కలెక్టర్ పర్యటనకు రాజకీయ రంగు
Published Fri, Oct 28 2016 1:50 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
- నేడు భూమతో కలిసి పర్యటించనున్న కలెక్టర్
- పట్టణంలో రోడ్ల సందర్శన, సమీక్ష
- దూరంగా ఉంటున్న శిల్పా వర్గం
నంద్యాల:
జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పట్టణ పర్యటన రాజకీయ రంగు పులుముకుంది. ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన శుక్రవారం పర్యటనకు వస్తుండగా మాజీ మంత్రి, టీడీపీ ఇన్‌చార్జి వర్గానికి చెందిన చైర్‌పర్సన్ దేశం సులోచన, కౌన్సిలర్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పట్టణ అభివృద్ధికి కలిసి పని చేయాల్సిన ఎమ్మెల్యే భూమా, చైర్‌పర్సన్ దేశం సులోచన మధ్య విభేదాలకు కలెక్టర్ పర్యటన వేదిక కానుంది. శిల్పా ఆదేశిస్తే కలెక్టర్ పర్యటనలో పాల్గొంటామని చైర్‌పర్సన్ దేశం సులోచన ఇప్పటికే ప్రకటించారు.
కలెక్టర్ పర్యటన ఇలా..
గురువారం రాత్రే నంద్యాలకు వచ్చిన కలెక్టర్ శుక్రవారం ఉదయం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి పెద్దకొట్టాలకు చేరుకుంటారు. అక్కడి నుండి చిన్న చెరువు కట్టను సందర్శించి, ట్యాంక్‌బండ్ తరహాలో తీర్చిదిద్దే ప్రతిపాదనను పరిశీలిస్తారు. అక్కడి నుంచి గాంధీచౌక్, ఎన్‌కే రోడ్డులో రోడ్ల విస్తరణ అవసరాన్ని పరిశీలిస్తారు. తర్వాత ఎస్‌బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ సెంటర్ వద్ద నిలిచి పోయిన శ్యామకాల్వ ఆధునీకరణ పనులను పరిశీలించి, అక్కడి నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయం చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
చైర్‌పర్సన్‌ను ఆహ్వానించా : విజయభాస్కర్ నాయుడు, కమిషనర్
చైర్‌పర్సన్ సెల్‌నెంబర్ తెలియదు. ఆమె భర్తకు ఫోన్ చేసి, కలెక్టర్ పర్యటన గురించి తెలియజేశా. పర్యటనలో చైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు పాల్గొనేలా చూడాలని కోరాను.
శిల్పా ఆదేశాలే శిరోధార్యం: దేశం సులోచన, చైర్‌పర్సన్
కలెక్టర్ పర్యటనకు కమిషనర్ పరోక్షంగా ఆహ్వానించారు. ఆయన నుంచి తప్ప ఇతర ఆహ్వానం లేదు. పార్టీ ఇన్‌చార్జి శిల్పాను సంప్రదించి నిర్ణయం తీసుకుంటా.
Advertisement