సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో భారీగా చేతులు మారిన నగదు
మెరిట్ ఊసే లేదు.. టాప్ టెన్‌లో ఉన్నా దక్కని మంచి పోస్టింగ్‌లు
డబ్బులిచ్చిన వారికి అర్హత లేకపోయినా ప్రాధాన్యతా సెంటర్లు
పటమట, మధురవాడ రేటు రూ.2 కోట్లకుపైనే
అందరి కంటే జూనియర్‌కు పటమట సబ్ రిజిస్ట్రార్ పోస్టు
25 ప్రధాన సెంటర్లలో పొలిటికల్ పోస్టింగ్‌లు
మిగిలిన వాటిని అమ్మేసుకున్న ఉన్నతాధికారుల సిండికేట్
బదిలీల గడువు ముగిసినా కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయి. నిబంధనలు, మార్గదర్శకాలు, సీనియారిటీ, మెరిట్ జాబితాలన్నింటినీ పక్కనపెట్టి నోట్లకట్టలు ముట్టజెప్పిన వారికే కోరుకున్న పోస్టింగ్‌లు కట్టబెట్టారు. పోస్టింగ్‌ల జాబితాను ముందే తయారు చేసుకుని.. కౌన్సెలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.
రాష్ట్రంలోని సుమారు 25 ప్రధాన సెంటర్లకు ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారం వారు చెప్పిన వ్యక్తులకు పోస్టింగ్‌లు ఇచ్చినట్టు సమాచారం. మిగిలిన ప్రాధాన్య పోస్టులన్నింటినీ నాలుగు జోన్లలో కొందరు ఉన్నతాధికారులే బేరం కుదుర్చుకుని అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్ల శాఖలో గుప్పుమంటోంది.
సీనియారిటీ జాబితాలో టాప్ టెన్‌లో ఉన్న వారికి సైతం కోరుకున్న ప్రదేశంలో పోస్టింగ్ దక్కలేదు. ఆదివారం కౌన్సెలింగ్ జరిగిన నాలుగు చోట్లలో విశాఖ, ఏలూరులో రెండుచోట్ల కొద్దిపాటి గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది.
ఫార్సుగా కౌన్సెలింగ్
సాధారణంగా వివిధ అంశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లకు వచ్చిన మార్కులు, మెరిట్ ప్రకారం బదిలీ జాబితా తయారు చేయాలి. దాని ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో ముందున్న వారిని పిలిచి వారికి కావాల్సిన పోస్టింగ్‌లు ఇవ్వాలి. జాబితాలో మొదట ఉన్న వ్యక్తికి అతను కోరుకున్నచోట మొదట పోస్టింగ్ ఇవ్వాలి. కానీ.. మొదటి వ్యక్తికి అడిగిన ఏ సెంటర్ ఇవ్వలేదు. ఆ సెంటర్‌కి ప్రభుత్వం వేరే వాళ్లని రికమండ్ చేసిందని, అది ఖాళీ లేదని చెప్పి ఫోకల్ పోస్టులను తప్పించేశారు.
మెరిట్‌లో మొదట ఉన్న వారికి సైతం ఉన్నతాధికారులు తమకు నచ్చిన ప్రదేశంలో పోస్టింగ్ ఇస్తామని చెప్పి అక్కడే ఖాళీ ఆప్షన్ ఫారంపై సంతకం చేయించుకున్నారు. కొందరికైతే ఇస్తామని చెప్పిన చోట కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపి అర్ధరాత్రి మరోచోటకు మార్చి ఇచ్చారు. ఆ పోస్టుకు ఎవరైనా ఎక్కువ డబ్బు ఇస్తామని ముందుకొస్తే వారికి అక్కడికక్కడే పోస్టింగ్ ఖరారు చేశారు.
ముందే ఖాళీ ఆప్షన్ ఫారం తీసుకోవడంతో అధికారులకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తున్నట్టుగా రాసుకున్నట్టు తెలిసింది. అదేమని అడిగితే నీ మీద ఏసీబీ కేసులున్నాయి, ఛార్జి మెమోలు ఉన్నాయంటూ బెదిరించారు. మరోవైపు బేరం కుదుర్చుకున్న వారిపై ఏసీబీ కేసులున్నా.. వారికి ఏ గ్రేడ్ సెంటర్లలో పోస్టింగ్‌లు కట్టబెట్టడం గమనార్హం.
గడువు ముగిసినా కౌన్సెలింగ్
నిజానికి 22వ తేదీతో బదిలీల గడువు ముగిసింది. సబ్ రిజిస్ట్రార్ల బదిలీల కౌన్సెలింగ్‌ను ఆదివారం రాత్రంతా నిర్వహించారు. సూపరింటెండ్‌ంట్‌లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్‌ను 23వ తేదీ సాయంత్రం వరకూ నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే పాత తేదీ వేసి ఈ బదిలీల ఆర్డర్లు ఇవ్వనున్నారు. దీన్నిబట్టి బదిలీలు ఎంత చక్కగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.
రూ.2 కోట్లకు పటమట.. మధురవాడ
అందరి కంటే జూనియర్, ఏసీబీ కేసున్న రేవంత్‌కి విజయవాడ పటమట సబ్ రిజి్రస్టార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. 93 మంది జాబితాలో ఆయన పేరు 50 మంది తర్వాతే. అయినా ఆయనకు రాష్ట్రంలోనే కీలకమైన పటమట పోస్టింగ్ దక్కింది. దీని విలువ రూ.2 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. చినబాబు సిఫారసుతో ఆయన ఈ హాట్ సీటును దక్కించుకున్నట్టు తెలిసింది.
విశాఖ నగరంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టును అదే రేటుకు అర్హత లేని వ్యక్తికి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. సబ్ రిజి్రస్టార్ ఆఫీసులను ఆదాయాన్ని బట్టి ఏ, బీ, సీ గ్రేడ్‌లుగా విభజిస్తారు. ఒకసారి ఏ సెంటర్‌లో చేసిన వాళ్లకి మరుసటి దఫా బదిలీల్లో ఏ గ్రేడ్ ఇవ్వకూడదు. కానీ.. ప్రస్తుత బదిలీల్లో ఈ నిబంధనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఏసీబీ కేసులున్న వారికి సైతం ముడుపులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చేశారు.
సుమారు 7 ఛార్జి మెమోలు ఉండటం వల్ల ఏ గ్రేడ్‌కి అర్హత లేని వ్యక్తికి రాజమండ్రి జాయింట్–2 సబ్ రిజి్రస్టార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. సి గ్రేడ్ సెంటర్‌లో పోస్టింగ్ ఇవ్వాల్సిన వ్యక్తికి డబ్బులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చారు. రాజమండ్రి–1 సెంటర్‌కి పోస్టింగ్ లభించిన సబ్ రిజి్రస్టార్‌కి అందరికంటే తక్కువ మార్కులు రావడంతో ఆయన పేరు జాబితాలో ఆఖరున ఉంది. గత మూడు సార్లుగా ఏ గ్రేడ్‌లో పనిచేసిన ఆయనకు మళ్లీ ఏ సెంటర్ ఇవ్వడం విశేషం.
కంకిపాడు పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లుకు ఏ గ్రేడ్ అర్హత లేకపోయినా ఇచ్చేశారు. ఇటీవల అగ్రి గోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కేసులో ఉన్న నున్న సబ్ రిజిస్ట్రార్‌ని బదిలీ చేయకపోవడాన్ని బట్టి ఈ బదిలీలు ఎంత గొప్పగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. గుణదల బదిలీ అయిన నందీశ్వరరావు అంతకుముందు ఏ గ్రేడ్ చేసినా మళ్లీ ఏ గ్రేడ్ ఇచ్చారు. గాంధీనగర్–1, 2 సబ్ రిజిస్ట్రార్లకు ఏ సెంటర్లు ఇవ్వకూడదని తెలిసినా ఇచ్చేశారు. నిబంధనలు, అర్హతలతో పనిలేకుండా సబ్ రిజి్రస్టార్ల బదిలీలు జరిగాయనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment