భూమా జగత్ విఖ్యాత్ , భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్
సాక్షి కర్నూలు: మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు దెబ్బమీద దెబ్బ తగులుతుండటంతో తేరుకోలేక పోతున్నారు. ఓ వైపు కుటుంబీకులు, పార్టీ శ్రేణులు దూరమవుతుండటంతో రాజకీయంగా ఉనికిని కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆమె తమ్ముడు భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి సొంత బావతోనే విభేదించి ఒంటరిగా రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి కిడ్నాప్ వ్యవహారం నుంచి బయటపడేందుకు అఖిల తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఆ కేసులో పోలీసు విచారణ నుంచి తప్పించుకునేందుకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించారని బోయిన్‌పల్లి పోలీసులు అఖిల భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
అయితే కుట్రపూరితంగా పోలీసులు తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి తమపై అభియోగం మోపుతున్నారని అఖిల చెబుతున్నారు. ఇదే క్రమంలో జగత్, భార్గవ్ పరస్పరం వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం కర్నూలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు సీఎం కేసీఆర్ బంధువులను అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కిడ్నాప్ చేశారని ఈ ఏడాది జనవరిలో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అఖిలకు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు వెళ్లి వచ్చారు. భార్గవ్, జగత్ పోలీసులకు లొంగిపోకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
కాగా ఈనెల 3వ తేదీన సికింద్రాబాద్‌లోని సిటీ కోర్టులో హాజరు కావాల్సి ఉన్నా రాలేదు. దీంతో విచారణ కోసం భార్గవ్‌ను అదుపులోకి తీసుకునేందుకు కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్స్‌కు పోలీసులు వెళ్లగా భార్గవ్ సూచనలతో వాచ్‌మన్ లోపలికి అనుమతించ లేదు. అయినప్పటికీ పోలీసులు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. అప్పటికే భార్గవ్ తప్పించుకున్నారు. తమ విధులకు ఆటంకం కల్గించారని వాచ్‌మన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకాకుండా ఉండేందుకు భార్గవ్, జగత్‌లు కోవిడ్ వచ్చిందని, అందుకే విచారణకు రాలేకపోతున్నామని సర్టిఫికెట్లు సమర్పించారు.
అయితే పోలీసులు వీటిని తప్పుడు సర్టిఫికెట్లుగా తేల్చారు. కోవిడ్ రాకపోయినా వచ్చినట్లు, తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించినందుకు భార్గవ్, జగత్‌తో పాటు ల్యాబ్ నిర్వాహకులపై బోయిన్‌పల్లిలో కేసు నమోదు చేశారు. దీంతో మళ్లీ భార్గవ్, జగత్ పరారీలో ఉన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇదే క్రమంలో ముందస్తు బెయిల్ కోసం భార్గవ్, జగత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బావ, బామ్మర్ది మధ్య గొడవ
రెండేళ్లుగా భూమా కుటుంబంలో జరుగుతున్న వరుస పరిణామాలకు భార్గవ్ వైఖరే కారణమని జగత్ బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి మృతి తర్వాత భూమాకు అన్నీతానై వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి కూడా ఆ కుటుంబానికి దూరమయ్యారు. అలాగే వారి సమీప బంధువు శివరామిరెడ్డి, నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ మాజీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి, అఖిల పెదనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డి దూరంగా ఉంటున్నారు. పార్టీలో మండల, గ్రామస్థాయి నేతలు చాలా వరకూ దూరమయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. ఆయన సోదరుడు మహేశ్ బీజేపీలో చేరారు. దీంతో ఆళ్లగడ్డలో భూమా కుటుంబం పూర్తిగా పట్టుకోల్పోయింది.
ఇదే క్రమంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి బలపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగత్ ఎక్కడ పొరపాటు జరుగుతోందని ఆలోచించి, దానికి భార్గవ్ కారణమని అతనితో వాదనకు దిగినట్లు తెలుస్తోంది. అఖిలతో కూడా జగత్ గట్టిగా వాదించి, ఆళ్లగడ్డ రాజకీయాలు ఇక తాను చూసుకుంటానని, భార్గవ్ జోక్యం ఇక అనవసరమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఇప్పుడు ఆళ్లగడ్డతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే వయసు రీత్యా ఎన్నికల్లో పోటీ చేసేందుకు జగత్‌కు 2024కు రెండు నెలలు వయస్సు తక్కువ వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోటీ చేయాలంటే అఖిల తప్పనిసరి కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని సంకటస్థితిలో జగత్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఎన్నికలు కాస్త అటో ఇటో జరిగితే వయస్సు సమస్య ఉండదని, ఆ పరిస్థితి వస్తే తానే పోటీ చేయాలనే యోచనలో జగత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అఖిల గురువారం కర్నూలులో విలేకరుల సమావేశం నిర్వహించి కావాలనే తమపై కుట్రపూరితంగా హైదరాబాద్ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. పోలీసులే తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి, తమపై కేసులు నమోదు చేశారని, దీనిపై మంత్రి కేటీఆర్‌తో పాటు పోలీసులను కలిసి ఆధారాలు ఇస్తామని చెప్పింది. అయితే ఈ వ్యవహారాన్ని అక్కడి పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఒకసారి ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు ఈ దఫా మరోసారి ముందస్తు బెయిల్ ఇవ్వడం కష్టమే అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో అఖిల, భార్గవ్‌ను పక్కనపెట్టి జగత్ క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment