
విభిన్న సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్.. విభిన్న రుచుల భాండాగారం మన భాగ్యనగరం. స్థానిక వంటకాలు మొదలు ఖండాంతరాలు దాటిన కాంటినెంటల్ వంటకాలకు నెలవు ఈ భాగ్యనగరం. ఇందులో భాగంగా కొరియన్, మొరాకో వంటకాలు మొదలు ఇటాలియన్, స్పానిష్ వెరైటీల వరకూ నగరానికి క్యూ కడుతున్నాయి. విదేశీ పర్యాటకులు, బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, సినిమా, క్రీడా రంగ ప్రముఖులు నగరానికి వస్తుండటంతో కాంటినెంటల్ వంటకాలకు ఆదరణ పెరిగింది. నగరవాసులు సైతం విభిన్న వంటకాలు, వినూత్న రుచులను ఆస్వాదించడంలో ముందుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని ది లీలా హైదరాబాద్ హోటల్ రీన్ చెఫ్ స్టూడియో వేదికగా ప్రసిద్ధ ఫ్రెంచ్–ఇటాలియన్ వంటకాలు సందడి చేస్తున్నాయి. మార్చి ప్రారంభం వరకూ అందుబాటులో ఉండే ఈ ఐకానిక్ రుచులు హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తీసుకొస్తున్నాయి.
విశ్వవ్యాప్తంగా అరుదైన ఫ్రెంచ్–ఇటాలియన్ రుచులను నగరానికి తీసుకొచ్చింది ‘లే సర్క్’. లీలా, రీన్ చెఫ్ స్టూడియోలో ఆతిథ్యమిస్తున్న ‘లే సర్క్’ న్యూయార్క్ వేదికగా ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ రుచులకు గమ్యస్థానం.
నగరంలో ప్రారంభమైన ఈ ప్రత్యేక పాప్–అప్ దశాబ్దాలుగా ప్రపంచ స్థాయి లగ్జరీ డైనింగ్ వేదిక. దక్కన్ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన వేదికగా ఇటాలియన్ సంస్కృతిని ఆహ్వానించడంతో ఫుడ్ లవర్స్ వావ్ అంటున్నారు. హిమాలయాలు, దట్టమైన అడవుల్లో లభించే అరుదైన పుట్టగొడుగులుతో(లక్షల రూపాయలు ఖరీదు చేసే) సహా అరుదైన పదార్థాలు, పుష్పాలతో వడ్డించిన డిషెస్ ఇక్కడ సందడి చేస్తున్నాయి.
చెఫ్స్ స్పెషల్ అమ్యూస్–బౌచే (మాంసాహారం)
స్మోక్డ్ అవకాడో, ట్యూనా సాకు టార్పారే – ప్యాషన్ ఫ్రూట్ జెల్ పదార్థంతో కుంకుమపువ్వును ఆకర్షణీయంగా అలంకరించి తయారు చేసిన ఫుడ్ వెరైటీ.
రావియోలీ స్టఫ్డ్ విత్ బరోలో బ్రైజ్డ్ డక్ – క్యారెట్ వెలౌట్, అరుదైన రోజ్మేరీ మోరెల్ మష్రూమ్‌తో తయారు చేసిన వంటకం. ఇందులో ‘స్పఘెట్టి, పారెల్స్ ఫోమ్ పొంగుతూ కొత్త రుచిని అందిస్తుంది.
పాపియెట్ ఆఫ్ చిలీయన్ సీబాస్ – కరకరమనే బంగాళాదుంపలు, బరోలో సాస్‌తో నోరూరించే క్రీమ్‌తో తయార చేస్తారు.
‘లే సర్క్’ క్లాసిక్ టిరామిసు – కాఫీ జెల్లీ, మస్కార్పోన్ ఎస్పుమా, కాఫీ మెరింగ్యూ సమ్మేళనంతో తయారు చేసే వినూత్న వంటకం.
చెఫ్స్ స్పెషల్ అమ్యూస్–బౌచే (శాకాహారం)
డబుల్ కుక్డ్ మోజారెల్లా – బ్రెడ్ క్రిస్టల్, బాసిల్ స్ప్రింగ్, టొమాటో రిలిష్‌తో తయారు చేసిన శాకాహార వంటకం.
హ్యాండ్–కట్ ఫ్రెష్ బ్లాక్ ట్రఫుల్ ఫెట్టూసిన్ – లక్ష రూపాయాలకు పైగా ఖరీదు చేసే అరుదుగా దొరికే మోరెల్ పుట్టగొడుగులను కలిపి పర్మేసన్ ఫండ్యు, బ్లాక్ ట్రఫుల్ షేవింగ్స్ వండుతారు.
రోస్టెడ్ బీట్‌రూట్–బుర్రటా రిసోట్టో – 24కే గోల్డ్ డస్ట్‌గా పిలిచే ముడి పదార్థంతో తయారు చేసే చిరుతిండి.
సింఫనీ ఆఫ్ చాక్లెట్ – డార్క్ చాక్లెట్ మౌస్‌తో ముంచి, మిల్క్ చాక్లెట్‌తో కలిపి, చాక్లెట్ సాయిల్, ఫ్రెష్ బెర్రీస్, చాక్లెట్ ఐస్ క్రీం సమ్మిళితంగా తయారు చేసే ‘లే సర్క్’ సిగ్నేచర్ వంటకం.
విభిన్న రుచులు..
అరుదైన, వినూత్న రుచులను ఆస్వాదించడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో భాగంగానే విదేశాలకు చెందిన వంటకాలకు ఇక్కడ అభిమానులుంటారు. ప్రస్తుతం రెన్ చెఫ్ స్టూడియోలో ఆతిథ్యమిస్తున్న వంటకాలు దేశంలో మరెక్కడా లభించవు.
– ప్రముఖ చెఫ్ వశిష్ట, లీలా రీన్ చెఫ్ స్టూడియో
Comments
Please login to add a commentAdd a comment