ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
కాకినాడ సిటీ : నగర కార్పొరేషన్‌కు ఈ నెల 29వ తేదీన ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి కార్తికేయ మిశ్రా సూచించారు. రంగరాయవైద్య కళాశాల సమావేశ హాలులో శనివారం ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పీఓలు, ఏపీఓలు, సిబ్బంది అందరూ ఎన్నికల ప్రక్రియలో ప్రతీ విషయాన్ని తు.చ. తప్పకుండా పాటించాలని కలెక్టర్ సూచించారు. అందరూ టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలన్నారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, నియమావళిని పాటించనివారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ 29వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు.
పోలింగ్ అనంతరం ఓట్ల్ల లెక్కింపును సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటలకు చేపడతామన్నారు. ఈ ఎన్నికలకు 196 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారని, 169 పోలింగ్ స్టేషన్‌లు కార్పొరేషన్ భవనాల్లో, 17 పోలింగ్ స్టేషన్‌లు ప్రభుత్వ భవనాల్లో, 10 పోలింగ్ స్టేషన్లు ప్రైవేటు భవనాలలో ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. 1,200 ఓటర్లు 127 పోలింగ్ స్టేషన్లలో ఉన్నారని, 1200 పైబడి ఓటర్లు 69 పోలింగ్ స్టేషన్లలో ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు రిజర్వుతో కలిపి 258మంది ప్రిసైడింగ్ అధికారులు, 296 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 826 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు.
ఎన్నికల సిబ్బందికి ఈ నెల 22వ తేదీన రెండో దఫా శిక్షణను రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు. పోలింగ్ కోసం 400 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లు సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజున ఓటరుకు ఫొటో ఓటర్ స్లిప్‌లను అందజేస్తారన్నారు. డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబు పీఓలకు, ఏపీఓలకు ఎన్నికల ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్ ముందు, పోలింగ్ సమయంలో, పోలింగ్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈవీఎంలు పనిచేసేవిధానం, వాటిపనితీరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్.అలీంబాషా, డిప్యూటీ కమిషనర్ రమేష్‌కుమార్, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు.