ఇక రాజకీయ బదిలీలే
జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యేల అభీష్టం మేరకే బదిలీలు
హైదరాబాద్: అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో కౌన్సెలింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. రాజకీయ బదిలీలకు తెరతీయనుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, అధికారి పార్టీ ఎమ్మెల్యేల అభీష్టం మేరకే బదిలీలు జరగనున్నాయి. అందుకే హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేడో రేపో బదిలీలకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయనుంది.
మంత్రుల మధ్య విభేదాలతో..
ఇటీవల జరిగిన మంత్రివర్గ భేటీలో ఉద్యోగుల బదిలీలను ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బదిలీలలో కౌన్సెలింగ్ విధానం ఉండదని ఒక మంత్రి, అసలు బదిలీలే జరగబోవని మరో మంత్రి ఇటీవల ప్రకటించగా.. తాజాగా బదిలీల ప్రక్రియలో పారదర్శకతకు తిలోదకాలు ఇవ్వటం గమనార్హం. అయితే, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై ఏ ఉద్యోగిని ఎక్కడకు బదిలీ చేయాలనేది నిర్ణయించడమే నూతన విధానమని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ బదిలీలను రాజకీయంగా వ్యవస్థీకృతం చేయడమేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలో కౌన్సెలింగ్ విధానం ద్వారా బదిలీ చేసే వారు. గత ఏడాది ‘అవసరాల బదిలీ’ పేరుతో పెద్ద ఎత్తున నగదు చేతులు మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో గత ఏడాది మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే జిల్లా ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ చేపట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఇదే తొలిసారి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఆ జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏ అధికారిని, ఏ ఉద్యోగిని ఎక్కడ నుంచి ఎక్కడకు బదిలీ చేయాలో నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తారు. అంటే రాజకీయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి నచ్చిన వారిని.. కావాల్సిన చోటకు బదిలీ చేసుకుంటారు. నచ్చని వారిని మారుమూల ప్రాంతాలకు పంపిస్తారు.
బదిలీలను రాజకీయంగా వ్యవస్థీకృతం చేయడం ఇదే తొలిసారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల సమర్థతతో పని చేసే వారికి చోటు లేకుండా పోతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ పరంగా తాము ఏది చెపితే ఆ పనులు చేసే వారిని నియమించుకోవడమే తప్ప మరొకటి కాదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.