అసెంబ్లీ, పార్లమెంటుతో పాటే స్థానిక ఎన్నికలు | Local elections with assembly and parliament elections | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ, పార్లమెంటుతో పాటే స్థానిక ఎన్నికలు

Published Sat, Jun 23 2018 3:25 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

Local elections with assembly and parliament elections - Sakshi

సాక్షి, అమరావతి/బ్యూరో: అసెంబ్లీ, పార్లమెంటుకే కాదు.. స్థానిక సంస్థలకూ ఒకేసారి ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలోని గ్రీవెన్స్‌ హాలులో అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు, ముఖ్యులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. సీఎం మాట్లాడుతూ టీడీపీ ఓటింగ్‌ శాతం గతం కన్నా పెరగాలని, అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లలో టీడీపీ విజయం సాధించేలా పనిచేయాలని సూచించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్, పార్టీ ద్వారా అనేక రకాల సమాచారం తెప్పించుకుంటున్నానని, ఏరోజు ఎంతమంది క్షేత్రస్థాయిలో ఉన్నారనే వివరాలు ఎప్పటికప్పుడు తనకు తెలుస్తాయన్నారు. మూడు పార్టీల కుట్ర రాజకీయాలను ఎండగట్టాలని, ప్రతిరోజూ పది రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలన్నారు.  

మెగా సీడ్‌ పార్క్‌ పనులను వేగవంతం చేయండి: కర్నూలులో మెగా సీడ్‌ పార్క్‌ పనులను వేగవంతం చేయాలని  చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీడ్‌ పార్కుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లో అందించాలని సూచించారు.  ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో ఆయన సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. సీడ్‌ పార్కుకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు తదితరాలకు ఓ పాలసీ తీసుకురావాల్సి ఉందని అధికారులు సీఎంకు చెప్పగా.. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదిస్తామని తెలిపారు. సీడ్‌ పార్కుకు నాలెడ్జ్‌ పార్టనర్‌గా ఉన్న ఐయోవా వర్సిటీ శాస్త్రవేత్తలు, డైరెక్టర్లను చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు. 

తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పాలి: తెలుగువారి ఆత్మగౌరవాన్ని, శక్తి, సామర్థ్యాలను దశదిశలా చాటి చెబుదామని సీఎం చంద్రబాబు అన్నారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగణ్య రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా నిలుపుతానని, 2029కి దేశంలో అగ్రగణ్య రాష్ట్రంగా 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని, అలాగే అమరావతి నగరాన్ని ఉత్తమ సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తుళ్లూరు మండలం రాయపూడిలో ఐదెకరాల్లో నిర్మితమవనున్న ఏపీ ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.  అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement