పింఛన్ కోసం.. లంచం ఇవ్వొద్దు
సిద్దిపేట జోన్: పేదలు కడుపు నిండా తినేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ల మంజూరులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. వివిధ కారణాల వల్ల తొలి జాబితాలో పేర్లు రాని 531 మంది లబ్ధిదారులకు బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పింఛన్ ఇచ్చేందుకు ఎవరు లంచం అడిగినా వెంటనే తనకు ఫోన్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అర్హుల జాబితాలో అనర్హులు ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలతో పాటు పింఛన్ డబ్బులను రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. ఆహార భద్రత జాబితాలో పేరు లేని అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జనవరిలో మూడు కొత్త పథకాలు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా ఆహార భద్రత కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ, మధ్యాహ్న భోజనం పథకం, వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన సోనామసూరి బియ్యం సరఫరా, గర్భిణులకు ప్రతిరోజూ గుడ్డుతోపాటు పౌష్టికాహారం అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న రమణాచారి పని తీరును మెచ్చుకున్నారు. రాజనర్సు పాల్గొన్నారు.
నంగునూరులో పాసు పుస్తకాల పంపిణీ...
సిద్దిపేట నియోజకవర్గంలో రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. నంగునూరుంలో బుధవారం 576 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
చదువుల ఖిల్లాగా.. గజ్వేల్
గజ్వేల్: వచ్చే విద్యా సంవత్సరంలోపు గజ్వేల్‌లో పీజీ, మరో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు బుధవారం ప్రకటించారు. దీనికోసం త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తీసుకుంటామని వెల్లడించారు. గజ్వేల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.కోటితో నిర్మించనున్న అదనపు తరగతి గదుల పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం దేశంలోనే రోల్ మోడల్‌గా అవతరించనుందని చెప్పారు. డీగ్రీ కళాశాల విద్యార్థుల కోరిక మేరకు ఆడిటోరియం, రీడింగ్ రూమ్స్ నిర్మాణానికి మరో రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కళాశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీతో పాటు కొత్త కోర్సులను ప్రవేశ పెడతామన్నారు. ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
కార్పొరేట్ స్థాయి వైద్యం...
గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలోని హైరిస్క్ ప్రెగ్నెన్సీ మానిట రింగ్ సెంటర్‌లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించనున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. హైరిస్క్ కేంద్రం తో పాటు ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆస్పత్రికి ఆర్థోపెడిక్ వైద్యున్ని నియమించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీణాకుమారికి సూచించారు.
ఆస్పత్రిలోని చిన్నచిన్న పనులకోసం రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జననీ ఎక్స్‌ప్రెస్ పథకంలో భాగంగా తల్లీబిడ్డలను తీసుకెళ్లే వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్‌పర్సన్ అరుణ, ఎంపీపీ చిన్నమల్లయ్య, జెడ్పీటీసీ జేజాల వెంకటేశ్‌గౌడ్, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి , డాక్టర్ వి.యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.