మంత్రి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు చాలా బాగా చేస్తున్నారు మంత్రి గారు, భవిష్యత్తులో కూడా ఇలానే మెయింటెన్ చేస్తే బాగుంటుందంటూ కామెంట్లు చేస్తూ..ట్వీట్ చేశారు. Inspected the new upgraded toilet designs for existing coaches. pic.twitter.com/2v426YZiEy — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 31, 2023 (చదవండి: రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేకత ఏమి లేదు: కాంగ్రెస్ చీఫ్ ఎం ఖర్గే) -
స్టార్టప్‌లకు రైల్వే నిధుల మద్దతు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ఏటా రూ.50 కోట్ల నిధులు అందించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. మరే ఇతర భాగస్వామ్యాల మాదిరిగా ఇది ఉండదని స్పష్టం చేస్తూ.. మేథో సంపత్తి హక్కులు ఆయా ఆవిష్కరణదారులకే (స్టార్టప్ సంస్థలకు) ఉంటాయని స్పష్టం చేశారు. ఇండియన్ రైల్వే ఆవిష్కరణల విధానం కింద.. రైల్వే శాఖ స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెడుతుందని, దీని ద్వారా వినూత్నమైన సాంకేతిక ఆవిష్కరణలను వారి నుంచి నేరుగా పొందొచ్చని మంత్రి తెలిపారు. వినూత్నమైన సాంకేతిక పరిష్కారాలకు రూ.1.5 కోట్లను సీడ్ ఫండ్‌గా అందించనున్నట్టు చెప్పారు. నిధుల మద్దతును రెట్టింపు చేస్తామని, విజయవంతంగా అభివృద్ధి చేసిన ఉత్పత్తి లేదా టెక్నాలజీని అమల్లో పెడతామని వివరించారు. ఆవిష్కర్తలు, రైల్వే 50:50 నిష్పత్తిలో వ్యయాలు భరించేలా ఈ పథకం ఉంటుందన్నారు. స్టార్టప్ ల ఆవిష్కరణ, అభివృద్ధి దశలో రైల్వే ఫీల్డ్ ఆఫీసర్లు, ఆర్డీఎస్వో, జోనల్, రైల్వే బోర్డు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సహకారం అందుతుందని వైష్ణవ్ తెలిపారు. పారదర్శక విధానంలో స్టార్టప్‌ల ఎంపిక ఉంటుందని, ఇందు కోసం ప్రత్యేకంగా ఇన్నోవేషన్ ఇండియన్ రైల్వేస్ పేరిట పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2004–09లో రైల్వే శాఖలో గ్రూప్–డి ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి బిహార్ రాజధాని పాట్నాలో లక్షకుపైగా చదరపు అడుగుల భూమిని లాలూ, కుటుంబ సభ్యులు తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. లాలూ 2004–09లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న సీబీఐ ఆర్థిక నేరాల విభాగం ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. తాజా కేసు నేపథ్యంలో సీబీఐ అధికారులు ఢిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్‌లో లాలూ, కుటుంబ సభ్యులకు సంబంధించిన 16 చోట్ల సోదాలు ప్రారంభించారు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌తోపాటు అక్రమంగా ఉద్యోగాలు దక్కించుకున్న మరో 12 మందిని నిందితులుగా చేర్చారు. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ 2021 సెప్టెంబర్ 23న దర్యాప్తు ప్రారంభించింది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మూడు సేల్ డీడ్ల ద్వారా భూమిని రబ్రీదేవికి, ఒక సేల్ డీడ్ ద్వారా మీసా భారతికి, రెండు గిఫ్ట్ డీడీల ద్వారా హేమా యాదవ్‌కు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములను సొంతం చేసుకోవడానికి లాలూ కుటుంబం సదరు అభ్యర్థులకు కేవలం రూ.3.75 లక్షల నుంచి రూ.13 లక్షల దాకా చెల్లించినట్లు సీబీఐ చెబుతోంది. నిజానికి ఆ భూముల విలువ రూ.కోట్లల్లో పలుకుతోంది. సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు న్యాయస్థానం ఇటీవలే బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) స్పందించింది. కేంద్రంలోని అధికార బీజేపీ సీబీఐని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగుతోందని, తాము భయపడే ప్రసక్తే లేదని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ ఝా తేల్చిచెప్పారు. రబ్రీదేవి పట్ల అధికారుల అనుచిత ప్రవర్తన బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి పట్ల సీబీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని, అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఆరోపించింది. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కేసులో సీబీఐ అధికారులు శుక్రవారం పాట్నాలో రబ్రీ దేవి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆమెను 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. -
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాంరాం!
సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో పరోక్షంగా స్పష్టతనిచ్చారు. విభజన చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని చేర్చిన వారు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించారా.. ఏ రకంగా ఈ అంశాన్ని చేర్చారనేది వారినే అడగాలని సూచించారు. బుధవారం రాజ్యసభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన కేంద్రమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అంతకుముందు చర్చలో భాగంగా మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేంద్రానికి అనేకసార్లు వినతి పత్రాలు అందించామని రైల్వే శాఖ మంత్రికి గుర్తుచేశారు. ప్రస్తుతం భారతీయ రైల్వే వద్ద అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో కట్టిన డబ్బును అవసరమున్న చోట వెచ్చించాలే తప్ప అనవసరంగా వృథా చేయొద్దని రైల్వే మంత్రి పేర్కొన్నారు. కోచ్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలు ఇప్పుడు దేశంలో పూర్తిస్థాయిలో ఉన్నాయని తెలిపారు. భారీగా పెరిగిన ఎల్‌హెచ్‌పీ కోచ్‌లు 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రైల్వే శాఖలో నాణ్యమైన ఎల్‌హెచ్‌పీ కోచ్‌ల సంఖ్య 2,500 కంటే తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 25 వేలకు చేర్చామని చెప్పారు. 2018లో తమ ప్రభుత్వం ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని పూర్తిగా నిలిపేసిందని పేర్కొన్నారు. 2014 వరకు రాయ్‌బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో కనీసం ఒక్క కోచ్‌ను కూడా తయారు చేయలేదని, 2018లో ప్రధాని నరేంద్రమోదీ కోచ్ ఫ్యాక్టరీ పర్యటన తర్వాత కోచ్‌లు రెట్టింపు స్థాయిలో సిద్ధమవుతున్నాయని తెలిపారు. -
వెజ్ బిర్యానీలో ‘బల్లి ’
న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాలు, ఆహారంపై విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన కాగ్ రిపోర్ట్ అనుగుణంగా రైల్వేల బాగోతం మరోసారి బట్ట బయలైంది. ఒక ప్రయాణికుడు ఆర్డర్ చేసిన భోజనంలో చనిపోయిన బల్లి కనిపించడం ఆందోళన రేపింది. పూర్వా ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణిస్తున్న భక్తుల బృందానికి మంగళవారం ఈ చేదు అనుభవం ఎదురైంది. పార్లమెంటులో సమర్పించిన కాగ్ నివేదిక నేపథ్యంలో ప్రయాణికుల ఆందోళన, ఆశ్చర్యం ఇంకా చల్లారకముందే రైళ్ళలో ఆహారం మానవ వినియోగానికి తగదన్న కఠోర సత్యం మరోసారి రుజువైంది. ఝార్ఖండ్ నుంచి ఉత్తర ప్రదేశ్‌కు ప్రయాణిస్తున్న యాత్రికులు బృందం లక్నో కు సమీపంలో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారు. దీంట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో బెంబేలెత్తిపోయారు. అంతేకాదు దీన్ని తిన్న ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేస్తే ఆ భోజనాన్ని బయటికి విసిరి పారేశారు తప్ప ఎలాంటి స్పందన లేదు. అటు రైల్వే టికెట్ అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. దీంతో విసుగెత్తిన ఒక ప్రయాణికుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కొంతమంది సీనియర్ అధికారులు వెంటనే వారికి కొన్ని మందులు అందించారు. సీనియర్ రైల్వే అధికారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణీకుల అనారోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ఇక్కడికి రావడానికి ముందే, వైద్యుల సహాయంతో మెడిసిన్స్ సూచించినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి, కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పారు. అలాగే దీనికి సబంధించి మంత్రిత్వశాఖకు ఒక నివేదిక కూడా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. కాగా రైళ్ళలో, రైల్వే స్టేషన్లలోని కేటరింగ్ యూనిట్లలో పరిశుభ్రతను పాటించడం లేదని కాగ్ మండిపడింది. ఈ ఆహారం మానవ వినియోగానికి పనికిరానిదని, చాలా అనాగ్య పరిస్థితులలో, కలుషితమైన నీటితో వండుతారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చిన సంగతి తెలిసిందే.