నిల్వ ఉంచిన చికెన్‌ను నిర్వీర్యం చేస్తున్న అధికారులు
నెల్లూరు, తోటపల్లిగూడూరు: అక్రమంగా తరలిస్తున్న 260 కేజీల నిల్వ ఉంచిన (కుళ్లిన) కోడి మాంసాన్ని పుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి స్థానిక పోలీసులు పట్టుకొన్నారు. కుళ్లిన మాంసాన్ని భూమిలో పూడ్చిపెట్టి, మాంసం సరఫరాదారుడికి రూ.20 వేల జరిమానా విధించారు. ఇటీవల కాలంలో జిల్లాలో నిల్వ ఉంచిన మాంసం సరఫరా కలకలం రేగిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కుళ్లిన మాంసం తరలింపుపై పోలీస్‌శాఖ, పుడ్‌సేఫ్టీ అధికారులు గట్టి నిఘా ఉంచారు. ఈ క్రమంలో శనివారం రాత్రి నిల్వ ఉంచిన కోడి మాంసాన్ని రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీస్‌శాఖ, పుడ్‌సేప్టీ అధికారులు నరుకూరు సెంటర్‌లో నిఘా పెట్టారు.
రాత్రి 11 గంటల సమయంలో నిల్వ ఉంచిన మాంసం తీసుకుని సాలిపేట నుంచి నరుకూరుకు తరలివస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని పోలీసులు గుర్తించారు. వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా అందులో 52 ప్యాకెట్లలో ఉన్న దాదాపు 260 కేజీల నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో సహా మాంసాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానిక ఎస్సై మనోజ్‌కుమార్, పుడ్ ఇన్‌స్పెక్టర్ రామచంద్ర ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొదటి తప్పుగా భావించి సరఫరాదారుడిపై రూ.20 వేల జరిమానాగా విధించారు. స్వాధీనం 260 కేజీల మాంసాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి భూమిలో నిర్వీర్యం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment