ఇందూరు : జిల్లా కలెక్టర్ యోగితారాణా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌తో అక్రమార్కుల చిట్టా బట్టబయలవుతోంది. ఎస్సీ,ఎస్టీ, బీసీ కార్పొరేషన్ నుంచి లబ్ధిదారులకు అందించే రాయితీల్లో పర్సంటేజీల కోసం పాకులాడుతున్న కొంతమంది రాజకీయ నేతలు,సంబంధిత ఉద్యోగులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా... లంచాలకు తావులేకుండా అసలైన పేదవాడికి ఎస్సీ,ఎస్టీ,బీసీ రుణాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ యోగితా రాణా ప్రత్యేక దృష్టి సారించారు.
అర్హులకు అన్యాయం జరిగినా.. ఎవరైనా డబ్బులు ఆశించినా లబ్ధిదారులు నేరుగా ఫోన్‌చేయాలని కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్ 18004256644 ను అందుబాటులోకి తెచ్చారు. అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం ఫోన్ నెంబరును కూడా ఇచ్చారు. దీంతో కాల్ సెంటర్‌తో పాటు ఏజేసీకి ఫోన్‌కాల్స్‌ల మోత ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 28 వరకు కాల్ సెంటర్‌కే 62 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఫోన్‌కాల్స్‌లలో అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ శాఖల్లో పని చేసే ఉద్యోగుల పైనే ఉన్నాయి. ఏజేసీ రాజారాంకు కూడా వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందులో కూడా కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగులపై ఎక్కువ వచ్చాయి.
ఎస్సీ కార్పొరేషన్‌లలో పని చేస్తున్న ఒక ఉద్యోగి రుణాల మంజూరు కోసం డబ్బులు అడుగుతున్నాడని... బీసీ కార్పొరేషన్‌లో ఓ అధికారి డబ్బులు ఆశిస్తున్నాడని ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వచ్చే రుణం రాయితీలో 30 శాతం ఇస్తే చాలు బ్యాంకు కాన్సెంట్‌తో సహా రుణం మంజూరు చేయిస్తానంటూ బేరం చేస్తున్నాడని చాలామంది ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు కూడా ఆశ్రీతులకు రుణాలు ఇప్పించడానికి పావులు కదుపుతున్నారని, అసలైన పేదలు నష్టపోతున్నారని బాధితులు పేర్కొన్నారు.
అయితే కాల్ సెంటర్‌కు, ఏజేసీకి ఫిర్యాదులు చేసిన వారి పేర్లను నమోదు చేసుకుంటున్నప్పటికీ వారి పేర్లు బయటకు పొక్కకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫిర్యాది దారుల సమస్యను నోట్ చేసుకుని రోజు వారీగా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తున్నారు. నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కలెక్టర్ ఎక్కువగా ఎవరిపై ఫిర్యాదులు వస్తున్నాయో గమనిస్తున్నారు.
ఈ మేరకే బీసీ కార్పొరేషన్ అధికారిగా పని చేసిన సాయిలు, ఎస్సీ కార్పొరేషన్‌లో నీలకంఠం అనే ఉద్యోగిని సరెండర్ చేశారని చెప్పుకుంటున్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ శాఖల్లో మరో ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు ఉన్నాయి. వారిని కూడా త్వరలో సరెండర్ చేయనున్నట్లు విశ్వనీయ సమాచారం.
పెరిగిన పోటీ..
జిల్లాలో రెండు నెలల క్రితం మండల, మున్సిపల్ కార్యాలయాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులు ఆన్‌లైన్ చేసుకున్న వారికి ఐడెంటిఫికేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొత్తం 4,777 మందికి రుణాల లక్ష్యానికి గాను 20,651 మంది దఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1లక్ష వరకు 80 శాతం సబ్సిడీని, రూ.2 లక్షల లోపు ఉంటే 70 శాతం, రూ. 2 లక్షల నుంచి నుంచి రూ. 5 లక్షల వరకు 60 శాతం సబ్సిడీ, 5 నుంచి 10 లక్షల వరకు యాభై శాతం సబ్సిడీని అందిస్తున్నట్లు తెలుపడంతో జిల్లా వ్యాప్తంగా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడాయి.
యూనిట్ల సంఖ్య తక్కువగా... దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో రావడంతో రుణాలకు పోటీ తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు ఉద్యోగులు, అధికార పార్టీ నేతలు అందిన కాడికి దండుకోవడానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగానే వచ్చే రుణంలో ముందే పర్సంటేజీలు మాట్లాడకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రుణాలు గ్రౌండింగ్ అవుతున్నాయి.
లంచమిస్తేనే ‘రుణం’
Published Sat, Apr 9 2016 4:25 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement