భూమా.. జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో మూడు దశాబ్దాల పాటు ప్రత్యేక స్థానం సంపాదించిన పేరు. అయితే ఇటీవల పరిణామాలతో ఆ కుటుంబ పేరు ప్రతిష్టలు మసకబారాయి. రాజకీయంగా పతనమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా అఖిలప్రియ చేసిన తప్పిదాలతో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. దీంతో మాజీ మహిళా మంత్రి ‘పొలిటికల్ జర్నీ’ కష్టంగా మారింది. ఈ క్రమంలో కిడ్నాప్ వ్యవహారంలో చంచల్‌గూడ జైలుకు వెళ్లడంతో ప్రతిష్ట మరింత దిగజారింది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆళ్లగడ్డ రాజకీయాలు ‘గంగుల’ కుటుంబం కనున్నల్లో సాగాయి. అయితే 1989లో భూమా శేఖర్‌రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి ఆళ్లగడ్డలో రాజకీయంగా ‘భూమా’ వర్గానిదే పైచేయిగా నడిచింది. 1989 నుంచి 2014 వరకూ కేవలం ఒక్కసారి మాత్రమే ‘భూమా’ కుటుంబం ఓడిపోయింది. తక్కిన అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ‘భూమా’ కుటుంబం ప్రజారాజ్యంలో చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో 18 స్థానాల్లో మాత్రమే పీఆర్పీ విజయం సాధించిన పరిస్థితుల్లో కూడా ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి విజయం సాధించారు. ఆపై పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున నంద్యాల నుంచి నాగిరెడ్డి, ఆళ్లగడ్డలో శోభా పోటీ చేశారు. నామినేషన్ తర్వాత పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు రోడ్డు ప్రమాదంలో శోభా మృతి చెందారు. మృతి తర్వాత శోభా గెలిచారు. ఆపై శోభా స్థానంలో అఖిల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలో వీరికి ప్రాధాన్యత ఇస్తూ నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్ పదవిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కట్టబెట్టారు.
వైఎస్సార్‌సీపీని వీడడంతో మొదలైన పతనం..
జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వ్యవహారాల్లో ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్సార్‌సీపీని కాదని భూమా నాగిరెడ్డి, అఖిల టీడీపీలో చేరారు. ఇదే వారి రాజకీయ పతనానికి తొలిమెట్టు. మంత్రి పదవి ఆశతో వెళ్లిన నాగిరెడ్డికి చంద్రబాబు చేతిలో ఆశాభంగం తప్పలేదు. మంత్రి పదవి రాకపోవడం, టీడీపీలో ప్రాధాన్యత లేకపోవడంతో రోజూ నాగిరెడ్డి కుమిలిపోయేవాడని అనుచరులు చెబుతారు. దీంతోనే గుండెపోటు వచ్చి మృతి చెందారని అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. నాగిరెడ్డి మృతి తర్వాత విమర్శల జడిని తప్పించుకునేందుకు చంద్రబాబు అఖిలకు మంత్రి పదవి కట్టబెట్టి, ప్రాధాన్యత లేని పర్యాటకశాఖను కట్టబెట్టారు. ఆపై ‘భార్గవ్‌రామ్’ను అఖిల వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డితో అఖిలకు విభేదాలు మొదలయ్యాయి. ఆస్తుల వ్యవహారం, రాజకీయంగా తానూ బలపడేందుకు ఏవీ సుబ్బారెడ్డి కూడా ఆళ్లగడ్డ, నంద్యాలలో ఒక స్థానం నుంచి టిక్కెట్టు ఆశించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో అఖిల ఓడిపోయారు. చివరకు తనను చంపించేందుకు అఖిల సుఫారీ ఇప్పించారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. చింతకుంట, గోవిందపల్లికి చెందిన కొంతమందిని కడప పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటన తర్వాత అఖిల అంతమే తన పంథమని ఏవీ శపథం చేశారు. ఏవీ సుబ్బారెడ్డి దూరం కావడం రాజకీయంగా అఖిలకు కోలుకోలేని దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘భూమా’ కుటుంబ సభ్యులు కూడా దూరం
భూమా నాగిరెడ్డితో సన్నిహితంగా ఉన్న సమీప బంధువు శివరామిరెడ్డికి చెందిన క్రషర్‌ను స్వాధీనం చేసుకునేందుకు అఖిల ప్రయత్నించారు. దీనికి సంబంధించి పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. దీంతో శివరామిరెడ్డి అఖిలకు దూరమయ్యారు. నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డిని ఆ కుర్చీ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో అతనూ దూరమయ్యారు. ఆపై అఖిల పెద్దనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో విభేదాలు పొడచూపాయి. దీంతో అతను బీజేపీలో చేరారు. ఇదే సందర్భంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సోదరుడు మహేశ్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. కిషోర్ పార్టీలో చేరిన తర్వాత..అతను ఇంటికి అఖిల తాళాలు వేయించారు. ఈ పరిణామాలతో బ్రహ్మానందరెడ్డి కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఇలా ఒక్కొక్కరుగా ‘భూమా’ బంధువులు పూర్తిగా అఖిలకు దూరమయ్యారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలోని ‘భూమా’ వర్గం కూడా రాజకీయంగా ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు. దీంతో ఆళ్లగడ్డకు అఖిల వచ్చినా కనీసం పదిమంది ఇంటికి రావడం లేదు. దీంతో జిల్లాకు రావడం వదిలేసి ఎక్కువగా హైదరబాద్‌లోనే అఖిల ఉంటున్నారు. (చదవండి: అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్?)
కోలుకోలేని దెబ్బ
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి భూ వివాదంలో కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో అఖిలకు 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసింది. కిడ్నాప్ వ్యవహారంలో ఓ మాజీ మహిళా మంత్రి జైలుకు వెళ్లడం ‘సీమ’ రాజకీయాల్లో ఇదే ప్రథమమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటమి తర్వాత రాజకీయంగా దెబ్బతిన్న అఖిలప్రియకు ఈ పరిణామం మాత్రం కోలుకోలేని దెబ్బ. అనుభవరాహిత్యం, శ్రేయోభిలాషులు, బంధువులను దూరం చేసుకోవడం, భర్త భార్గవ్‌రామ్ కనుసన్నల్లోనే రాజకీయాలు చేయడం.. అఖిల రాజకీయ పతనానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. పైగా కేసులో ఏ1గా అఖిలప్రియ, ఏ2 ఏవీ సుబ్బారెడ్డి, ఏ3గా భార్గవ్‌రామ్ పేర్లు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీ రూపంలో ఆధారాలు, భార్గవ్ సోదరుడు చంద్రహాస్ పోలీసులకు చెప్పిన సమాచారం ప్రకారం కిడ్నాప్ కేసులో అఖిల, భార్గవ్ బయటపడేది దాదాపు కష్టమే అని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment