టీడీపీలో మేయర్ లొల్లి
♦ పైచేయి కోసం పదునెక్కిన వ్యూహాలు
♦ కార్పొరేషన్ కిరీటంపై ఎమ్మెల్యే కొండబాబు కన్ను
♦ తన చెప్పుచేతల్లో ఉండే కార్పొరేటర్‌కు పట్టం కట్టేందుకు యత్నాలు
♦ ఎమ్మెల్యే చెప్పినవారికిస్తే నియంతృత్వానికి దారితీస్తుందని ప్రత్యర్థుల యోచన
♦ అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు
♦ డిప్యూటీపై గురిపెట్టిన రూరల్ ఎమ్మెల్యే అనంతలక్ష్మి
♦ సీల్డ్ కవర్ ద్వారా వెల్లడించే యోచనలో అధిష్టానం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక దగ్గరపడుతున్నకొద్దీ టీడీపీలో ఆధిపత్య పోరు మరింత అధికమవుతోంది. ఇప్పుడా పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అధిష్టానం పెట్టిన షరతులకు రేసులో ఉన్న వారంతా సై అంటున్నారు. డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు రెఢీ అవుతున్నారు. దీంతో ఎవర్నెత్తిన కిరీటం పెట్టాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ప్రతిపాదిత కార్పొరేటర్లపై సర్వే చేసినా ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ఆశావహుల వెనక ఒక్కో మంత్రి, ఒక్కో ఎమ్మెల్యే ఉండి ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. ఇందులో ఎవరిది పైచేయి అవుతుందో తెలియదు గానీ టీడీపీలో మాత్రం మేయర్ లొల్లి జోరందుకుంది. డిప్యూటీ మేయర్ పదవికి కూడా టీడీపీ నేతలు పట్టు బిగించారు. మేయర్ పదవిని అర్బన్‌కిస్తే, డిప్యూటీ మేయర్‌ను రూరల్‌కు ఇవ్వాలని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు.
డిమాండ్లకు వెరవని ఆశావహులు...
రాకరాక అవకాశం వచ్చింది. భవిష్యత్తులో ఆదాయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే అభిప్రాయంతో ఆశావహులంతా ఉన్నారు. అధిష్టానం ఎన్ని రూ. కోట్లకు బేరం పెట్టినా, ఎన్ని షరతులు పెట్టినా తలాడించేందుకు ఆశావహులంతా సిద్ధమయ్యారు. ప్రస్తుతం రేసులో 38వ డివిజన్ కార్పొరేటర్ మాకినీడి శేçషుకుమారి, 28వ డివిజన్ కార్పొరేటర్ సుంకర పావని, 40వ డివిజన్ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న, 8వ డివిజన్ కార్పొరేటర్ అడ్డూరి వరలక్ష్మి ఉన్నారు.
తాజాగా ఐదో పేరు ప్రస్తావనకు వచ్చింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శైలజ తాజాగా తెరపైకి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
వ్యూహ, ప్రతి వ్యూహాల్లో...
రేసులో ప్రధానంగా ఉన్న మాకినీడి శేషుకుమారి వెనుక మంత్రి నారాయణ ఉండగా, సుంకరి శివప్రసన్న వెనక మంత్రి యనమల, సుంకరి పావని వెనక ఎంపీ తోట నర్సింహం, పలువురు ఎమ్మెల్యేలు, అడ్డూరి వరలక్ష్మి వెనక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) ఉన్నారు. మంత్రి నారాయణ ప్రతిపాదిస్తున్న వ్యక్తికి మేయర్ పదవి దక్కితే స్థానికంగా తమ ఆటలు సాగవని, నారాయణ డైరెక్షన్లోనే పాలన జరుగుతుంద అభిప్రాయంతో శేçషుకుమారి అభ్యర్థిత్వాన్ని జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.
♦ సుంకరి పావనికిస్తే నగరంలో తనకేమాత్రం విలువ ఉండదని, తన ఆధిపత్యానికి గండి పడుతుందని, ఇతర నేతల పెత్తనం ఎక్కువైపోతుందని, రాజకీయంగా తనకు ఇబ్బందులొస్తాయన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే కొండబాబు అడ్డు తగులుతున్నట్టు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
♦ సుంకరి శివప్రసన్న విషయంలో మంత్రి యనమల తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ సామాజిక వర్గ వివాదం తలెత్తుతుందని, యనమల ఆధిపత్యం నగరంలో ఎక్కువవుతుందనే కోణంలో ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా సామాజిక వర్గ అంశాన్ని ప్రస్తావించి పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
♦ అడ్డూరి వరలక్ష్మి విషయంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే ఎమ్మెల్యే నియంతృత్వ పోకడ మరింత ఎక్కువవుతుందన్న భావనలో మిగిలిన వర్గాలున్నాయి. ఇలా ఒకరినొకరు అంతర్గతంగా దెబ్బకొట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు తమకు కావల్సిన కార్పొరేటర్‌ను మేయర్ పీఠంపై కూర్చోపెట్టేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.
డిప్యూటీపై పిల్లి అనంతలక్ష్మి పట్టు...
నేతలంతా మేయర్ పీఠంపై పట్టుబడుతుండగా రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాత్రం డిప్యూటీపై దృష్టి సారించారు. మేయర్ పదవిని అర్బన్‌కిస్తే...డిప్యూటీ పదవిని రూరల్‌కు ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అది కూడా తాను సూచించిన వ్యక్తికే ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో డిప్యూటీపై కూడా అధిష్టానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకుంది.