kakinada corporation
-
రాజధానికి చేరిన హౌసింగ్ అవినీతి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: హౌసింగ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని, కాకినాడలో జరుగుతున్న మోసాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నగరానికి చెందిన ముంత నళినికుమారి అనే మహిళ యత్నించింది. ఇల్లు మంజూరైందని చెప్పి రెండు విడతలుగా రూ.లక్ష కట్టించుకుని తీరా ఇల్లు లేదంటూ చేతులేత్తేశారని చెప్పుకునేందుకు సీఎం కార్యాలయానికి వెళ్లిన ఆమెకు సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. గత మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా అడ్డు తగులుతుండటం, ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నా కరుణించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవడమే కాకుండా అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కాకినాడ నగరంలో చోటుచేసుకున్న హౌసింగ్ అక్రమాలు రాజధానివేదికగా బట్టబయిలైనట్టయింది.ఒక్క నళినీయే కాదు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఇటువంటి బాధితులు వేలల్లో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను తొలి నుంచీ ‘సాక్షి’ చెప్పుకొస్తూనే ఉంది. ఇల్లు మంజూరు చేస్తామని ముడుపులు తీసుకొని, మంజూరైందని చెప్పి రూ.లక్షల్లో కట్టించుకుని, తీరా మంజూరు కొచ్చేసరికి మొండిచేయి చూపిస్తున్నారు. దీంతో సొంతింటికల నెరవేరుతుందన్న ఆశతో ఏళ్ల తరబడి ఎదురుతెన్నులు చూస్తున్న పేదలకు నిరాశ ఎదురవ్వడమే కాకుండా ముడుపులు ముట్టజెప్పి మోసపోయిన పరిస్థితి ఏర్పడింది. ‘హౌస్‌ఫర్ ఆల్’ పథకం కింద జిల్లా కేంద్రం కాకినాడకు సుమారు 4,600 ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఎంతో కాలంగా సొంతింటికోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు సొంత గూడు వస్తుందని ఆశ పడ్డారు. అయితే, అధికార పార్టీ నేతలు వచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని కాకినాడకు కేటాయించిన ఇళ్లను వాటాలు వేసేసుకున్నారు. ఒక్కొక్కరికీ 50 నుంచి 100 అని చెప్పి జన్మభూమి కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు తలో కొన్ని పంచేసుకున్నారు. పంపకాలు జరగడమే తరువాయి తమ కోటా కింద వచ్చిన ఇళ్లను అమ్మకాలకు పెట్టారు. అప్పటికే ఇళ్లు లేదని దరఖాస్తులు చేసుకున్న వారితో బేరసారాలు సాగించారు. ఒక్కో ఇంటికి రూ.25వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుని ఇళ్లు మంజూరు చేస్తామని మభ్య పెట్టారు. అంతటితో ఆగకుండా లబ్ధిదారుల నుంచి రూ. 25 వేలు చొప్పున తొలి విడతగా, రూ.75 వేలు చొప్పున రెండో విడతగా కట్టించుకున్నారు. అయితే, కాకినాడ కార్పొరేషన్‌కు తొలి విడతగా 1105 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. దరఖాస్తులు ఎక్కువ...మంజూరైనవి తక్కువ కావడంతో పోటీని చూపించి మళ్లీ ముడుపులకు డిమాండ్ చేశారు. సొంతింటి కల నెరవేరుతుందని నేతలు చెప్పినట్టుగా అడిగినంతా ముట్టజెప్పారు. ఎమ్మెల్యే ఇంటిని అడ్డాగా చేసుకుని రూ.25 వేల నుంచి రూ.50 వేలు వరకూ ముడుపులు తీసుకొని ఇల్లు మంజూరు చేస్తున్నారని ఒకానొక సందర్భంలో లబ్ధిదారులు లబోదిబోమన్నారు. పోనీ ముడుపులు తీసుకున్నా అందరికీ ఇళ్లు మంజూరు చేయలేదు. చాలా మంది లక్షలాది రూపాయలు ముట్టజెప్పినా ఇల్లు దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పులు చేసి కట్టిన నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవకపోయినా సొంతింటి కోసం అక్కడా ఇక్కడా అప్పులు చేశామని, తీరా ఇళ్లు రాలేదని వారంతా ఆవేదన చెందడమే కాకుండా రోడ్డెక్కుతున్నారు. అప్పులు భరించలేక ఏదో ఒకటి చేసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి బాధితుల్లో ఒకరు కాకినాడ డెయిరీ ఫారమ్‌కు చెందిన ముంత నళినికుమారి. రాజీవ్ గృహ కల్పలో 175ఎఫ్4లో అద్దెకుంటున్నారు. ఆమె భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు. నిరుపేదైన నళిని కుమారికి ఎముకలకు సంబంధించిన వ్యాధితోపాటు నరాల బలహీనతతో కుడి చేతి వేళ్లు వంకరపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈమె ప్రభుత్వం ఇస్తుందనుకున్న సొంతింటి కోసం రూ.25 వేలు ఒకసారి, రూ.75 వేలు మరోసారి డీడీ కట్టారు. సీ10/55 సెకండ్ ఫ్లోర్లో ఇల్లు వచ్చిందని కూడా అటు మున్సిపల్ ఆఫీసులోనూ, ఇటు ఎమ్మెల్యే ఆఫీసులోనూ చెప్పారు. కానీ ఇప్పుడు తనకే నెంబర్ ఇల్లు రాలేదని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మూడు రూపాయల వడ్డీకి తెచ్చి కడితే ఇప్పుడు ఇల్లు రాలేదని చెప్పడంతో ఆందోళనకు లోనయ్యారు. అటు ఎమ్మెల్యే కార్యాలయం, ఇటు మున్సిపల్ అధికారులు ఎంత బతిమిలాడినా స్పందించకపోవడంతో ఏకంగా అమరావతికి వెళ్లి సీఎంను కలిసి తన గోడు చెప్పుకుందామని భావించారు. ఆమేరకు గత మూడు రోజులుగా సీఎం కార్యాలయానికి వెళ్తుండగా అక్కడి అధికారులు అవకాశం ఇవ్వలేదు. శుక్రవారం కూడా ఉదయం 6 గంటల నుంచి సీఎం కార్యాలయం వద్ద నిరీక్షించగా ఏ ఒక్కరూ స్పందించలేదు సరికదా లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఈమె ఎండలో నిరీక్షించి స్పృహ తప్పి పడిపోయారు. స్థానికుల సాయంతో అసుపత్రికి తరలించారు. దీని ప్రకారం కాకినాడ కార్పొరేషన్లో హౌసింగ్ గోల్మాల్ ఏ స్థాయిలో జరిగిందో స్పష్టమవుతోంది. నేటికీ కొలిక్కిరాని డీడీల కుంభకోణం... సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో అప్పులు చేసి పుస్తెలమ్మి రూ.25వేలు చొప్పున కార్పొరేషన్‌కు ఇచ్చిన డీడీలు గల్లంతైన వ్యవహారం నేటికీ కొలిక్కి రాలేదు. కొంతమంది కార్పొరేషన్ అధికారులు, కిందిస్థాయి సిబ్బందితో టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతలు కుమ్మక్కై డీడీలను స్వాహా చేసేశారు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లతో నిజనిర్ధారణ కమిటీ వేసినప్పటికీ అధికారులు సహకరించలేదు. డీడీలు గల్లంతైనట్టు తేలినా ఎమ్మెల్యే ఒత్తిడితో ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా బుట్టదాఖలు చేశారు. డీడీల తీగ బయటికిలాగితే పచ్చనేతల బాగోతం మరింత బయటపడనుంది. -
‘హౌస్ ఫర్ ఆల్’... అక్రమాల డీల్
సాక్షిప్రతినిధి, కాకినాడ : కాకినాడ కార్పొరేషన్లో టీడీపీ నేతలు మరో మోసానికి తెరలేపారు. అందరికీ ఇళ్లు పేరుతో మళ్లీ వసూళ్ల కు తెగబడ్డారు. తక్కువగా ఉన్న ఇళ్లను బూచిగా చూపించి జేబు లు నింపుకొనే పనిలో పడ్డారు. ఒకప్పుడు ఇళ్ల మంజూరు జాబితాలో పేరు పెడతామంటూ ఆశావహుల నుంచి రూ.10 వేల వరకూ గుంజేయగా ఇప్పుడు ఇళ్లు కేటా యింపులు చేస్తామంటూ రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో డీడీలు తీసిన వారంతా తాము కోరినమేరకు ఇస్తే ఫర్వాలేదు...