Sub Registrars office
-
Telangana: జీపీ లేఔట్లన్నీ నిషేధిత జాబితాలోకి..
ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో 289/పీ సర్వే నంబరులోని ఓ జీపీ లేఔట్లో శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి సమయానికి కట్నం కింద ఉపయోగపడుతుందని భావించారు. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పెట్టుకున్నారు. అల్లుడికి కానుకగా ఇద్దామనుకున్న ఓపెన్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండాపోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఆ లేఔట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడమే. దీంతో శ్రీనివాస్‌రెడ్డి లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు. నగదు అవసరమైన³్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.ఏ చట్టం ప్రకారం చేర్చారు?జీపీ లేఔట్లు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పట్టా స్థలాలను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ)లో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాలు మాత్రమే లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మరి, హుడా ఏర్పడకుముందే ఈ లేఔట్లు వెలిస్తే.. డీటీసీపీ ఏం చేస్తున్నట్టు? కొత్తగా అవి జీపీ లేఔట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు? అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను 22–ఏ జాబితా కింద చేర్చుతారు.ఇందులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఇలా ఐదు వర్గాలుగా ఉంటాయి. ఈ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆయా సర్వే నంబర్లను 22–ఏ కింద చేర్చుతారు. తాజాగా ప్రభుత్వం జీపీ లేఔట్లను సైతం 22–ఏ జాబితాలోకి చేర్చడం గమనార్హం. దీంతో లేఔట్, పట్టాదారు స్థలాలు కూడా ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తాయని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో చాలామంది భూ యజమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆయా స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుందన్నారు. అయితే ఇలా ఎంతమంది సామాన్యులు కోర్టును ఆశ్రయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో పెడితే వాటిని ఎల్ఆర్ఎస్ ఎలా చేస్తారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. -
కట్టలిచ్చినోళ్లకే కట్టబెట్టారు
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయి. నిబంధనలు, మార్గదర్శకాలు, సీనియారిటీ, మెరిట్ జాబితాలన్నింటినీ పక్కనపెట్టి నోట్లకట్టలు ముట్టజెప్పిన వారికే కోరుకున్న పోస్టింగ్‌లు కట్టబెట్టారు. పోస్టింగ్‌ల జాబితాను ముందే తయారు చేసుకుని.. కౌన్సెలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.రాష్ట్రంలోని సుమారు 25 ప్రధాన సెంటర్లకు ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారం వారు చెప్పిన వ్యక్తులకు పోస్టింగ్‌లు ఇచ్చినట్టు సమాచారం. మిగిలిన ప్రాధాన్య పోస్టులన్నింటినీ నాలుగు జోన్లలో కొందరు ఉన్నతాధికారులే బేరం కుదుర్చుకుని అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్ల శాఖలో గుప్పుమంటోంది. సీనియారిటీ జాబితాలో టాప్ టెన్‌లో ఉన్న వారికి సైతం కోరుకున్న ప్రదేశంలో పోస్టింగ్ దక్కలేదు. ఆదివారం కౌన్సెలింగ్ జరిగిన నాలుగు చోట్లలో విశాఖ, ఏలూరులో రెండుచోట్ల కొద్దిపాటి గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. ఫార్సుగా కౌన్సెలింగ్ సాధారణంగా వివిధ అంశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లకు వచ్చిన మార్కులు, మెరిట్ ప్రకారం బదిలీ జాబితా తయారు చేయాలి. దాని ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో ముందున్న వారిని పిలిచి వారికి కావాల్సిన