100 మంది ఆస్పత్రిపాలు కొంపముంచిన
కాల్షియం కార్బైడ్ తుపాకీలు
బాధితుల్లో ఎక్కువ మంది బాలలే..
భోపాల్: దీపావళి పండగ నాడు మధ్యప్రదేశ్‌లో కాల్షియం కార్బైడ్ తుపాకీలతో వందమందికి పైగా గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. క్షతగాత్రుల్లో అత్యధికులు 8–14 ఏళ్ల బాలలే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌తోపాటు పొరుగునే ఉన్న విదిశ జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సుమారు 60 మంది భోపాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, కళ్లకు గాయాలైన ఐదుగురు సహా మిగతా బాధితులు విదిశలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు తెలిపారు.
గ్యాస్ లైటర్, ప్లాస్టిక్ పైపు, కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగించి తయారు చేసిన మొరటు తుపాకులను దీపావళి సందర్భంగా జనం విచ్చలవిడిగా కొనుగోలు చేశారు. ‘తుపాకీలోని కాల్షియం కార్బైడ్ నీటితో కలిసినప్పుడు ఎసిటలీన్ గ్యాస్ తయారవుతుంది. దానికి నిప్పురవ్వ తగలగానే పేలిపోయేలా రూపొందించారు. ఈ పేలుడుతో ప్లాస్టిక్ పైపు నుంచి చిన్నచిన్న ముక్కలు వెలువడతాయి. ముఖం, కళ్లు సహా ఇవి తగిలిన ప్రతిచోటా గాయాలయ్యాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి’అని భోపాల్ చీఫ్ మెడికల్ హెల్త్ అధికారి మనీశ్ శర్మ చెప్పారు. అయితే, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు.
దీపావళి నాడు ఒక్క భోపాల్ నగరంలోనే ఇటువంటి 150 కేసులు తమ దృష్టికి వచ్చాయన్నారు. భోపాల్ ఎయిమ్స్‌లో ఈ తుపాకీ కారణంగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న 12 ఏళ్ల బాలుడికి చూపును పునరుద్ధరించేందుకు వైద్యులు ప్రయతి్నస్తున్నారని ఆయన వెల్లడించారు. హమీదియా ఆస్పత్రిలో మరో ఇద్దరు చిన్నారులకు ఇదే రకమైన చికిత్స జరుగుతోందన్నారు. కళ్లకు గాయాలతో ఈ ఆస్పత్రిలో పది మంది చిన్నారులు చేరారన్నారు. విదిశ జిల్లా ఆస్పత్రిలో చూపు తీవ్రంగా దెబ్బతిన్న ఐదుగురు చిన్నారులకు సైతం చూపును తిరిగి తెచ్చేందుకు చికిత్స చేస్తున్నామని కంటి వైద్య విభాగం అధిపతి ఆర్‌కే సాహు చెప్పారు. కాగా, ప్రమాదకరమైన కార్బైడ్ పైప్ గన్‌లను విక్రయించకుండా చూడాలంటూ ఈ నెల 18వ తేదీన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అధికారుల సమావేశంలో కోరారు. అయినప్పటికీ వీటి విక్రయం, వాడకం యథావిధిగా జరిగిపోయిందని బాధితుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.