లేదంటే కొత్త వారికి కేటాయింపులు చేసేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఏం చే యాలో పాలుపోక దరఖాస్తుదారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నేతలు అడిగినంత డ బ్బులు ఇవ్వలేక... కాదనలేక సతమతమవుతున్నారు. చెల్లించకపోతే వచ్చిన గృహ అవకాశాన్ని కోల్పోతామేమోననిభయపడుతూ అప్పోసప్పో చేసి కట్టేందుకు తాపత్రయ పడుతున్నారు. జిల్లా కేంద్రం కాకినాడలో ‘అందరికీ ఇళ్లు’ పథకం టీడీపీ నేతలకు కాసులు కురిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా సొంతగూటికోసం ఎదురుచూస్తున్న పేదవర్గాల ఆశలను ఆసరాగా చేసుకుని కొత్తగా ఈ పథకంలో వచ్చే ఇళ్లను మొదటి దశలో ఇల్లు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క ఇల్లూ కట్టించి ఇవ్వని టీడీపీ ప్రభుత్వం కేంద్రం ప్రవేశం పెట్టిన గృహ నిర్మాణ పథకాన్ని కూడా అపహాస్యం చేయగా, పేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని జలగల్లా పీల్చేస్తున్నారు. ‘హౌస్ ఫర్ ఆల్’ కింద కాకినాడ కార్పొరేషన్‌కు రెండేళ్ల క్రితం 4,608 ఇళ్లు కేటాయించింది. దీనికి అప్పట్లో కాకినాడలోని 50 డివిజన్ల నుంచి 43 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. కానీ...వీరిలో 4,500 మంది తొలి విడతలో లబ్ధిదారుని వాటా చెల్లించేందుకు ముందుకొచ్చారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకుగాను ఎమ్మెల్యే కనుసన్నల్లో తొలి విడతగా రూ. 25 వేలు చొప్పున డీడీలు తీయించారు. అదంతా ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచే జరిగింది. కార్పొరేషన్లో డీడీలు తీసుకోవల్సింది పోగా ఎమ్మెల్యే సోదరుని ఇంటి వద్ద కౌంటర్ ఏర్పాటు చేసి సదరు డీడీలు తీసుకున్నారు. వాటితోపాటు మంజూరు జాబితాలో పెట్టాలంటే ముడుపులు ఇవ్వాల్సిందేనంటూ ఒక్కొక్క దరఖాస్తుదారుని నుంచి రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఇదంతా కార్పొరేషన్ ఎన్నికలకు ముందు జరిగిన ప్రక్రియ. నాటి డీడీలకు నేటికీ కలగని మోక్షం అప్పట్లో తీసిన డీడీలకు నేటికీ మోక్షం కలగలేదు. ఇంతవరకు వారిలో ఒక్కరికీ ఇళ్లు కట్టించి ఇవ్వలేదు కానీ నాడు తీసిన డీడీల్లో కొన్ని గల్లంతయ్యాయి. వాటిపై విచారణ కూడా జరిగి టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ భాస్కరరావును సరెండర్ చేశారు. ఆ తర్వాత డీడీల వివాదం మరుగున పడిపోయింది. ఇంతలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరుగున పడ్డ ఇళ్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా 1152 ఇళ్లు కేటాయింపులకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి గతంలో డీడీలు తీసిన వారి ద్వారా మరో రూ.75 వేలు డీడీలు తీయించే కార్యక్రమానికి తెరలేపారు. దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటం, కేటాయింపులు చేసేం దుకు ఇళ్లు తక్కువగా ఉండటంతో టీడీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. కేటాయింపులకు సిద్ధంగా ఉన్న ఇళ్లను నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి, ఆయన సోదరుడు, కార్పొరేషన్లో కీలక ప్రజాప్రతినిధితోపాటు ఆ పార్టీ కార్పొరేటర్లు వాటాలుగా వేసుకుని కేటాయింపులకు సిద్ధం చేశారు. మొదటి విడత కట్టిన రూ.25 వేలకు అదనంగా ఇప్పుడు రూ.75 వేలు డీడీ తీసుకురావాలని, అలా తెచ్చే లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు కేటాయించేస్తామని, నేరుగా ఎమ్మెల్యే నివాసం నుంచి కొంత మంది టీడీపీ దళారుల ద్వారా లబ్ధిదారులకు సంకేతాలు పంపుతున్నారు. ఇలా కేటాయింపులు చేయాలంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.75 వేలు డీడీతోపాటు అదనంగా రూ.50 నుంచి లక్ష వరకు వసూళ్లు చేస్తున్నట్టు సమాచారం. గతంలో రూ.25 వేలు చొప్పున ఇచ్చిన డీడీల గోల్మాల్ వ్యవహారం ఇప్పటికీ తేలని పరిస్థితుల్లో తాజాగా రూ.75 వేలు చొప్పున చెల్లించాలనడం లబ్ధిదారులను గందరగోళంలోకి నెడుతోంది. ఇదిలావుంటే అధికారికంగా ప్రభుత్వానికి చెల్లించా ల్సిన లబ్ధిదారుల వాటా సొమ్ము అధికార పార్టీ నేతల ఇళ్ల కు వచ్చి కట్టమనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జేసీ దృష్టికి తెచ్చినా... ఎంపిక చేసిన కొంత మంది లబ్ధిదారులకు మాత్రమే ఈ తరహా ఫోన్లు వెళ్తున్న విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, ఫ్లోర్‌లీడర్ చంద్రకళా దీప్తి, కార్పొరేటర్లు జేసీ మల్లికార్జున దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై విచారణ చేయాలని ఆయన కమిషనర్‌ను ఆదేశించినట్టు చెబుతున్నారు. అయితే రోజులు గడుస్తున్నా దీనిపై అధికారులు నోరుమెదపకపోవడం చూస్తే టీడీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి అధికారులు కూడా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలివిడత సొమ్ము తీసుకోవడంలేదు అందరికీ ఇళ్లు పథకంలో ఇల్లు మంజూరుకు సంబంధించి గతంలో వివిధ నిర్మాణాలకు రూ.25 వేలు చొప్పున డీడీలు తీసుకున్నాం. రెండో విడతగా రూ.75 వేలు లబ్ధిదారుల నుంచి తీసుకోవల్సింది గా ఇంత వరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదు. కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుల నుంచి డీడీలు కోరలేదు. – పి.సత్యవేణి, అదనపు కమిషనర్ కాకినాడ నగరపాలక సంస్థ -
టీడీపీలో మేయర్ లొల్లి
♦ పైచేయి కోసం పదునెక్కిన వ్యూహాలు ♦ కార్పొరేషన్ కిరీటంపై ఎమ్మెల్యే కొండబాబు కన్ను ♦ తన చెప్పుచేతల్లో ఉండే కార్పొరేటర్‌కు పట్టం కట్టేందుకు యత్నాలు ♦ ఎమ్మెల్యే చెప్పినవారికిస్తే నియంతృత్వానికి దారితీస్తుందని ప్రత్యర్థుల యోచన ♦ అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు ♦ డిప్యూటీపై గురిపెట్టిన రూరల్ ఎమ్మెల్యే అనంతలక్ష్మి ♦ సీల్డ్ కవర్ ద్వారా వెల్లడించే యోచనలో అధిష్టానం సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక దగ్గరపడుతున్నకొద్దీ టీడీపీలో ఆధిపత్య పోరు మరింత అధికమవుతోంది. ఇప్పుడా పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అధిష్టానం పెట్టిన షరతులకు రేసులో ఉన్న వారంతా సై అంటున్నారు. డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు రెఢీ అవుతున్నారు. దీంతో ఎవర్నెత్తిన కిరీటం పెట్టాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ప్రతిపాదిత కార్పొరేటర్లపై సర్వే చేసినా ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఆశావహుల వెనక ఒక్కో మంత్రి, ఒక్కో ఎమ్మెల్యే ఉండి ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. ఇందులో ఎవరిది పైచేయి అవుతుందో తెలియదు గానీ టీడీపీలో మాత్రం మేయర్ లొల్లి జోరందుకుంది. డిప్యూటీ మేయర్ పదవికి కూడా టీడీపీ నేతలు పట్టు బిగించారు. మేయర్ పదవిని అర్బన్‌కిస్తే, డిప్యూటీ మేయర్‌ను రూరల్‌కు ఇవ్వాలని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లకు వెరవని ఆశావహులు... రాకరాక అవకాశం వచ్చింది. భవిష్యత్తులో ఆదాయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే అభిప్రాయంతో ఆశావహులంతా ఉన్నారు. అధిష్టానం ఎన్ని రూ. కోట్లకు బేరం పెట్టినా, ఎన్ని షరతులు పెట్టినా తలాడించేందుకు ఆశావహులంతా సిద్ధమయ్యారు. ప్రస్తుతం రేసులో 38వ డివిజన్ కార్పొరేటర్ మాకినీడి శేçషుకుమారి, 28వ డివిజన్ కార్పొరేటర్ సుంకర పావని, 40వ డివిజన్ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న, 8వ డివిజన్ కార్పొరేటర్ అడ్డూరి వరలక్ష్మి ఉన్నారు. తాజాగా ఐదో పేరు ప్రస్తావనకు వచ్చింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శైలజ తాజాగా తెరపైకి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యూహ, ప్రతి వ్యూహాల్లో... రేసులో ప్రధానంగా ఉన్న మాకినీడి శేషుకుమారి వెనుక మంత్రి నారాయణ ఉండగా, సుంకరి శివప్రసన్న వెనక మంత్రి యనమల, సుంకరి పావని వెనక ఎంపీ తోట నర్సింహం, పలువురు ఎమ్మెల్యేలు, అడ్డూరి వరలక్ష్మి వెనక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) ఉన్నారు. మంత్రి నారాయణ ప్రతిపాదిస్తున్న వ్యక్తికి మేయర్ పదవి దక్కితే స్థానికంగా తమ ఆటలు సాగవని, నారాయణ డైరెక్షన్లోనే పాలన జరుగుతుంద అభిప్రాయంతో శేçషుకుమారి అభ్యర్థిత్వాన్ని జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ♦ సుంకరి పావనికిస్తే నగరంలో తనకేమాత్రం విలువ ఉండదని, తన ఆధిపత్యానికి గండి పడుతుందని, ఇతర నేతల పెత్తనం ఎక్కువైపోతుందని, రాజకీయంగా తనకు ఇబ్బందులొస్తాయన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే కొండబాబు అడ్డు తగులుతున్నట్టు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ♦ సుంకరి శివప్రసన్న విషయంలో మంత్రి యనమల తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ సామాజిక వర్గ వివాదం తలెత్తుతుందని, యనమల ఆధిపత్యం నగరంలో ఎక్కువవుతుందనే కోణంలో ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా సామాజిక వర్గ అంశాన్ని ప్రస్తావించి పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ♦ అడ్డూరి వరలక్ష్మి విషయంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే ఎమ్మెల్యే నియంతృత్వ పోకడ మరింత ఎక్కువవుతుందన్న భావనలో మిగిలిన వర్గాలున్నాయి. ఇలా ఒకరినొకరు అంతర్గతంగా దెబ్బకొట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు తమకు కావల్సిన కార్పొరేటర్‌ను మేయర్ పీఠంపై కూర్చోపెట్టేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. డిప్యూటీపై పిల్లి అనంతలక్ష్మి పట్టు... నేతలంతా మేయర్ పీఠంపై పట్టుబడుతుండగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాత్రం డిప్యూటీపై దృష్టి సారించారు. మేయర్ పదవిని అర్బన్‌కిస్తే...డిప్యూటీ పదవిని రూరల్‌కు ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అది కూడా తాను సూచించిన వ్యక్తికే ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో డిప్యూటీపై కూడా అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకుంది. -
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
కాకినాడ సిటీ : నగర కార్పొరేషన్‌కు ఈ నెల 29వ తేదీన ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి కార్తికేయ మిశ్రా సూచించారు. రంగరాయవైద్య కళాశాల సమావేశ హాలులో శనివారం ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పీఓలు, ఏపీఓలు, సిబ్బంది అందరూ ఎన్నికల ప్రక్రియలో ప్రతీ విషయాన్ని తు.చ. తప్పకుండా పాటించాలని కలెక్టర్ సూచించారు. అందరూ టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలన్నారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, నియమావళిని పాటించనివారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ 29వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. పోలింగ్ అనంతరం ఓట్ల్ల లెక్కింపును సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటలకు చేపడతామన్నారు. ఈ ఎన్నికలకు 196 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారని, 169 పోలింగ్ స్టేషన్లు కార్పొరేషన్ భవనాల్లో, 17 పోలింగ్ స్టేషన్లు ప్రభుత్వ భవనాల్లో, 10 పోలింగ్ స్టేషన్లు ప్రైవేటు భవనాలలో ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. 1,200 ఓటర్లు 127 పోలింగ్ స్టేషన్లలో ఉన్నారని, 1200 పైబడి ఓటర్లు 69 పోలింగ్ స్టేషన్లలో ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు రిజర్వుతో కలిపి 258మంది ప్రిసైడింగ్ అధికారులు, 296 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 826 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 22వ తేదీన రెండో దఫా శిక్షణను రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు. పోలింగ్ కోసం 400 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లు సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజున ఓటరుకు ఫొటో ఓటర్ స్లిప్‌లను అందజేస్తారన్నారు. డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు పీఓలకు, ఏపీఓలకు ఎన్నికల ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్ ముందు, పోలింగ్ సమయంలో, పోలింగ్ అనంతరం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈవీఎంలు పనిచేసేవిధానం, వాటిపనితీరులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్.అలీంబాషా, డిప్యూటీ కమిషనర్ రమేష్‌కుమార్, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. -
మంత్రులు, ఎమ్మెల్యేదీ చేరో దారి
►పార్టీ సమావేశానికి వనమాడి డుమ్మా ►1200 కోట్లు నగరానికి ఖర్చుచేసామని మంత్రులు ప్రకటన ►ఆ కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయంటున్న ప్రజలు భానుగుడి(కాకినాడ) : అధికార టీడీపీలో వర్గపోరు చాపకింద నీరులా సాగుతోంది. మంత్రులు, ఎంపీలు ఒకవర్గం, ఎమ్మెల్యే ఒక వర్గంగా విడివిడిగా అధిష్టానం మెప్పు కోసం అన్నట్లు వ్యవహరించడం ఎన్నికల వేళ ఆపార్టీ కార్యకర్తల్లో నైరాశ్యాన్ని నింపుతోంది. ఎన్నికల్లో గెలుపుమాట అటుంచితే పార్టీ పరువు బజారున పడిపోతుందోనన్న భయం ద్వితీయ శ్రేణి నాయకుల్లో మొదలైంది. ఎలాగైనా కాకినాడ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న అధికారి పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కాకినాడ చేరుకుని నేతలు పనిచేస్తుంటే ఓపక్క స్థానిక ఎమ్మెల్యే వనమాడి, మరో పక్కమంత్రులు అలకలు.. కినుకులు వహించడం ఏంటని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా సీట్ల కేటాయింపులో మంత్రులు యనమల, చినరాజప్పలు చక్రం తిప్పడం, ఎమ్మెల్యే వనమాడికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే వర్గం ‘స్వతంత్ర’ంగా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వనమాడి ఒంటెత్తు పోకడపై ఫిర్యాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేపై ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. బీ ఫారాలను పార్టీ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉన్నా, ఎమ్మెల్యే అభ్యర్థులను ఇంటికి పిలిపించడం, చేరికలకు సంబంధించి సమాచారాలు ఇవ్వకుండా పత్రికా ప్రకటనలు ఇవ్వడం, కొందరు అభ్యర్థులపై చిందులు తొక్కడం, ఇన్చార్జి మంత్రి కిమిడి జిల్లాలో మకాం వేసినా ఏ సమాచారం ఆయనకు తెలియపరచకపోవడం ఇలా పలు అంశాలను ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లింది. కీలక సమావేశానికి ‘వనమాడి’ డుమ్మా.. కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నగర ప్రజలకు ఓట్ల కోసం పిలుపునిచ్చే క్రమంలో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశానికి నగర ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల మ్యానిఫెస్టో పేరుతో అధిష్టానం ముద్రించి పంపిన కరపత్రాన్ని విడుదల చేసే కీలక సమావేశానికి ఎమ్మెల్యే హాజరుకాకుండా కినుక వహించడంపై సర్వత్రా చర్చజరుగుతోంది. బీజేపీ కేటాయించిన సీట్లలో వనమాడి వర్గం స్వతంత్రంగా బరిలోకి దిగడం, టీడీపీ అభ్యర్థులున్న చోటా టీడీపీ రెబల్‌గా పోటీలో ఉండడం ఇవన్నీ వనమాడి వెనుకుండి నడిపిస్తున్నారన్న ఆరోపణలు సైతం గురువారం జరిగిన పార్టీ సమావేశంలో కొందరు నేతలు మంత్రుల వద్ద ప్రస్తావించడం గమనార్హం. గురువారం జరిగిన సమావేశంలో ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, వరుపుల రాజా తదితరులు పాల్గొన్నారు. 1212 కోట్లతో అభివృధ్ది చేసాం..ఓట్లేయండి..! నగరంలో ఇళ్లు, రేషన్ కార్డులు, రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీరు.. ఇలా పలు సమస్యలతో నగరవాసులు సతమతమవుతుంటే మంత్రులు నగరానికి 2014–17 వరకు గడిచిన మూడేళ్లలో రూ.1212కోట్లతో అభివృద్ధి పనులు చేశామని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం కరపత్రాన్ని విడుదల చేశారు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాల్లో తొలుత జరగని పనులకు సైతం కాకిలెక్కలు చూపిస్తూ కరపత్రాన్ని విడుదల చేయడం సర్వత్రా హాస్యాస్పదమైంది. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే ఈ కరపత్రాన్ని విడుదల చేసినట్టు తెలుస్తోంది. కాకినాడ స్మార్ట్ సిటీలో భాగంగా ఈ ఏడాది జరుగుతున్న డ్రైన్లు, రహదారులు, ఇళ్లతో పాటు ప్రతిపాదనల్లో కాగితాల రూపంలో ఉన్న పనులను సైతం కోట్ల నిధుల రూపంలో ఖర్చు చేసినట్టు చూపడంపై పలువురు నగర వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈకోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. -
సాకులు నై... ఇక సమరమే...
⇒ కార్పొరేషన్ ఎన్నికలకు తొలగిన అడ్డంకులు ⇒ సందిగ్ధానికి తెర ⇒ఫలించని అధికార పార్టీ నేతల కుయుక్తులు ⇒గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు ఎన్నికలు వస్తున్నాయంటే ప్రధాన పార్టీల్లో జోష్ ఉంటుంది ... ఇక సమరమేనంటూ బాహుబలిలా సింహలా గర్జించాలి. పిడికిలి బిగించాలి... కదనరంగంలోకి దూకాలి. విచిత్రంగా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న ప్రధాన పార్టీ అయిన తెలుగు దేశం వెన్ను చూపిస్తోంది. ఎక్కడ ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుందోనన్న భయంతో ముందస్తుగా కోర్టులో వ్యాజ్యాలు వేయించి ... పిటీషన్లతో పితలాటకాలకు దిగింది. సుమారు నాలుగు లక్షల మంది ప్రజలకు అప్రజాస్వామ్య ఖడ్గంతో వెన్నుపోటు పొడవాలని చూసింది. కాకినాడ : టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎన్నికలు వాయిదాపడతాయని గంపెడాశలు పెట్టుకున్న అధికార పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ప్రజా వ్యాజ్యాల ద్వారా ఎన్నికలను అడ్డుకుందామని టీడీపీ ప్రయత్నించినా అవేవీ ఫలించలేదు. అధికార పార్టీ వేసిన పాచికలూ పారలేదు. ఎన్నికలు కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గత పది రోజులగా నెలకొన్న సందిగ్ధానికి తెరపైడింది. కక్కలేక మింగలేక... కక్కలేని ... మింగలేని పరిస్థితిలో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ప్రజల్లో అసంతృప్తి, మరోవైపు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఇంకోవైపు పెచ్చుమీరిపోయిన అవినీతి అక్రమాలు వెరసి పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్నికలను సతవిధాలా నిలిపివేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో గురువారం మధ్యాహ్నం నుంచి ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు డీలా పడ్డారు. ఎన్నికల పొత్తు కుదరకముందే బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీని ఇరకాటంలో పెట్టింది. తమతో పొత్తు కుదరాలంటే అడిగినన్నీ సీట్లు ఇవ్వవల్సిందేనని పట్టుబట్టింది. చివరిలో టీడీపీ దెబ్బకొట్టినా దానివల్ల బీజేపీకి జరిగిన నష్టమేమీ లేదు. ఇదేదో అయిందనుకుంటే కమ్మ సామాజిక వర్గానికి ఒక్క డివిజన్ కూడా కేటాయించకపోవడంతో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని బాహాటంగానే పిలుపునిచ్చింది. అంతటితో ఆగకుండా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన కమ్మ సామాజిక వర్గ అభ్యర్థులను గెలిపించుకుంటామంటూ ప్రకటించడంతో టీడీపీ నేతలకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఎమ్మెల్యే వనమాడికి మంత్రులు లోపాయికారీగా దెబ్బకొట్టారు. తొలుత ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇచ్చినట్టే ఇచ్చి చివరికి పక్కన పెట్టేశారు. వనమాడి ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి జ్యోతుల ఇందిరకు ఏకంగా టిక్కెట్టే ఇవ్వకుండా చేశారు. ఇదంతా మంత్రులిద్దరూ జాగ్రత్తగా పావులు కదిపి వనమాడి ఆధిపత్యానికి చెక్ పెట్టారు. దీంతో మంత్రులపై ఎమ్మెల్యే గుర్రుగా ఉండటమే కాదు వారి పేరు చెబితేనే అంతెత్తున లేస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. కమ్మ సామాజిక వర్గం విషయంలో ఎమ్మెల్యే అనుసరించిన తీరుపై చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో టీడీపీలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని... మంత్రులు, ఎమ్మెల్యే మధ్య రేగిన చిచ్చు తీవ్ర స్థాయికి చేరుకోనుందని ఆ పార్టీ వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా హైకోర్టులో చుక్కెదరు... అంతర్గత విభేదాలు, కుమ్మలాట రాజకీయాలు పక్కన పెడితే తాజాగా హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఓడిపోతామన్న భయం టీడీపీని వెంటాడుతోంది. తమ అనుయాయుల చేత హైకోర్టులో ప్రజావ్యాజ్యాలు వేయించారు. ఈ క్షణంలో ఎన్నికలు నిలిపివేయగలిగితే చాలన్నట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్ని చేసినా ఎన్నికలు కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీడీపీ తేరుకోలేని దుస్థితికి వెళ్లిపోయింది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో టీడీపీ కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఇక పోరే... హైకోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో సమరమే మిగిలింది. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నారు.నిన్నటి వరకు నెలకున్న సందిగ్థతతో ప్రచారాన్ని ముమ్మరం చేయని అభ్యర్థులు ఇక జోరు పెంచనున్నారు. ప్రస్తుతం ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే ఉంది. కొన్నిచోట్ల బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులున్నా ప్రభావం చూపించే స్థితిలో లేరు. -
కాకినాడ కార్పొరేషన్‌కు 493 నామినేషన్లు
కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు 493 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమయింది. సీట్లు సర్దుబాటుపై టీడీపీ, బీజేపీల మధ్య సయోధ్య కుదరలేదు. బీజేపీకి 8 సీట్లు ఇస్తామని టీడీపీ చెబుతోంది. అయితే 25 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు.