సాకులు నై... ఇక సమరమే... | kakinada corporation elections | Sakshi
Sakshi News home page

సాకులు నై... ఇక సమరమే...

Published Thu, Aug 17 2017 11:52 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

సాకులు నై... ఇక సమరమే... - Sakshi

సాకులు నై... ఇక సమరమే...

కార్పొరేషన్‌ ఎన్నికలకు తొలగిన అడ్డంకులు 
  సందిగ్ధానికి తెర
ఫలించని అధికార పార్టీ నేతల కుయుక్తులు 
గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన హైకోర్టు   

ఎన్నికలు వస్తున్నాయంటే ప్రధాన పార్టీల్లో జోష్‌ ఉంటుంది ... ఇక సమరమేనంటూ బాహుబలిలా సింహలా గర్జించాలి. పిడికిలి బిగించాలి... కదనరంగంలోకి దూకాలి. విచిత్రంగా కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న ప్రధాన పార్టీ అయిన తెలుగు దేశం వెన్ను చూపిస్తోంది. ఎక్కడ ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహిస్తుందోనన్న భయంతో ముందస్తుగా కోర్టులో వ్యాజ్యాలు వేయించి ... పిటీషన్లతో పితలాటకాలకు దిగింది. సుమారు నాలుగు లక్షల  మంది ప్రజలకు అప్రజాస్వామ్య ఖడ్గంతో వెన్నుపోటు పొడవాలని చూసింది. 
 
 కాకినాడ : టీడీపీకి మరో షాక్‌ తగిలింది. ఎన్నికలు వాయిదాపడతాయని గంపెడాశలు పెట్టుకున్న అధికార పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ప్రజా వ్యాజ్యాల ద్వారా ఎన్నికలను అడ్డుకుందామని టీడీపీ ప్రయత్నించినా అవేవీ ఫలించలేదు. అధికార పార్టీ వేసిన పాచికలూ పారలేదు. ఎన్నికలు కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో గత పది రోజులగా నెలకొన్న సందిగ్ధానికి తెరపైడింది.

కక్కలేక మింగలేక...
కక్కలేని ... మింగలేని పరిస్థితిలో టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ప్రజల్లో అసంతృప్తి, మరోవైపు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఇంకోవైపు పెచ్చుమీరిపోయిన అవినీతి అక్రమాలు వెరసి పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్నికలను సతవిధాలా నిలిపివేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో గురువారం మధ్యాహ్నం నుంచి ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు డీలా పడ్డారు. ఎన్నికల పొత్తు కుదరకముందే బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీని ఇరకాటంలో పెట్టింది. తమతో పొత్తు కుదరాలంటే అడిగినన్నీ సీట్లు ఇవ్వవల్సిందేనని పట్టుబట్టింది. చివరిలో టీడీపీ దెబ్బకొట్టినా దానివల్ల బీజేపీకి జరిగిన నష్టమేమీ లేదు. ఇదేదో అయిందనుకుంటే కమ్మ సామాజిక వర్గానికి ఒక్క డివిజన్‌ కూడా కేటాయించకపోవడంతో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని బాహాటంగానే పిలుపునిచ్చింది.

అంతటితో ఆగకుండా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన కమ్మ సామాజిక వర్గ అభ్యర్థులను గెలిపించుకుంటామంటూ ప్రకటించడంతో టీడీపీ నేతలకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఎమ్మెల్యే వనమాడికి మంత్రులు లోపాయికారీగా దెబ్బకొట్టారు. తొలుత ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇచ్చినట్టే ఇచ్చి చివరికి పక్కన పెట్టేశారు. వనమాడి ప్రతిపాదించిన మేయర్‌ అభ్యర్థి జ్యోతుల ఇందిరకు ఏకంగా టిక్కెట్టే ఇవ్వకుండా చేశారు. ఇదంతా మంత్రులిద్దరూ జాగ్రత్తగా పావులు కదిపి వనమాడి ఆధిపత్యానికి చెక్‌ పెట్టారు. దీంతో మంత్రులపై ఎమ్మెల్యే గుర్రుగా ఉండటమే కాదు వారి పేరు చెబితేనే అంతెత్తున లేస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. కమ్మ సామాజిక వర్గం విషయంలో ఎమ్మెల్యే అనుసరించిన తీరుపై చంద్రబాబు సీరియస్‌ అయినట్టు తెలిసింది. దీంతో టీడీపీలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని... మంత్రులు, ఎమ్మెల్యే మధ్య రేగిన చిచ్చు తీవ్ర స్థాయికి చేరుకోనుందని ఆ పార్టీ వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు.  
 
తాజాగా హైకోర్టులో చుక్కెదరు...
అంతర్గత విభేదాలు, కుమ్మలాట రాజకీయాలు పక్కన పెడితే తాజాగా హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఓడిపోతామన్న భయం టీడీపీని వెంటాడుతోంది. తమ అనుయాయుల చేత హైకోర్టులో ప్రజావ్యాజ్యాలు వేయించారు. ఈ క్షణంలో ఎన్నికలు నిలిపివేయగలిగితే చాలన్నట్టుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్ని చేసినా ఎన్నికలు కొనసాగించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో టీడీపీ తేరుకోలేని దుస్థితికి వెళ్లిపోయింది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో టీడీపీ కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది.
 
ఇక పోరే...
హైకోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో సమరమే మిగిలింది. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులతో ముందుకు సాగుతున్నారు.నిన్నటి వరకు నెలకున్న సందిగ్థతతో ప్రచారాన్ని ముమ్మరం చేయని అభ్యర్థులు ఇక జోరు పెంచనున్నారు. ప్రస్తుతం ప్రధాన పోటీ వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే ఉంది. కొన్నిచోట్ల బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులున్నా ప్రభావం చూపించే స్థితిలో లేరు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement