ఆక్రమణల్ని తొలగించండి
ఏలూరు : జిల్లాలో పంటబోదెలు, డ్రెయిన్ల ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా తొలగించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం మీ కోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంటబోదెలు, డ్రెయిన్లు ఆక్రమణలకు గురి అవుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.
పంట బోదెలను ఆక్రమించుకుని నీటిపారుదలకు ఆటంకం కలిగించడం వల్ల వచ్చే వర్షాల వల్ల పంటలు మునిగిపోయి నష్టపోయే ప్రమాదముందన్నారు. డ్రెయిన్లను ఆక్రమించుకోవడం వల్ల మురుగునీరు రోడ్లపై చేరుకుని ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతుందన్నారు. పంట బోదెలు, డ్రెయిన్లు ఆక్రమణలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎప్పటికప్పుడు తొల గించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు.
దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన కాంకడ్రు రామకృష్ణ తమ గ్రామంలోని పొలాల నుంచి వర్షపునీరు వెళ్లే దారిని గౌరీపట్నంకు చెందిన రైతు పటార్ జబ్బర్ బాషా మూసివేయడం వల్ల పొలాలు మునిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు.
ఆకివీడు మండలం తరటాన గ్రామానికి చెందిన మల్లారెడ్డి వంశీ భాస్కర్, గ్రామ ప్రజలు తాగునీటి కోసం మంచినీటి చెరువుపై ఆధారపడుతున్నామని, అయితే చెరువుకు ఇరువైపులా రొయ్యల చెరువుల కారణంగా నీరు కలుషితమవుతోందని, రోగాల బారిన పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
కొయ్యలగూడెం మండలం కన్నాపురంకు చెందిన కొల్లంశెట్టి కృష్ణ, యు.తరుణ్, కె.సూర్యకుమారి తదితరులు గ్రామంలో జనావాసాల మధ్య తోళ్ల పరిశ్రమ నిర్వహించడం వల్ల భరించరాని దుర్గంధంతో ఇబ్బందులు పడడమే కాకుండా అనారోగ్య పాలవుతున్నామని చెప్పారు. మరికొంత మంది తమ సమస్యలను వివరించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.జేసీ పి.కోటేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, ట్రైనీ కలెక్టర్ ఎంఎ కిషోర్ పాల్గొన్నారు.
పోస్ట్ కార్డుల ద్వారా సమాచారం పంపండి
జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన సమస్యలను పరిష్కరించిన తర్వాత 15 రోజుల్లోగా పోస్టుకార్డు ద్వారా ప్రజలకు సమాచారాన్ని విధిగా అందించాలని కలెక్టర్ భాస్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో మాట్లాడారు.
లక్ష్యాన్ని సాధించకుంటే ఎలా?
జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల్లో కూలీలకు డెల్టా మండలాల్లో 2 వేల రోజుల పనిదినాలు, అప్‌ల్యాండ్ మండలాల్లో 5 వేల రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఎంపీడీవోలకు ఇచ్చిన లక్ష్యాన్ని సాధించకపోవడంపై కలెక్టర్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పథకాలపై ఆయన సమీక్షించారు.
అంగన్‌వాడీ సిబ్బందికీ బయోమెట్రిక్ హాజరు
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. జిల్లాలోని మహిళా శిశు,సంక్షేమశాఖ (ఐసీడీఎస్) పథకాల అమలుపై ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది సమీపంలోని పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి హాజరు వేయాలన్నారు.