పేలుతున్న మామూళ్ల మతాబు!
– వాణిజ్య పన్నుల శాఖ అధికారుల 'దీపావళి' దందా
– పండుగ మామూళ్లు ఇవ్వాలని వసూళ్లు.. షాపును బట్టి రేట్లు
– ప్రశ్నిస్తే తనిఖీల పేరుతో బెదిరింపులు
కర్నూలు(రాజ్‌విహార్): దీపావళి పండగకు మామూళ్ల మతాబులు పేలుతున్నాయి. పండగ సందర్భంగా బాణా సంచా సామగ్రి అమ్మే దుకాణాల నుంచి కొందరు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల మామూళ్లు వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వ్యాపారులను.. తనిఖీల పేరుతో బెదిరిస్తున్నారు.
ఆర్డీఓ లైసెన్స్‌లు ఇచ్చినా..
సాధారణంగా ప్రతి ఏటా జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు నిర్ణయించిన స్థలంలో అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టి షాపులు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తారు. ఇందుకు సంబంధిన రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్‌డీఓ) అనుమతులు ఇస్తారు. వీటితోపాటు అగ్నిమాపక శాఖ, పోలీసుల, అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల ఆవరణంలో బాణాసంచా అంగళ్లు పెట్టుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే వ్యాపార లావాదేవీలను బట్టి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పన్నుల రూపంలో వసూలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు అధికారులు సందట్లో సడేమియాలా మామూళ్ల దందాకు తెరలేపారు. దీపావళి టపాసులు అమ్మే వ్యాపారుల నుంచి రూ.2వేల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారు. సామూహికంగా ఏర్పాటు చేసే షాపులతోపాటు చిన్నాచితకా కిరాణం షాపుల వద్ద బాణాసంచా సామాగ్రి తెచ్చుకునే వారి నుంచి కూడా వసూళ్లు మొదలు పెట్టారు.
రూ.7.50లక్షల వరకు మినహాయింపు ఉన్నా..
చిరు వ్యాపారులు.. వాణిజ పన్నుల శాఖ లైసెన్స్‌లు కలిగి ఉండరు. వీరికి పన్నుల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. రూ.7.50లక్షలకు పైబడి లావాదేవీలకు ఉన్న అంగళ్ల నుంచి 14.5శాతం పన్నులు వసూలు చేస్తారు. కాని ఆ కింది స్థాయి అధికారులు ఈ నిబంధన పక్కన పెట్టి ఒక అడుగు ముందుకేశారు. కొందరు ఏసీటీఓలకు తోడు ఉద్యోగులు జతకట్టి బాణసంచా దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. కింది నుంచి పైవరకు ఇవ్వాలని రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ఒక్కోక్క దుకాణం నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాదూకూడదంటే దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కర్నూలులోని పాతబస్టాండ్, నెహ్రూ రోడ్డులోని పలు ప్రాంతాల్లో మామూళ్లు ఇవ్వనందుకు తనిఖీలు చేసినట్లు సమాచారం. ఈ దందా లక్షల రూపాయాలకు చేరినట్లు తెలుస్తోంది. అధికారులు, వ్యాపారులకు మధ్య కొందరు అకౌంటెంట్లు, ఆడిటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
మామూళ్లు అడిగితే ఫిర్యాదు చేయండి : పి. నాగేంద్ర ప్రసాద్, సీటీఓ, కర్నూలు–1సర్కిల్.
పెద్ద వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్‌లు కలిగి ఉండాలి. రూ.7.50లక్షల లోపు వ్యాపారం ఉంటే ట్యాక్స్ పరిధిలోకి రారు. మామూళ్లు అడుగుతున్నట్లు నా దృష్టికి రాలేదు. ఎవరైనా అడిగితే ఫిర్యాదు చేయండి. వాటిపై విచారించి చర్యలు తీసుకుంటాం.