వెంటనే స్పందించిన మధ్యప్రదేశ్ పోలీసులు
నిందితుడు అకీల్ ఖాన్ అరెస్ట్
ఇండోర్ సిటీలో ఘటన
ఇండోర్: అంతర్జాతీయ మహిళా ప్రపంచకప్‌లో భాగంగా మ్యాచ్ ఆడేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చేరుకున్న ఆ్రస్టేలియా మహిళా జట్టులోని ఇద్దరు సభ్యులతో ఓ దుండగుడు అసభ్యంగా ప్రవర్తించారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనుచితంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు వెంటనే అరెస్ట్‌చేశారు. తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నందుకు పోలీసులకు బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది.
అసలేం జరిగింది?
మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఇండోర్ సిటీకి చేరుకుని అక్కడి ర్యాడిసన్ బ్లూ హోటల్‌లో బసచేస్తోంది. గురువారం ఉదయం అక్కడి ఖజ్‌రానా రోడ్‌లోని ఒక కెఫెకు వెళ్లేందుకు ఇద్దరు ఆ్రస్టేలియా క్రీడాకారిణులు నడుచుకుంటూ వెళ్తుండగా అటుగా వచి్చన అకీల్ ఖాన్ వీరిద్దరినీ తన బైక్ మీద అనుసరించాడు. తర్వాత హఠాత్తుగా దగ్గరకు వచ్చి ఒక క్రీడాకారిణితో అసభ్యంగా ప్రవర్తించి బైక్ మీద పారిపోయాడు.
వెంటనే ఈ ఘటనను క్రీడాకారులు తమ టీమ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన డ్యానీ సిమన్స్‌కు ఫిర్యాదుచేశారు. ఘటన జరిగిన చోటు లైవ్ లొకేషన్‌ను షేర్‌చేశారు. ఈ ఘటనను స్థానిక సెక్యూరిటీ అధికారికి సైతం చెప్పారు. అతిథి దేవోభవ అని నినదించే భారత్‌లో అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన అవమానం విషయం తెల్సి పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ హిమీనా మిశ్రా వెంటనే రంగంలోకి దిగారు.
ఆ ఇద్దరు క్రీడాకారిణులతో స్వయంగా మాట్లాడి ఘటన జరిగిన తీరును అడిగి తెల్సుకున్నారు. వారి వాంగ్మూలాలను నమోదుచేశారు. భారత న్యాయసంహితలోని సెక్షన్ 74(మహిళ గౌరవాన్ని భంగపరచడం), 78( వెంటబడి వేధించడం) సెక్షన్లకింద ఎంఐజీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేశారు. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు
సబ్–ఇన్‌స్పెక్టర్ నిధి రఘువంశీ కేసు దర్యాప్తు మొదలెట్టారు.
ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక వ్యక్తి ఆ నిందితుడి బైక్ నంబర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ వివరాలతో నిందితుడు అకీల్ ఖాన్‌ను గుర్తించి అరెస్ట్‌చేశారు. ఖాన్‌కు గతంలోనూ నేరచరిత్ర ఉందని దర్యాప్తులో తేలింది. ఘటనపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) సైతం తీవ్ర విచారం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ క్రీడాకారులకు జరిగిన అవమానం పట్ల క్షమాపణలు తెలిపారు.
ఇకపై క్రీడాకారులకు బయటివైపు తగు రక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎంపీసీఏ హామీ ఇచి్చంది. ఘటనను క్రికెట్ ఆ్రస్టేలియా సంఘం సైతం ధ్రువీకరించింది. ఘటనపై బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి కైలాశ్ విజయ్‌వర్గీయ స్పందించారు. ‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. ఇలాంటి అంశాల్లో కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది దేశ పరువు, ప్రతిష్ట, ఆతిథ్యాలకు సంబంధించిన విషయం’’అని ఆయన అన్నారు. ఘటనకు ముందు రోజు ఇదే ఆస్ట్రేలియా టీమ్ ఇంగ్లండ్ జట్టుతో తలపడటం తెల్సిందే.


