సాక్షి, నెల్లూరు : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చెన్నై చికెన్ హోల్‌సేల్ వ్యాపారస్తులపై కన్నేశారు. ఎక్కడ నుంచి ఎలా జిల్లాకు రవాణా చేస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. నెల్లూరు నగరంలో భారీగా కల్తీ చికెన్ లభ్యమైన క్రమంలో అన్ని చికెన్ స్టాళ్ల విక్రయాలతో పాటు నాన్‌వెజ్ రెస్టారెంట్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నిరంతరం దాడులు చేసి అక్రమార్కుల ఆటకట్టిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరంలో అధికారులు చేస్తున్న వరుస దాడుల్లో చెన్నై చికెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు నగరంలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పద్మావతి సెంటర్, అంబేద్కర్ సెంటర్‌లో కల్తీ చికెన్ నిల్వలు వెలుగులోకి వచ్చాయి.
దాదాపు 500 కిలోలపైన చికెన్ షాపుల్లో నిల్వ ఉండటంతో అధికారులు తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై, బెంగళూరు నగరాల్లో డంపింగ్ యార్డుకు వెళ్లే చికెన్‌ను నెల్లూరు వ్యాపారులు కొందరు కొనుగోలు చేసి ఇక్కడి చికెన్‌లో కలిపి విక్రయిస్తున్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేసి రెండు షాపులను సీజ్ చేసి భారీగా అపరాధ రుసము విధించనున్నారు. నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా చికెన్ పకోడి బండ్లు, బార్లు, సాధారణ హోటళ్లకు దీన్ని అధికంగా విక్రయిస్తున్నారు.దీంతో పాటు నగరంలోని మిగిలిన చికెన్ షాపుల్లో నగరపాలక సంస్థ ప్రజారోగ్య బృందాల తనిఖీలు బుధవారం కూడా కొనసాగాయి. మరోవైపు చెన్నై మూలల అన్వేషణపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని మిగిలిన మున్సిపాల్టీల్లోనూ తనిఖీలు మొదలయ్యాయి.
ఇది చదవండి : వామ్మో.. చెన్నై చికెన్
మాంసం విక్రయాలపై ప్రత్యేక నిఘా
నాన్‌వెజ్ వంటకాలకు నెల్లూరు ఖ్యాతి గాంచింది. నెల్లూరు నగరంలోనే దాదాపు 150కు పైగా నాన్‌వెజ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో మటన్, చికెన్‌లో కల్తీ జరగుతోందనేది అధికారులకు ఉన్న సమాచారం. ఈ క్రమంలో అన్ని స్టాళ్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. మటన్‌లోనూ కల్తీ జరగుతోందని అధికారులు ప్రా«థమికంగా నిర్థారించారు. ఈ క్రమంలో నగరంలోని అన్ని ప్రధాన షాపుల్లోని శాంపిల్స్‌ను అక్కడికక్కడే పరిశీలించడంతో పాటు ల్యాబ్‌కు పంపిచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment