హౌస్ ఫర్ ఆల్ వసూళ్లపై జేసీకి ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు ఆర్‌వీజేఆర్ కుమార్, చంద్ర కళాదీప్తి తదితరులు
సాక్షిప్రతినిధి, కాకినాడ : కాకినాడ కార్పొరేషన్‌లో టీడీపీ నేతలు మరో మోసానికి తెరలేపారు. అందరికీ ఇళ్లు పేరుతో మళ్లీ వసూళ్ల కు తెగబడ్డారు. తక్కువగా ఉన్న ఇళ్లను బూచిగా చూపించి జేబు లు నింపుకొనే పనిలో పడ్డారు. ఒకప్పుడు ఇళ్ల మంజూరు జాబితాలో పేరు పెడతామంటూ ఆశావహుల నుంచి రూ.10 వేల వరకూ గుంజేయగా ఇప్పుడు ఇళ్లు కేటా యింపులు చేస్తామంటూ రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో డీడీలు తీసిన వారంతా తాము కోరినమేరకు ఇస్తే ఫర్వాలేదు...లేదంటే కొత్త వారికి కేటాయింపులు చేసేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఏం చే యాలో పాలుపోక దరఖాస్తుదారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నేతలు అడిగినంత డ బ్బులు ఇవ్వలేక... కాదనలేక సతమతమవుతున్నారు. చెల్లించకపోతే వచ్చిన గృహ అవకాశాన్ని కోల్పోతామేమోననిభయపడుతూ అప్పోసప్పో చేసి కట్టేందుకు తాపత్రయ పడుతున్నారు.
జిల్లా కేంద్రం కాకినాడలో ‘అందరికీ ఇళ్లు’ పథకం టీడీపీ నేతలకు కాసులు కురిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా సొంతగూటికోసం ఎదురుచూస్తున్న పేదవర్గాల ఆశలను ఆసరాగా చేసుకుని కొత్తగా ఈ పథకంలో వచ్చే ఇళ్లను మొదటి దశలో ఇల్లు ఇప్పిస్తామంటూ టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఒక్క ఇల్లూ కట్టించి ఇవ్వని టీడీపీ ప్రభుత్వం కేంద్రం ప్రవేశం పెట్టిన గృహ నిర్మాణ పథకాన్ని కూడా అపహాస్యం చేయగా, పేదల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని జలగల్లా పీల్చేస్తున్నారు.
‘హౌస్ ఫర్ ఆల్’ కింద కాకినాడ కార్పొరేషన్‌కు రెండేళ్ల క్రితం 4,608 ఇళ్లు కేటాయించింది. దీనికి అప్పట్లో కాకినాడలోని 50 డివిజన్ల నుంచి 43 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. కానీ...వీరిలో 4,500 మంది తొలి విడతలో లబ్ధిదారుని వాటా చెల్లించేందుకు ముందుకొచ్చారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకుగాను ఎమ్మెల్యే కనుసన్నల్లో తొలి విడతగా రూ. 25 వేలు చొప్పున డీడీలు తీయించారు. అదంతా ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచే జరిగింది. కార్పొరేషన్‌లో డీడీలు తీసుకోవల్సింది పోగా ఎమ్మెల్యే సోదరుని ఇంటి వద్ద కౌంటర్ ఏర్పాటు చేసి సదరు డీడీలు తీసుకున్నారు. వాటితోపాటు మంజూరు జాబితాలో పెట్టాలంటే ముడుపులు ఇవ్వాల్సిందేనంటూ ఒక్కొక్క దరఖాస్తుదారుని నుంచి రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఇదంతా కార్పొరేషన్ ఎన్నికలకు ముందు జరిగిన ప్రక్రియ.
నాటి డీడీలకు నేటికీ కలగని మోక్షం
అప్పట్లో తీసిన డీడీలకు నేటికీ మోక్షం కలగలేదు. ఇంతవరకు వారిలో ఒక్కరికీ ఇళ్లు కట్టించి ఇవ్వలేదు కానీ నాడు తీసిన డీడీల్లో కొన్ని గల్లంతయ్యాయి. వాటిపై విచారణ కూడా జరిగి టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ భాస్కరరావును సరెండర్ చేశారు. ఆ తర్వాత డీడీల వివాదం మరుగున పడిపోయింది. ఇంతలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరుగున పడ్డ ఇళ్ల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. తాజాగా 1152 ఇళ్లు కేటాయింపులకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి గతంలో డీడీలు తీసిన వారి ద్వారా మరో రూ.75 వేలు డీడీలు తీయించే కార్యక్రమానికి తెరలేపారు. దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటం, కేటాయింపులు చేసేం దుకు ఇళ్లు తక్కువగా ఉండటంతో టీడీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. కేటాయింపులకు సిద్ధంగా ఉన్న ఇళ్లను నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి, ఆయన సోదరుడు, కార్పొరేషన్‌లో కీలక ప్రజాప్రతినిధితోపాటు ఆ పార్టీ కార్పొరేటర్లు వాటాలుగా వేసుకుని కేటాయింపులకు సిద్ధం చేశారు.
మొదటి విడత కట్టిన రూ.25 వేలకు అదనంగా ఇప్పుడు రూ.75 వేలు డీడీ తీసుకురావాలని, అలా తెచ్చే లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు కేటాయించేస్తామని, నేరుగా ఎమ్మెల్యే నివాసం నుంచి కొంత మంది టీడీపీ దళారుల ద్వారా లబ్ధిదారులకు సంకేతాలు పంపుతున్నారు. ఇలా కేటాయింపులు చేయాలంటే ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.75 వేలు డీడీతోపాటు అదనంగా రూ.50 నుంచి లక్ష వరకు వసూళ్లు చేస్తున్నట్టు సమాచారం. గతంలో రూ.25 వేలు చొప్పున ఇచ్చిన డీడీల గోల్‌మాల్ వ్యవహారం ఇప్పటికీ తేలని పరిస్థితుల్లో తాజాగా రూ.75 వేలు చొప్పున చెల్లించాలనడం లబ్ధిదారులను గందరగోళంలోకి నెడుతోంది. ఇదిలావుంటే అధికారికంగా ప్రభుత్వానికి చెల్లించా ల్సిన లబ్ధిదారుల వాటా సొమ్ము అధికార పార్టీ నేతల ఇళ్ల కు వచ్చి కట్టమనడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
జేసీ దృష్టికి తెచ్చినా...
ఎంపిక చేసిన కొంత మంది లబ్ధిదారులకు మాత్రమే ఈ తరహా ఫోన్లు వెళ్తున్న విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, ఫ్లోర్‌లీడర్ చంద్రకళా దీప్తి, కార్పొరేటర్లు జేసీ మల్లికార్జున దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై విచారణ చేయాలని ఆయన కమిషనర్‌ను ఆదేశించినట్టు చెబుతున్నారు. అయితే రోజులు గడుస్తున్నా దీనిపై అధికారులు నోరుమెదపకపోవడం చూస్తే టీడీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి అధికారులు కూడా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మలివిడత సొమ్ము తీసుకోవడంలేదు
అందరికీ ఇళ్లు పథకంలో ఇల్లు మంజూరుకు సంబంధించి గతంలో వివిధ నిర్మాణాలకు రూ.25 వేలు చొప్పున డీడీలు తీసుకున్నాం. రెండో విడతగా రూ.75 వేలు లబ్ధిదారుల నుంచి తీసుకోవల్సింది గా ఇంత వరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదు. కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుల నుంచి డీడీలు కోరలేదు.
– పి.సత్యవేణి, అదనపు కమిషనర్ కాకినాడ నగరపాలక సంస్థ
Comments
Please login to add a commentAdd a comment