West godavari district collector
-
పౌరుషంగా పనిచేస్తే తిట్టనుగా..
ఏలూరు : జిల్లాలో ఏ అధికారిని, ఉద్యోగిని కానీ తాను ఎటువంటి మాటలు అననని, కష్టపడి పనిచేసే వారిని ఎంతో ప్రోత్సహిస్తానని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కానీ కొంతమంది విధి నిర్వహణలో పనులు చేయకుండా బయట మీటింగ్‌లు పెట్టి కలెక్టర్ తిడుతున్నాడంటూ ఎందుకు పౌరుషం చూపిస్తున్నారని భాస్కర్ ప్రశ్నించారు. నిజంగా పౌరుషంగా పనిచేస్తే తానెందుకు తిడతానని ప్రశ్నించారు. జిల్లాలో నిర్దేశించిన పనిని నిర్ణీత కాలవ్యవధిలో పనిచేయించేందుకు తాను సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నానని, అయితే పనులు చేయకుండా నెలల తరబడి జాప్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోనని చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆదర్శ గ్రామాల్లో అభివృద్ధి పనుల అమలు తీరుపై శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ సమీక్షించారు. ఆదర్శ గ్రామం అంటే ప్రభుత్వమే అన్నీ చేస్తుందనే ఆలోచన నుంచి ప్రజలు బయటకురావాలని, ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో ఎస్.షాన్మోహన్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు ప్రజా సమస్యల పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్టుగా అబద్దాలు చెప్పి తప్పుదోవ పట్టించిన దేవరపల్లి ఈవోపీఆర్డీ శ్రీనివాసరావును రాతపూర్వకంగా సంజాయిషీ కోరాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌ను ఆదేశించారు. మీ కోసం కార్యక్రమంలో దేవరపల్లి మండలానికి చెందిన శెట్టి కమల తమ గ్రామంలో చెరువులో లే అవుట్ చేస్తూ దారి మార్గం మూసేశారని చేసిన ఫిర్యాదుపై ఏం చేశారని కలెక్టర్ ప్రశ్నించగా సమస్య పరిష్కారమైదని ఈవోపీఆర్డీ ఇ.శ్రీనివాసరావు చెప్పడంపై కలెక్టర్ స్పందించారు. వెంటనే కమలతో ఫోన్లో మాట్లాడగా ఈ విషయంపై ఎవరూ రాలేదని సమస్య పరిష్కారం కాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చిన ఈవోపీఆర్డీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఆక్రమణల్ని తొలగించండి
ఏలూరు : జిల్లాలో పంటబోదెలు, డ్రెయిన్ల ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా తొలగించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం మీ కోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంటబోదెలు, డ్రెయిన్లు ఆక్రమణలకు గురి అవుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. పంట బోదెలను ఆక్రమించుకుని నీటిపారుదలకు ఆటంకం కలిగించడం వల్ల వచ్చే వర్షాల వల్ల పంటలు మునిగిపోయి నష్టపోయే ప్రమాదముందన్నారు. డ్రెయిన్లను ఆక్రమించుకోవడం వల్ల మురుగునీరు రోడ్లపై చేరుకుని ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతుందన్నారు. పంట బోదెలు, డ్రెయిన్లు ఆక్రమణలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎప్పటికప్పుడు తొల గించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన కాంకడ్రు రామకృష్ణ తమ గ్రామంలోని పొలాల నుంచి వర్షపునీరు వెళ్లే దారిని గౌరీపట్నంకు చెందిన రైతు పటార్ జబ్బర్ బాషా మూసివేయడం వల్ల పొలాలు మునిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. ఆకివీడు మండలం తరటాన గ్రామానికి చెందిన మల్లారెడ్డి వంశీ భాస్కర్, గ్రామ ప్రజలు తాగునీటి కోసం మంచినీటి చెరువుపై ఆధారపడుతున్నామని, అయితే చెరువుకు ఇరువైపులా రొయ్యల చెరువుల కారణంగా నీరు కలుషితమవుతోందని, రోగాల బారిన పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురంకు చెందిన కొల్లంశెట్టి కృష్ణ, యు.తరుణ్, కె.సూర్యకుమారి తదితరులు గ్రామంలో జనావాసాల మధ్య తోళ్ల పరిశ్రమ నిర్వహించడం వల్ల భరించరాని దుర్గంధంతో ఇబ్బందులు పడడమే కాకుండా అనారోగ్య పాలవుతున్నామని చెప్పారు. మరికొంత మంది తమ సమస్యలను వివరించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, ట్రైనీ కలెక్టర్ ఎంఎ కిషోర్ పాల్గొన్నారు. పోస్ట్ కార్డుల ద్వారా సమాచారం పంపండి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన సమస్యలను పరిష్కరించిన తర్వాత 15 రోజుల్లోగా పోస్టుకార్డు ద్వారా ప్రజలకు సమాచారాన్ని విధిగా అందించాలని కలెక్టర్ భాస్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో మాట్లాడారు. లక్ష్యాన్ని సాధించకుంటే ఎలా? జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల్లో కూలీలకు డెల్టా మండలాల్లో 2 వేల రోజుల పనిదినాలు, అప్ల్యాండ్ మండలాల్లో 5 వేల రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఎంపీడీవోలకు ఇచ్చిన లక్ష్యాన్ని సాధించకపోవడంపై కలెక్టర్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పథకాలపై ఆయన సమీక్షించారు. అంగన్వాడీ సిబ్బందికీ బయోమెట్రిక్ హాజరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. జిల్లాలోని మహిళా శిశు,సంక్షేమశాఖ (ఐసీడీఎస్) పథకాల అమలుపై ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది సమీపంలోని పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి హాజరు వేయాలన్నారు. -
దేశ సరిహద్దుల్లో గెలిచా.. సొంతూరులో ఓడిపోయా
ఏలూరు : దేశ సరిహద్దుల్లో విదేశీయులపై యుద్ధం చేసి గెలిచా.. కానీ సొంతూరులో మాత్రం ఓడిపోయానంటున్నారు ఈ మాజీ సైనికుడు సత్తిబులి వెంకటరెడ్డి. సైనికుడిగా 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్నానని, 40 ఏళ్ల క్రితం మిలటరీలో రిటైర్ అయిన తర్వాత తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల వద్ద ప్రభుత్వం ఇచ్చిన 4 ఎకరాలను సాగు చేసుకుంటూ అక్కడే ఇల్లు కట్టుకుని జీవిస్తున్నానని చెప్పారు. ఇటీవల జాతీయ విద్యాసంస్థ-నిట్ కట్టడుతున్నారనే పేరుతో తనకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్ధాక్షిణ్యంగా భూమిని లాక్కుని, ఇల్లు కూల్చివేశారని, ఉండటానికి నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేక్కడి న్యాయమంటూ మంత్రి వద్ద, అధికారుల వద్ద మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ కలెక్టర్ భాస్కర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. -
కేసీఆర్ ప్రకటనపై స్పందించిన ఏపీ కలెక్టర్
ఏలూరు: తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఏ ఒక్క గ్రామం కూడా తిరిగి ఆ రాష్ట్రంలోకి వెళ్లే పరిస్థితి లేదని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన నాలుగైదు గ్రామాలను వెనక్కి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ ప్రకటన విలీన గ్రామాల్లో కలకలం రేపింది. కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాల్లో ఈ విషయంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ విషయాన్ని సాక్షి విలేకరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లగా... ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. 'కేసీఆర్ ఏ సందర్భంలో ఏయే గ్రామాల గురించి ప్రకటన చేశారో మాకు తెలియదు. పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన గ్రామాలు మాత్రం తిరిగి వెళ్లే ప్రసక్తి లేదు' అని తేల్చి చెప్పారు. వాస్తవానికి గ్రామాల విలీనం చేయాలంటే కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో చర్చ పెట్టాలని, ఆ మేరకు తొలుత జిల్లా నుంచి ప్రతిపాదనలు వెళ్లాలని కలెక్టర్ వివరించారు. ఇప్పటివరకు తాము అలాంటి ప్రతిపాదనలపై ఆలోచన చేయలేదని అన్నారు. ఇంకా తెలంగాణలోని బూర్గంపహాడ్ మండలం నుంచి మరో నాలుగు గ్రామాలు మన జిల్లాకే రావాల్సి ఉందని... ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. -
జిల్లా కలెక్టర్‌కే రూ. 100 లంచం!
ఏలూరు: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’లో ఓ వ్యక్తి తన ఫిర్యాదుతో పాటు కలెక్టర్ కె.భాస్కర్‌కు రూ.100 లంచం ఇవ్వబోయిన ఘటన చిన్నపాటి కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం జల్లికొమ్మర గ్రామానికి చెందిన అడ్డగర్ల సత్యనారాయణ జల్లికొమ్మర విశాల సహకార పరపతి సంఘంలో సభ్యునిగా ఉన్నాడు. అయితే సహకార సంఘంలో అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చాడు. ఈ అవకతవకలపై ఫిర్యాదుతో పాటు 100 రూపాయలు అందించడాన్ని కలెక్టర్ గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నించడంతో సమస్యలు పరిష్కారం కావాలంటే ఫిర్యాదుతో పాటుగా ఎంతో కొంత లంచం ఇవ్వాలని ఒక వ్యక్తి చెప్పాడని సత్యనారాయణ తెలిపాడు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. ఫిర్యాదుదారునిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. స్థానిక మూడో పట్టణ పోలీసులు అడ్డగర్ల సత్యనారాయణను అరెస్ట్ చేశారు. -
'ఉద్యోగులను వేధించలేదు'
ప.గో: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, జేసీ బాబురావు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులను వేధించారన్న అంశంపై కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఆదివారం 'సాక్షి' తో మాట్లాడిన ఆయన ఉద్యోగులను వేధించలేదని తెలిపారు. గత కొంతకాలంగా అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ప్రజలు మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు అందాలంటే పని చేసే నివాసం ఉండాలని తెలిపారు. ఏ రోజూ అర్ధరాత్రి వరకూ సమావేశాలు నిర్వహించలేదన్నారు. తాము నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఆఫీస్ సమయవ దాటి ఒక్కగంట పని చేసేది లేదని.. లక్ష్యాలు కూడా ఏమీ విధించకూడదని ఆయన పేర్కొన్నారు. పనిచేసే చోట నివాసం ఉండలేమంటే అభివృద్ధి ముందుకు సాగదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఒక గంట ఉద్యోగు సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించామని కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచిన్న కారణలతో కలెక్టర్ షోకాజ్ నోటీసులిస్తూ ఉద్యోగలపై కక్షసాధిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడిన సంగతి తెలిసిందే. -
'దున్నపోతులు, పందులంటూ తిడతారా?'
-
'దున్నపోతులు, పందులంటూ తిడతారా?'
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, జేసీ బాబురావు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచిన్న కారణలకే షోకాజ్ నోటీసులిస్తూ ఉద్యోగలపై కక్షసాధిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులను దున్నపోతులు, పందులంటూ తిడతారా అని ప్రశ్నించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే వారికీ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదని తెలిపారు. మీరుండే బంగ్లాలు అత్తవారిచ్చిన ఆస్తులు కాదు... ప్రభుత్వ ఆస్తులు అన్న విషయం గుర్తుంచుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టర్, జేసీలకు సూచించారు. ఉద్యోగులను వేధిస్తే సహించం... కలెక్టర్ భాస్కర్, బాబురావులను వెంటనే బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సంబంధాలు నెరపడంలో ఆ ఇద్దరు ఉన్నతాధికారులు విఫలమయ్యారని... ఈ నేపథ్యంలో ప్రాధాన్యత లేని పోస్టులకు వారిని బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. త్వరలో సీఎం చంద్రబాబును కలసి కలెక్టర్, జేసీ వైఖరిని వివరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.