కేసీఆర్ ప్రకటనపై స్పందించిన ఏపీ కలెక్టర్
ఏలూరు: తెలంగాణ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఏ ఒక్క గ్రామం కూడా తిరిగి ఆ రాష్ట్రంలోకి వెళ్లే పరిస్థితి లేదని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కలిసిన నాలుగైదు గ్రామాలను వెనక్కి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ ప్రకటన విలీన గ్రామాల్లో కలకలం రేపింది.
కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాల్లో ఈ విషయంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ విషయాన్ని సాక్షి విలేకరి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లగా... ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. 'కేసీఆర్ ఏ సందర్భంలో ఏయే గ్రామాల గురించి ప్రకటన చేశారో మాకు తెలియదు. పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన గ్రామాలు మాత్రం తిరిగి వెళ్లే ప్రసక్తి లేదు' అని తేల్చి చెప్పారు.
వాస్తవానికి గ్రామాల విలీనం చేయాలంటే కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో చర్చ పెట్టాలని, ఆ మేరకు తొలుత జిల్లా నుంచి ప్రతిపాదనలు వెళ్లాలని కలెక్టర్ వివరించారు. ఇప్పటివరకు తాము అలాంటి ప్రతిపాదనలపై ఆలోచన చేయలేదని అన్నారు. ఇంకా తెలంగాణలోని బూర్గంపహాడ్ మండలం నుంచి మరో నాలుగు గ్రామాలు మన జిల్లాకే రావాల్సి ఉందని... ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.