పోస్టింగ్‌లు ఇవ్వాలి. జాబితాలో మొదట ఉన్న వ్యక్తికి అతను కోరుకున్నచోట మొదట పోస్టింగ్ ఇవ్వాలి. కానీ.. మొదటి వ్యక్తికి అడిగిన ఏ సెంటర్ ఇవ్వలేదు. ఆ సెంటర్‌కి ప్రభుత్వం వేరే వాళ్లని రికమండ్ చేసిందని, అది ఖాళీ లేదని చెప్పి ఫోకల్ పోస్టులను తప్పించేశారు. మెరిట్లో మొదట ఉన్న వారికి సైతం ఉన్నతాధికారులు తమకు నచ్చిన ప్రదేశంలో పోస్టింగ్ ఇస్తామని చెప్పి అక్కడే ఖాళీ ఆప్షన్ ఫారంపై సంతకం చేయించుకున్నారు. కొందరికైతే ఇస్తామని చెప్పిన చోట కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపి అర్ధరాత్రి మరోచోటకు మార్చి ఇచ్చారు. ఆ పోస్టుకు ఎవరైనా ఎక్కువ డబ్బు ఇస్తామని ముందుకొస్తే వారికి అక్కడికక్కడే పోస్టింగ్ ఖరారు చేశారు. ముందే ఖాళీ ఆప్షన్ ఫారం తీసుకోవడంతో అధికారులకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తున్నట్టుగా రాసుకున్నట్టు తెలిసింది. అదేమని అడిగితే నీ మీద ఏసీబీ కేసులున్నాయి, ఛార్జి మెమోలు ఉన్నాయంటూ బెదిరించారు. మరోవైపు బేరం కుదుర్చుకున్న వారిపై ఏసీబీ కేసులున్నా.. వారికి ఏ గ్రేడ్ సెంటర్లలో పోస్టింగ్‌లు కట్టబెట్టడం గమనార్హం.గడువు ముగిసినా కౌన్సెలింగ్నిజానికి 22వ తేదీతో బదిలీల గడువు ముగిసింది. సబ్ రిజిస్ట్రార్ల బదిలీల కౌన్సెలింగ్‌ను ఆదివారం రాత్రంతా నిర్వహించారు. సూపరింటెండ్ంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్‌ను 23వ తేదీ సాయంత్రం వరకూ నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే పాత తేదీ వేసి ఈ బదిలీల ఆర్డర్లు ఇవ్వనున్నారు. దీన్నిబట్టి బదిలీలు ఎంత చక్కగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.రూ.2 కోట్లకు పటమట.. మధురవాడఅందరి కంటే జూనియర్, ఏసీబీ కేసున్న రేవంత్‌కి విజయవాడ పటమట సబ్ రిజి్రస్టార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. 93 మంది జాబితాలో ఆయన పేరు 50 మంది తర్వాతే. అయినా ఆయనకు రాష్ట్రంలోనే కీలకమైన పటమట పోస్టింగ్ దక్కింది. దీని విలువ రూ.2 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. చినబాబు సిఫారసుతో ఆయన ఈ హాట్ సీటును దక్కించుకున్నట్టు తెలిసింది. విశాఖ నగరంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టును అదే రేటుకు అర్హత లేని వ్యక్తికి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. సబ్ రిజి్రస్టార్ ఆఫీసులను ఆదాయాన్ని బట్టి ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజిస్తారు. ఒకసారి ఏ సెంటర్లో చేసిన వాళ్లకి మరుసటి దఫా బదిలీల్లో ఏ గ్రేడ్ ఇవ్వకూడదు. కానీ.. ప్రస్తుత బదిలీల్లో ఈ నిబంధనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఏసీబీ కేసులున్న వారికి సైతం ముడుపులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చేశారు. సుమారు 7 ఛార్జి మెమోలు ఉండటం వల్ల ఏ గ్రేడ్‌కి అర్హత లేని వ్యక్తికి రాజమండ్రి జాయింట్–2 సబ్ రిజి్రస్టార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. సి గ్రేడ్ సెంటర్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన వ్యక్తికి డబ్బులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చారు. రాజమండ్రి–1 సెంటర్‌కి పోస్టింగ్ లభించిన సబ్ రిజి్రస్టార్కి అందరికంటే తక్కువ మార్కులు రావడంతో ఆయన పేరు జాబితాలో ఆఖరున ఉంది. గత మూడు సార్లుగా ఏ గ్రేడ్‌లో పనిచేసిన ఆయనకు మళ్లీ ఏ సెంటర్ ఇవ్వడం విశేషం. కంకిపాడు పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లుకు ఏ గ్రేడ్ అర్హత లేకపోయినా ఇచ్చేశారు. ఇటీవల అగ్రి గోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కేసులో ఉన్న నున్న సబ్ రిజిస్ట్రార్‌ని బదిలీ చేయకపోవడాన్ని బట్టి ఈ బదిలీలు ఎంత గొప్పగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. గుణదల బదిలీ అయిన నందీశ్వరరావు అంతకుముందు ఏ గ్రేడ్ చేసినా మళ్లీ ఏ గ్రేడ్ ఇచ్చారు. గాంధీనగర్–1, 2 సబ్ రిజిస్ట్రార్లకు ఏ సెంటర్లు ఇవ్వకూడదని తెలిసినా ఇచ్చేశారు. నిబంధనలు, అర్హతలతో పనిలేకుండా సబ్ రిజి్రస్టార్ల బదిలీలు జరిగాయనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా ఉన్నాయి. -
ఏపీలోని 17 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు: రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ
అమరావతి: ఏపీలోని17 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలానాల అవకతవకలు జరిగినట్లు గుర్తించామని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరిబాబు తెలిపారు.10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.5.25 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని శేషగిరిబాబు వెల్లడించారు. ఇప్పటికే రూ.కోటి రికవరీ చేశామని, అవకతవకలపై ఆరుగురు సబ్రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని అన్నారు. మిగతా సబ్రిజిస్ట్రార్లపై విచారణ జరుగుతోందన్నారు. అవకతవకలు జరిగిన చోట్ల కేసులు నమోదు చేయిస్తున్నామని ఐజీ శేషగిరిబాబు అన్నారు. 2021 ఏప్రిల్ నుంచి జులై వరకు 54 నకిలీ చలానాలు గుర్తించినట్లు తెలిపారు. నకిలీ చలానాలతో రూ.7లక్షల మేర గోల్మాల్ జరిగినట్టు నిర్ధారించారు. చలానాల గోల్‌మాల్‌లో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పొన్నూరు, భీమవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీలు చేపట్టింది. కాగా తణుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రూ.54,100 అనధికార నగదు స్వాధీనం చేసుకున్నారు. -
9 రోజులు.. రూ.383 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మూడు నెలల విరామం తర్వాత ఈనెల 21 నుంచి రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభమైన ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఖజానా కళకళలాడుతోందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 21 నుంచి 31 వరకు మొత్తం 9 పనిదినాల్లో ఏకంగా రూ.383 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ నిబంధనలో కొంత సడలింపు ఇచ్చిన రెండ్రోజుల్లోనే ఏకంగా 20 వేలకు పైగా లావాదేవీలు జరగ్గా, రూ.170 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇంత పెద్ద మొత్తంలో మార్చి నెల తర్వాత ఈ నెలలోనే రూ.400 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కరోనా దెబ్బతో పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన మూడు నెలల తర్వాత కార్యకలాపాలు ప్రారంభం కావడంతో పెండింగ్‌లో ఉన్న లావాదేవీలను పూర్తి చేసుకునేందుకు వస్తున్న ప్రజలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. అయితే, ఎల్ఆర్ఎస్ నిబంధనకు సడలింపు ఇవ్వడంతో కొత్త సంవత్సరంలోనూ రిజిస్ట్రేషన్లు భారీగానే జరుగుతాయని ఆ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం ) ఈ ఏడాది రూ.5,500 కోట్ల వరకే.. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని వార్షిక బడ్జెట్లో అంచనా వేయగా, కరోనా దెబ్బకు ఆ అంచనాలు కుదేలయ్యాయి. దీనికి తోడు మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఇప్పటివరకు ఈ ఏడాది కేవలం రూ.1,864 కోట్లు మాత్రమే సమకూరాయి. అయితే, ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో నెలకు రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, మొత్తం మీద ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5,500 కోట్ల వరకు రావచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
రిజిస్ట్రేషన్ ఉద్యోగుల ఉద్యమబాట
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. సబ్రిజిస్ట్రార్లు లేని చోట్ల తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 141 కార్యాలయాల్లోని సబ్రిజిస్ట్రార్లు శనివారం మూకుమ్మడిగా సెలవు పెట్టి హైదరాబాద్‌లోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. అఫ్జల్‌గంజ్ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి నాంపల్లి సీసీఎల్ఏ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి సీసీఎల్ఏ డైరెక్టర్, ఇన్చార్జి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ వాకాటి కరుణకు వినతిపత్రం సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ శాఖలో రెవెన్యూ సిబ్బంది ప్రమేయాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు. 12 నుంచి ప్రత్యక్షంగా.. ఇప్పటికే రెండు, మూడు సార్లు నివేదించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రత్యక్షంగా ఆందోళన చేపట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు నిర్ణయించారు. మార్చి 12 వరకు ప్రభుత్వానికి సమయమివ్వాలని భావిస్తున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల వ్యవస్థను స్తంభింపజేసేలా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
పుల్లంపేట (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పుల్లంపేట మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే ఈ సందర్భంగా అధికారులు రూ.1,90,250లకు ఏసీబీ అధికారులకు సరైన ఆధారాలు చూపలేకపోయారు. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత చెన్నూర్, న్యూస్‌లైన్ : చెన్నూర్ వీఆర్వో జామీర్ అలీ రూ. 6వేలు లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. తహశీల్దార్ కార్యాలయంలో మంచిర్యాల పట్టణానికి చెందిన షాహీర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. మంధిని గ్రామానికి చెందిన చౌకత్ అలీకి చెందిన సర్వే నంబర్ 991లో 247, 242 గజాల చొప్పున రెండు ప్లాట్లను మంచిర్యాల పట్టణానికి చెందిన షాహీర్ 2012లో కొనుగోలు చేశాడు. ఆ ప్లాట్లను షాహీర్ మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిష్టర్ చేయించుకున్నాడు. నెల రోజుల క్రితం ప్లాట్లకు రెవెన్యూ ప్రొసీడింగ్ కావాలని తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. చెన్నూర్ వీఆర్వో జామీర్అలీ ప్రొసీడింగ్ కావాలంటే రూ.10 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. పది రోజుల క్రితం రూ.4 వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. మరో రూ.6 వేలు ఇస్తేనే ప్రొసీడింగ్ ఇస్తానని వీఆర్వో జామీర్ అలీ వేధించగా ఈ నెల 15న బాధితుడు షాహీర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం స్థానిక తహ శీల్దార్ కార్యాలయంలో రూ.6 వేలు లంచం తీసుకుంటుండుగా పట్టుకున్నామని చెప్పారు. అతని వద్ద నుంచి రూ.6 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీఆర్వో జామీర్అలీ ఆస్తుల పై విచారణ చేస్తామని చెప్పారు. ప్రజల్లో చైతన్యం రావాలి : లంచాలు అడిగితే ఏసీబీని ఆశ్రయించాలనే చైతన్యం ప్రజల్లో రావాలని కరీంగనర్ ఏసీబీ డీఏస్పీ సుదర్శన్‌గౌడ్ అన్నారు. లంచాలు ఇవ్వాలని అధికారులు వేధింపులకు గురి చేస్తే నిర్భయంగా ఏసీబీని ఆశ్రయించాలన్నారు. లంచం అడిగితే ఫోన్ 9440446150 చేయాలని సూచించారు. వేధింపులు భరించలేక... ప్రొసీడింగ్ కోసం వీఆర్వో జామీర్ అలీ నెల రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తున్నడు. మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు తిరిగి తిరిగి చాల బాధపడ్డాను. ఆయన వేధింపులు భరించలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. నా మాదిరిగా వేధింపులు వేరే వాళ్లకు ఉండ కూడదనే ఉద్దేశంతో లంచ ం అడిగిన వీఆర్వోను పట్టించానని బాధితుడు షాహీర్ తెలిపారు.