
జిల్లా కలెక్టర్‌కే రూ. 100 లంచం!
ఏలూరు: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’లో ఓ వ్యక్తి తన ఫిర్యాదుతో పాటు కలెక్టర్ కె.భాస్కర్‌కు రూ.100 లంచం ఇవ్వబోయిన ఘటన చిన్నపాటి కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం జల్లికొమ్మర గ్రామానికి చెందిన అడ్డగర్ల సత్యనారాయణ జల్లికొమ్మర విశాల సహకార పరపతి సంఘంలో సభ్యునిగా ఉన్నాడు.
అయితే సహకార సంఘంలో అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చాడు. ఈ అవకతవకలపై ఫిర్యాదుతో పాటు 100 రూపాయలు అందించడాన్ని కలెక్టర్ గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నించడంతో సమస్యలు పరిష్కారం కావాలంటే ఫిర్యాదుతో పాటుగా ఎంతో కొంత లంచం ఇవ్వాలని ఒక వ్యక్తి చెప్పాడని సత్యనారాయణ తెలిపాడు.
దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. ఫిర్యాదుదారునిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. స్థానిక మూడో పట్టణ పోలీసులు అడ్డగర్ల సత్యనారాయణను అరెస్ట్ చేశారు.