
లంచం తీసుకుంటూ ఇద్దరు అరెస్టు
విశాఖపట్నం సిటీ: జీవీఎంసీలోని ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 8 వేలు డిమాండ్ చేసిన ఇద్దరు ఐటీ విభాగ ఉద్యోగులను ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ. 8 వేలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన విశేషాలను ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు వెల్లడించారు. 66వ వార్డు పద్మనాభనగర్‌లో ఎస్సీ, బీసీ కాలనీలో ఇంజనీరింగ్ అధికారులు గత ఏడాది ఓ కల్వర్టు నిర్మాణ బాధ్యతను గల్లా శ్రీనివాస్ అనే కాంట్రాక్టరుకు అప్పగించారు. ఆయన కల్వర్టు పనులన్నీ పూర్తి చేసి బిల్లుకు దరఖాస్తు చేసుకున్నారు. రూ.13 లక్షలు బిల్లులు చెల్లించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ బిల్లులను జీవీఎంసీ ఫైనాన్స్ విభాగ అధికారులు క్లియర్ చేసేసి ఈనెల 2న ఐటీ విభాగానికి పంపారు. ఐటీ విభాగంలో వెంటనే ఈ బిల్లు క్లియరెన్స్ కావాలి. రెండు వారాలుగా పూర్తి చేయడం లేదు. కాంట్రాక్టర్ వద్ద సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న బొడ్డేటి అనిల్‌కుమార్ కొద్ది రోజులుగా ఈ బిల్లు కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరికి ఐటీ విభాగ ఓఎస్‌డీగా వ్యవహరిస్తున్న జెన్‌కో సహాయ డిప్యూటీ ఇంజనీర్ ఎస్. గోపాలరావును కాంట్రాక్టరు సంప్రదించాడు.
ఆయన రూ. 10 వేలు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆయన ఏసీబీ అధికారులకు చెప్పాడు. వారు ముందస్తు పథక రచన చేశారు. ఆ మేరకు రూ. 8 వేలు చెల్లిస్తానని కాంట్రాక్టరు ఐటీ ఓఎస్‌డీకి చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం నగదును ఐటీ కార్యాలయానికి తీసుకువెళ్లాడు. ఆ మొత్తాన్ని తనకు కాకుండా ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగి జి. రవికి ఇవ్వాలని గోవిందరావు సూచించాడు. ఈ మొత్తాన్ని రవి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంటనే అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్లు గణేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.