
ఏసీబీకి చిక్కిన అవినీతి ‘చేప’
నిజామాబాద్ క్రైం: సబ్సిడీ చెక్కు ఇచ్చేందుకు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఫిషరీస్ అధికారి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. బోధన్ మండలం సంగెం గ్రామానికి చెందిన గంగాధర్ చేపల వ్యాపారి. చేపలు రవాణా చేసేందుకు వాహనం అవసరం కావడంతో, జిల్లా కేంద్రంలోని ఫిషరీస్ కార్యాలయంలో సబ్సిడీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనకు 75 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల రుణం మంజూరైంది. అయితే, సబ్సిడీ చెక్కు వాహన షోరూంకు పంపిస్తే, వాహనాన్ని అందజేస్తారు. చెక్కును పంపించాలని గంగాధర్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అధికారి రూపేందర్‌సింగ్‌ను కలిశాడు. అయితే, రూ.7 వేల ఇస్తే చెక్కును పంపిస్తానని ఆయన స్పష్టం చేశాడు.
చివరకు రూ.5 వేలకు బేరం కుదిరింది. లంచం ఇచ్చేందుకు మనస్సు ఒప్పుకోకపోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు రసాయనాలు పూసిన రూ.5 వేల నోట్లను గంగాధర్‌కు అందజేసి, కార్యాలయం వద్ద మాటు వేశారు. బుధవారం సాయంత్రం రూపేందర్‌సింగ్‌కు డబ్బు ఇస్తుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని, చర్లపల్లి జైలుకు పంపించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు, అదే సమయంలో సబ్సిడీ చెక్కు కోసం మరో లబ్ధిదారుడు బోధన్‌కు చెందిన శ్రావణ్ కూడా లంచం ఇచ్చేందుకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే రూపేందర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనను కూడా డబ్బు అడిగాడని శ్రావణ్ తెలిపాడు.